Delhi: కొవాగ్జిన్ టీకా భేష్!
ABN , Publish Date - May 03 , 2024 | 03:44 AM
కొవిషీల్డ్ టీకా వల్ల అరుదైన సందర్భాల్లో రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావాలు ఉన్నట్టు సాక్షాత్తూ దాన్ని తయారుచేసిన ఆస్ట్రాజెనెకా సంస్థే ఒప్పుకొన్న నేపథ్యంలో.. భారత్
కొవిషీల్డ్ టీకా దుష్ప్రభావాలపై వార్తల నేపథ్యంలో భారత్ బయోటెక్ ప్రకటన
న్యూఢిల్లీ, మే 2: కొవిషీల్డ్ టీకా వల్ల అరుదైన సందర్భాల్లో రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావాలు ఉన్నట్టు సాక్షాత్తూ దాన్ని తయారుచేసిన ఆస్ట్రాజెనెకా సంస్థే ఒప్పుకొన్న నేపథ్యంలో.. భారత్ బయోటెక్ సంస్థ తెరపైకి వచ్చింది. తాము అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాకు అద్భుతమైన సేఫ్టీ రికార్డు ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు ఆ సంస్థ తన అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో ట్వీట్ చేసింది.
భద్రత, సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకుని అత్యంత జాగ్రత్తగా తాము టీకాను అభివృద్ధి చేశామని వెల్లడించింది. కొవిడ్-19 టీకాల కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన టీకాల్లో.. భారతదేశంలో ఎఫికసీ ట్రయల్స్ జరిగిన ఏకైక టీకా కొవాగ్జినే అని పేర్కొంది. దేశంలో 27వేల మందిపై తమ టీకా ట్రయల్స్ నిర్వహించినట్టు తెలిపింది. తమ టీకా వల్ల రక్తం గడ్డకట్టడం, పెరికార్డైటిస్, మయోకార్డైటిస్ వంటి దుష్ప్రభావాలు నమోదైన కేసు ఒక్కటి కూడా లేదని స్పష్టం చేసింది.