BJP Manifesto: నేడు బీజేపీ మ్యానిఫెస్టో విడుదల
ABN , Publish Date - Apr 14 , 2024 | 03:35 AM
ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా, అధునాతన దేశంగా భారత్ అవతరించేందుకు మోదీ సారథ్యంలో భారతీయ జనతా పార్టీ అనుసరించబోయే...
అధునాతన భారత్, ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా నిలిపేలా అంశాలు
అట్టడుగు వర్గాల అభ్యున్నతికి చోటు
హై స్పీడ్, బుల్లెట్ రైళ్లపై ప్రకటనకు అవకాశం
జాతీయ భద్రతపై కీలక అంశాలుండే చాన్స్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా, అధునాతన దేశంగా భారత్ అవతరించేందుకు మోదీ(PM Modi) సారథ్యంలో భారతీయ జనతా పార్టీ అనుసరించబోయే విధానాలను వివరిస్తూ ఆ పార్టీ తన ఎన్నికల మ్యానిస్టోను(BJP Manifesto) ఆదివారం విడుదల చేయబోతున్నది. ‘మోదీ గ్యారెంటీ-2047 కల్లా వికసిత భారత్’ పేరుతో.. బీజేపీ(BJP) కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఉదయం 8:30కి పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అగ్రనేతలు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి ప్రధాని మోదీ ఈ మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు. అవినీతిపై మోదీ ప్రారంభించిన పోరాటం ఆగదని.. ప్రతిపక్షాలు ఎంత దుష్ప్రచారం చేసినా అవినీతిని నిర్మూలించేందుకు బీజేపీ కట్టుబడి ఉందని, మరిన్ని చట్టాలు చేస్తుందని ఈ మేనిఫెస్టోలో ప్రకటించబోతున్నారు.
సమాజంలో అట్టడుగున ఉన్న యువకులు, మహిళలు, పేదలు, రైతుల అభ్యున్నతికి తీసుకోబోయే చర్యలను కూడా వివరించనున్నారు. రైతులకు గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వగా.. బీజేపీ ఈ విషయంలో ఏం ప్రకటిస్తుందన్న విషయంపై ఆసక్తి నెలకొంది. అభివృద్ధి, సామాజిక న్యాయం, సాంస్కృతిక, జాతీయవాద అంశాలను కూడా బీజేపీ మ్యానిఫెస్టోలో ప్రధానంగా చేర్చారని తెలుస్తోంది. రామ జన్మభూమిలో రామ మందిరాన్ని నిర్మించి కోట్లాది హిందువుల కలను నెరవేర్చిన మోదీ.. భారతీయుల అస్తిత్వాన్ని, మనోభావాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటారని, బూటకపు లౌకికవాదం బీజేపీ ఎజెండా కాదని స్పష్టం చేయనున్నారు.
హై స్పీడ్ రైళ్లు, బుల్లెట్ రైలు కారిడార్ల వంటి అనేక భారీ మౌలిక సదుపాయాలను కూడా మ్యానిఫెస్టోలో ప్రకటించనున్నారు. 2019లో విడుదల చేసిన సంకల్ప్ పత్ర్‌లో పేర్కొన్న హామీల్లో ఎన్ని అమలయ్యాయో బీజేపీ వివరించబోతోంది. జాతీయ భద్రతకు కూడా బీజేపీ కీలక ప్రాధాన్యం ఇవ్వబోతోంది. సరిహద్దుల్లో చెలగాటమాడితే మోదీ మౌనంగా ఉండరని.. దీటుగా సమాధానమిస్తారనే హెచ్చరికను కూడా మ్యానిఫెస్టోలో ప్రకటించబోతున్నారని తెలుస్తోంది.
ప్రజాభిప్రాయంతో మ్యానిఫెస్టో..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కన్వీనర్‌గా వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్ ఉప కన్వీనర్‌గా ఏర్పడిన మ్యానిఫెస్టో కమిటీలో బీజేపీ నేతలు భూపేందర్ యాదవ్, అర్జున్ రాం మేఘ్వాల్, కిరెన్ రిజిజు, అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్, భూపేందర్ పాటిల్, హిమంత విశ్వ శర్మ, శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధరా రాజె, స్మృతి ఇరానీ తదితరులు ఉన్నారు. దాదాపు రెండుసార్లు సమావేశమైన ఈ కమిటీ పలు ప్రతిపాదనలపై చర్చలు జరిపింది. సోషల్ మీడియా, ఇతర మార్గాల ద్వారా ప్రజాభిప్రాయాన్నిసేకరించింది. నమో ఆప్ ద్వారా 4 లక్షల సూచనలను కూడా బీజేపీ స్వీకరించింది.