Lok Sabha Elections: నవనీత్ కౌర్‌పై కేసు నమోదు
ABN , Publish Date - May 10 , 2024 | 02:49 PM
లోక్‌సభ ఎంపీ, మహారాష్ట్రలోని అమ్రావతి లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి నవనీత్ కౌర్ రాణాపై తెలంగాణలోని షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కాంగ్రెస్‌కు ఓటు వేయడమంటే పాకిస్థాన్‌కు ఓటు వేయడమేనంటూ నవనీత్ కౌర్ బీజేపీ హైదరాబాద్ అభ్యర్థి మాధవి లత తరఫున చేసిన ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎంపీ, మహారాష్ట్రలోని అమ్రావతి లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి నవనీత్ కౌర్ రాణా(Navneet Kaur Rana)పై తెలంగాణలోని షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కాంగ్రెస్‌కు ఓటు వేయడమంటే పాకిస్థాన్‌కు ఓటు వేయడమేనంటూ నవనీత్ కౌర్ బీజేపీ హైదరాబాద్ అభ్యర్థి మాధవి లత తరఫున చేసిన ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు.
''ఈసీకి చెందిన ఎఫ్ఎస్‌టీ ఫ్లయింగ్ స్క్వాడ్ నుంచి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించనట్టు మాకు గురువారంనాడు ఫిర్యాదు వచ్చింది. రాహుల్ గాంధీకి ఓటు వేస్తే ఆ ఓటు పాకిస్థాన్‌కు వెళ్తుందంటూ నవనీత్ రాణా వ్యాఖ్యానించినట్టు ఎన్నికల విధుల్లో ఉన్న ఎఫ్ఎస్‌టీ ఫిర్యాదు చేసింది'' అని పోలీసులు తెలిపారు. దీనిపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు.
ఒవైసీ సోదరులపై కూడా నవనీత్ వ్యాఖ్యలు
బీజేవైఎం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన యువ సమ్మేళనంలో ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, ఆయన సోదరుడు అక్బరుద్దీన్‌పై కూడా నవనీత్ కౌర్ విమర్శలు గుప్పించారు. ‘గతంలో ఛోటేమియా(అక్బరుద్దీన్) 15 నిమిషాలు పోలీసులు లేకుంటే తామేంటో చూపిస్తామని అన్నారు. మీకైతే 15 నిమిషాలు.. మాకు 15 సెకన్లు చాలు. ఒవైసీ బ్రదర్స్ ఎక్కడ నుంచి వచ్చారో.. ఎక్కడికి వెళ్లారో కూడా తెలియకుండా చేస్తాం’’ అని అన్నారు. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఘటుగా స్పందించారు. నవనీత్ కౌర్ పేరును రేవంత్ రెడ్డి నేరుగా ప్రస్తావించకుండా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పార్లమెంటు సభ్యురాలిపై ఎన్నికల అధికారులు క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.