Chennai: వర్షం ఆగినా.. తగ్గని వరదనీరు
ABN , Publish Date - Dec 14 , 2024 | 10:42 AM
బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం మన్నార్‌జలసంధి వద్ద తీరం దాటడం, ఈశాన్య రుతుపవనాలు ఉగ్రరూపం దాల్చటంతో నగరంలో రెండు రోజుల పాటు భారీ వర్షం కురిసింది. దీంతో తల్లడిల్లిన నగరవాసులు, శుక్రవారం వరుణదేవుడు కాస్త విశ్రాంతి తీసుకోవడంతో ఊరట చెందారు.
- పొంగి ప్రవహిస్తున్న జలాశయాలు
- అడయార్ వాగు వాసులకు వరద హెచ్చరిక
- నేడు మరో అల్పపీడనం
- 17 నుంచి మళ్ళీ భారీ వర్షాలు
చెన్నై: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం మన్నార్‌జలసంధి వద్ద తీరం దాటడం, ఈశాన్య రుతుపవనాలు ఉగ్రరూపం దాల్చటంతో నగరంలో రెండు రోజుల పాటు భారీ వర్షం కురిసింది. దీంతో తల్లడిల్లిన నగరవాసులు, శుక్రవారం వరుణదేవుడు కాస్త విశ్రాంతి తీసుకోవడంతో ఊరట చెందారు. వర్షం ఆగినా నగరంలోని పల్లపు ప్రాంతాలు, శివారు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధం నుండి బయటపడలేదు. ఈ పరిస్థితుల్లో శనివారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ పరిశోధనా సంస్థ దక్షిణ మండల అధికారి బాలచంద్రన్(Balachandran) ప్రకటించారు.
ఈ వార్తను కూడా చదవండి: జస్టిస్ శేఖర్ యాదవ్‌పై అభిశంసన నోటీసు
ఈ కొత్త అల్పపీడనం కారణంగా 17, 18 తేదీల్లో కుండపోతగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. నగరానికి మంచినీటిని సరఫరా చేసే పూండి, చెంబరంబాక్కం, పుళల్ జలాశయాల్లో నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరటంతో అదనపు జలాలను విడుదల చేస్తున్నారు. దీంతో నగరంలోని అడయార్ వాగు వద్ద వరద పరిస్థితులు ఏర్పడతాయని అధికారులు చెబుతున్నారు.
సిరుగళత్తూరు, కావనూరు, కుండ్రత్తూరు, తిరుముడివాక్కం, వళుదియంబేడు, తీరునీర్‌మలై తదితర ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పుళల్ జలాశయం నుండి సెకనుకు 500 ఘనపుటడుగుల చొప్పున జలాలను విడుదల చేస్తున్నారు. పూందమల్లి తహసీల్దార్ కార్యాలయం జలదిగ్బంధంలోనే ఉంది. వడపెరుంబాక్కం - మాధవరం మధ్య ప్రధాన రహదారిలో అడుగు మేర వర్షపునీరు ప్రవహిస్తుండగటంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు స్తంభించాయి.
మధురాంతకంలో..
చెంగల్పట్టు జిల్లాలో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు 20 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మధురాంతకం నుంచి ఎల్ ఎండత్తూరు మీదుగా ఉత్తిరమేరూరు, కాంచీపురం వెళ్లే ప్రధాన రహదారి వద్ద నున్న ఈ గ్రామాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. శ్రీపెరంబుదూరు చెరువు నీటితో నిండడంతో దాని సమీపంలోని ప్రధానరహదారులపై వరదనీరు ప్రవహిస్తోంది.
ఈవార్తను కూడా చదవండి: Nelakondapalli : కిరాయికి దిగి కిరాతకానికి ఒడిగట్టారు
ఈవార్తను కూడా చదవండి: High Court: మోహన్‌బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ
ఈవార్తను కూడా చదవండి: కుల గణన సర్వేలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు భాగస్వాములు కావాలి
ఈవార్తను కూడా చదవండి: K. Kavitha: ప్రజలను అవమానించేలా తెలంగాణ తల్లి విగ్రహంపై జీవో
Read Latest Telangana News and National News