Delhi Assembly Elctions: సీఎంపై పోటీకి దిగుతున్నదెవరంటే..
ABN , Publish Date - Dec 24 , 2024 | 02:50 PM
'ఆప్' ఇప్పటికే ఢిల్లీ అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాలో 27 మంది అభ్యర్థులను ఖరారు చేసింది.

న్యూఢిల్లీ: 'ఇండియా' కూటమిలో జాతీయ స్థాయిలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్ (Congress), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)లు రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తున్నాయి. 'ఆప్' ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాలో 27 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఆప్ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి (Atishi)పై పార్టీ సీనియర్ నేత అల్కా లంబా (Alka Lamba)ను కాంగ్రెస్ కల్కాజి నియోజకవర్గం నుంచి పోటీకి దింపుతోంది. అల్కా లంబా 2015లో 'ఆప్' టిక్కెట్టుపై చాందినీ చౌక్ నుంచి గెలిచారు. 2019లో పార్టీ నాయకత్వంతో విభేదించి కాంగ్రెస్‌లో చేరారు.
మహిళలకు రూ.3 వేలు సాయం, 400 యూనిట్ల వరకూ కరెంటు ఫ్రీ
కాగా, "ఆప్''కు దీటుగా మేనిఫెస్టో రూపొందించేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోందని ఆ పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. మహిళలకు నెలకు రూ.3,000 ఆర్థిక సాయం, 400 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అనేవి పార్టీ మేనిఫెస్టోలో చేర్చనున్నట్టు చెబుతున్నారు. మేనిఫెస్టోకు తుదిరూపం ఇచ్చేందుకు ఢిల్లీ కాంగ్రెస్ సోమవారంనాడు ఒక సమావేశం నిర్వహించింది.
తొలి జాబితాలో
కాంగ్రెస్ ఇటీవల 21 మందితో పార్టీ అభ్యర్థుల తొలిజాబితా విడుదల చేసింది. మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్‌ను న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీకి దింపింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2013లో ఇదే నియోజకవర్గం నుంచి షీలా దీక్షిత్‌ను కేజ్రీవాల్ ఓడించి తొలిసారి ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు. కాగా, తొలి జాబితాలో కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల్లో ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేంద్ర యాదవ్ (బద్లీ నియోజకవర్గం), హరూన్ యుసుఫ్ (బల్లిమారన్), అభిషేక్ దత్ (కస్తూర్బా నగర్), ద్వారక (ఆదర్శ్ శాస్త్రి), మాజీ ఎంపీ జేపీ అగర్వాల్ కుమారుడు ముదిత్ అగర్వాల్ (చాందినీ చౌక్) తదితరులు ఉన్నారు.
ఫిబ్రవరిలో ఎన్నికలు
ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు 2025 ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగనున్నారు. గత ఎన్నికలు 2020 ఫిబ్రవరిలో జరిగాయి. ఎన్నికల తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ప్రబుత్వాన్ని ఏర్పాటు చేసి మూడోసారి సీఎం పగ్గాలు చేపట్టారు. ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి 2025 ఫిబ్రవరి 15వ తేదీతో ముగియనుంది.
ఇది కూడా చదవండి..
NDA government : గత ఏడాదిన్నరలో..10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం
Chennai: దిండివనం వద్ద పట్టాలపై పగుళ్లు
For National News And Telugu News