ఆగని బాంబు బెదిరింపులు
ABN , Publish Date - Oct 28 , 2024 | 04:41 AM
దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. ఆదివారం 50కిపైగా విమానాలతోపాటు తిరుపతి, లక్నోలోని పలు హోటళ్లకు బెదిరింపులు వచ్చాయి.
ఎయిర్పోర్టులతో పాటు తిరుపతి, లక్నో హోటళ్లకు కూడా..
పౌరవిమానయాన చట్టాల సవరణపై కసరత్తు
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి
న్యూఢిల్లీ, తిరుపతి, లక్నో, అక్టోబరు 27: దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. ఆదివారం 50కిపైగా విమానాలతోపాటు తిరుపతి, లక్నోలోని పలు హోటళ్లకు బెదిరింపులు వచ్చాయి. భద్రతా నిబంధనల మేరకు రెండు విమానాలను దారి మళ్లించారు. మిగిలిన వాటిలో తనిఖీలు చేపట్టి ఎటువంటి ప్రమాదం లేదని తేల్చారు. దీంతో గత రెండు వారాల్లో బెదిరింపులు వచ్చిన విమానాల సంఖ్య 350 దాటింది. తిరుపతిలో మూడు రోజులుగా హోటళ్లకు వస్తున్న బాంబు బెదిరింపులు ఆదివారం కూడా కొనసాగాయి. ఇప్పటి వరకూ ఆరు హోటళ్లకు హెచ్చరికలు రాగా ఆయా హోటళ్లకు వెళ్లి, వాటిని ఖాళీ చేయించి, బాంబు నిర్వీర్య దళంతో తనిఖీలు చేసి ఏమీ లేవని తేల్చారు. ఆదివారం తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం సహా ఇస్కాన్ టెంపుల్కు కూడా బాంబులు పెట్టినట్టు సమాచారం రావడంతో అధికారులు పరుగులు పెట్టారు.
ఎటువంటి ప్రమాదకరమైన వస్తువులు కనిపించకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు యూపీ రాజధాని లక్నోలోని 10 ప్రముఖ హోటళ్లకు ఈమెయిళ్ల ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. తనిఖీల్లో ఎటువంటి పేలుడు పదార్థాలు లేవని వెల్లడైంది. బెదిరింపు మెయిల్స్ కోల్కతాకు చెందిన మిత్ర అనే వ్యక్తి నుంచి వచ్చాయని ప్రాథమికంగా గుర్తించి అతడిని బెంగళూరుకు తరలించారు. తిరుపతి విమానాశ్రయానికి కూడా అదే వ్యక్తి నుంచి బెదిరింపులు అందినట్టు విచారణలో తేలితే ఏర్పేడు పోలీసులకు మిత్రను అప్పగించే అవకాశముందని తెలిసింది. కాగా, నకిలీ బెదిరింపులను అడ్డుకోవటానికి దర్యాప్తు, నిఘా సంస్థలతోపాటు అంతర్జాతీయ సంస్థల సహకారాన్నీ తీసుకుంటున్నామని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు తెలిపారు. రెండు పౌర విమానయాన చట్టాలను కూడా సవరించే కసరత్తు జరుగుతోందన్నారు.