Share News

Hero Vijay: నీట్‌ వద్దు.. వ్యతిరేక తీర్మానానికి సంపూర్ణ మద్దతు

ABN , Publish Date - Jul 04 , 2024 | 12:28 PM

వైద్య విద్యా కోర్సులు చదవాలని ఆకాంక్షించే గ్రామీణ విద్యార్థులకు తీరని నష్టం కలిగించే నీట్‌ రద్దు చేయాల్సిందేనని తమిళగ వెట్రి కళగం నాయకుడు, ప్రముఖ సినీ నటుడు విజయ్‌(Movie actor Vijay) డిమాండ్‌ చేశారు.

Hero Vijay: నీట్‌ వద్దు.. వ్యతిరేక తీర్మానానికి సంపూర్ణ మద్దతు

- రాష్ట్ర సిలబ్‌సలో చదివిన వారికి ఎన్‌సీఈఆర్‌టీ పరీక్షలా?

- విద్యను మళ్ళీ రాష్ట్ర జాబితాలోకి చేర్చాలి

- ఒక దేశం...ఒక సిలబ్‌స...ఒకే పరీక్ష వద్దు

- లీకేజీతో నీట్‌పై సన్నగిల్లిన నమ్మకం

- నిప్పులు చెరిగిన విజయ్‌

- విద్యార్థుల నగదు బహుమతి పంపిణీ

చెన్నై: వైద్య విద్యా కోర్సులు చదవాలని ఆకాంక్షించే గ్రామీణ విద్యార్థులకు తీరని నష్టం కలిగించే నీట్‌ రద్దు చేయాల్సిందేనని తమిళగ వెట్రి కళగం నాయకుడు, ప్రముఖ సినీ నటుడు విజయ్‌(Movie actor Vijay) డిమాండ్‌ చేశారు. రాష్ట్రాన్ని నీట్‌ నుంచి మినహాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ డీఎంకే ప్రభుత్వం శాసనసభలో చేసిన తీర్మానానికి తాను సంపూర్ణ మద్దతునిస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. స్థానిక తిరువాన్మియూరులోని రామచంద్రా కన్వెన్షన్‌ కల్యాణమండపంలో బుధవారం ఉదయం రెండో విడతగా 19 జిల్లాలకు చెందిన 107 శాసనసభ నియోజకవర్గాల్లోని పదో తరగతి, ప్లస్‌-2 పరీక్షలలో ఉత్తీర్ణులైన 640 మంది విద్యార్థులకు నగదు కానుకలు, విద్యా ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి: ‘జికా’... వస్తోంది జాగ్రత్త


ఈ కార్యక్రమంలో విజయ్‌ మాట్లాడుతూ... రెండు రోజులపాటు విద్యార్థులకు నగదు కానుకలు పంపిణీ చేయడంతో అలసిపోయిన తాను ప్రసంగించకూడదనే అనుకున్నానని, అయితే దేశవ్యాప్తంగా కీలకమైన అంశం వివాదాస్పదంగా మారుతుండటంతో దానిపై మౌనం పాటించడం సమంజసం కాదని భావించానన్నారు. ఆ విషయం ఏమిటో సభకు హాజరైన విద్యార్థులందరికీ తెలిసిందేనని, అదే విద్యార్థి లోకానికి తీరని నష్టాన్ని కలిగిస్తున్న నీట్‌ పరీక్ష అని అన్నారు. నీట్‌ వల్ల రాష్ట్రంలోని విద్యార్థినీ విద్యార్థులకు ప్రత్యేకించి మారుమూల గ్రామాల్లోని నిరుపేద విద్యార్థులు, బీసీ, ఎస్సీ,ఎస్టీ విద్యార్థులంతా తీవ్రంగా నష్టపోతున్నారని, వైద్యకోర్సులకు దూరమవుతున్నారన్నదే నూటికి నూరుపాళ్లు నిజమన్నారు. ఈ నీట్‌పై తాను మూడు కోణాల్లో విశ్లేషిస్తానని చెప్పారు. నీట్‌ రాష్ట్ర హక్కులకు వ్యతిరేకమైనదని, 1975కు ముందు విద్య రాష్ట్రాల జాబితాలో ఉండేదని, కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి జాబితాలో చేర్చిందని, అప్పటి నుంచే సమస్య ప్రారంభమైందన్నారు. ఒక దేశం, ఒక సిలబస్‌, ఒకే పరీక్ష అనే సిద్ధాంతంలో విద్యనభ్యసించాలనే ఆశయానికే వ్యతిరేకమైనదన్నారు.

nani1.jpg


ఒక్కో రాష్ట్రానికి తగినట్లు వేర్వేరు సిలబ్‌సలు అమలులో ఉండటమే శ్రేయస్కరమన్నారు. రాష్ట్ర హక్కుల కోసమే తానీ ప్రకటన చేయడం లేదని, విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు రావాలని, విద్య అందరికీ అందుబాటులో ఉండాలన్నదే తన ఆశయమన్నారు. భిన్నత్వంలో ఏకత్వం లేదా బహుముఖత్వాన్ని దేశానికి బలంగా భావించాలే తప్ప బలహీనంగా భావించకూడదన్నారు. ప్రాంతీయ భాషలో రాష్ట్ర సిలబస్‌ ద్వారా చదివే విద్యార్థులకు ఎన్‌సీఈఆర్‌టి సిలబ్‌సలో పరీక్షలు జరుపటం అన్యాయమన్నారు. అందులోనూ రాష్ట్రంలో ప్లస్‌-2 వరకు రాష్ట్ర సిలబ్‌సలో చదివిన కుగ్రామాల విద్యార్థులు ఎన్‌సీఈఆర్‌టీ సిలబ్‌సలో తయారైన నీట్‌ పరీక్ష సులువుగా ఎలా రాస్తారని విజయ్‌ ప్రశ్నించారు. ఇటీవల నీట్‌ పరీక్షలో ప్రశ్నపత్రాల లీకేజీ, అవినీతి అక్రమాలు జరగడంతో ఆ పరీక్షపై ఇంతవరకూ ఉన్న నమ్మకం పూర్తిగా సన్నగిల్లిందన్నారు. నీట్‌ లీకేజీ తర్వాత దేశమంతటా నీట్‌ అనవసరమనే భావనలే ఏర్పడుతున్నాయన్నారు.


వీటన్నింటికీ పరిష్కారమార్గంగా రాష్ట్ర ప్రభుత్వం నీట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని శాసనసభలో చేసిన తీర్మానానికి విజయ్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నీట్‌ మినహాయింపును కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రకటిస్తుందని తాను భావించడం లేదని, రాష్ట్ర ప్రజల ఆశయాన్ని గుర్తించి వీలైనంత త్వరగా నీట్‌ రద్దు చేయడమే మంచిదని చెప్పారు. విద్యను గతంలా రాష్ట్ర జాబితాలో చేర్చితే ఆయా రాష్ట్రాల సిలబ్‌సలో చదివిన విద్యార్థులకు, ఆ సిలబ ్‌సలోని అంశాలతో నిర్వహించే పోటీ పరీక్షలు సులువుగా రాయగలుగుతారని విజయ్‌ అన్నారు. విద్య ఉమ్మడి జాబితాలో ఉండటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించే అంశాలను బుట్టదాఖలు చేయడం కేంద్ర ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని విజయ్‌ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుపుతున్న ఎయిమ్స్‌, జిప్మర్‌ తదితర విద్యా సంస్థల్లో నీట్‌ జరుపుకుంటే తనకెలాంటి అభ్యంతరం లేదని కూడా విజయ్‌ స్పష్టం చేశారు.


టీఎన్‌సీసీ మద్దతు...

నీట్‌ పరీక్షలకు వ్యతిరేకతను ప్రకటించిన తమిళగ వెట్రి కళగం నాయకుడు విజయ్‌పి అభినందిస్తున్నట్లు టీఎన్‌సీసీ అధ్యక్షులు సెల్వపెరుంతగై అన్నారు. ఈ మేరకు ఎక్స్‌ పేజీలో ఆయన ఓ ప్రకటన వెల్లడించారు. విద్యార్థులకు నగదు కానుకల పంపిణీ సభలోనీట్‌పై తనకున్న అభిప్రాయాన్ని విజయ్‌ కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం అభినందనీయమన్నారు. తమిళ ప్రజల చిరకాలపు కోరికగా ఉన్న నీట్‌ పరీక్షల రద్దు త్వరలోనే అమలులోకి రాగలదని విజయ్‌ ప్రసంగం తనకు నమ్మకాన్ని కలిగిస్తోందన్నారు.

Updated Date - Jul 04 , 2024 | 12:28 PM

News Hub