Hero Vijay: జూలై నుంచి రాష్ట్రవ్యాప్తంగా రోడ్‌షోలు..
ABN , Publish Date - Feb 04 , 2024 | 10:31 AM
లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని ‘తమిళగ వెట్రి కళగం’ అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు విజయ్(Vijay) నిర్ణయించారు.
- తిరుచ్చిలో మహానాడుకు సన్నాహాలు
- త్వరలో పార్టీకి పతాక రూపకల్పన
- తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ వ్యూహం
చెన్నై, (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని ‘తమిళగ వెట్రి కళగం’ అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు విజయ్(Vijay) నిర్ణయించారు. అంతేగాక తిరుచ్చి లేదా కడలూరులో పార్టీ తొలి మహానాడును భారీగా నిర్వహించాలని కూడా నిర్ణయించినట్లు తెలిసింది. తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీ స్థాపిస్తున్నట్లు శుక్రవారం విజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రాల షూటింగ్ పూర్తయిన తర్వాత పూర్తిగా రాజకీయ కార్యకలాపాలపైనే దృష్టి సారించనున్నారు. విజయ్ మక్కల్ ఇయక్కమ్ ప్రధాన కార్యదర్శి బుస్సీ నాయకత్వంలో ఆ సంస్థకు చెందిన సీనియర్ నేతలందరికీ పార్టీ సభ్యత్వం కల్పించే పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. అదే సమయంలో పార్టీ ఆశయాలు, నియమ నిబంధనలు, భవిష్యత్తు కార్యాచరణ, పార్టీ పతాకం, చిహ్నం తదితర విషయాలపై మక్కల్ ఇయక్కమ్ సీనియర్ నేతలతో విజయ్ సమగ్రంగా చర్చిస్తున్నారు. పార్టీ విధి విధానాలు, ఆశయాలు ఖరారైన తర్వాత ఆయన రాష్ట్రవ్యాప్తంగా రోడ్‌షోలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నారు.
బాహిరంగ సభలు... రోడ్‌షోలు
కోయంబత్తూరు, తిరుచ్చి, కడలూరు, మదురై తదితర నగరాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని, అదే సమయంలో కుగ్రామాల్లో రోడ్‌షోలు నిర్వహించి స్థానిక ప్రజలతో సాన్నిహిత్యంగా మెలగాలని ఆయన పథకాలు సిద్ధం చేసుకున్నట్లు అనుచరులు చెబుతున్నారు. జూలై లేదా ఆగస్టులో విజయ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తారని చెప్పారు. రాష్ట్రంలోని 234 నియోజకవర్గాలలోనూ ఆయన పర్యటించం ఖాయమని కూడా చెబుతున్నారు. 2011లో నాగపట్టినంలో తన అభిమాన సంఘాల ఆధ్వర్యంలో భారీ మహానాడును నిర్వహించారు. ఆ మహానాడుకు లక్షలాదిమంది ప్రజలు, జాలర్లు హాజరయ్యారు. ఆ మహానాడు జనాన్ని చూసి రెండు ద్రవిడ పార్టీల నేతలు విస్తుపోయారు. ప్రస్తుతం రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత నిర్వహించనున్న పార్టీ మహానాడును కూడా అంతే స్థాయిలో భారీ ఏర్పాట్ల నడుమ జరపాలని నిర్ణయించారు.
కమల్ శుభాకాంక్షలు...
విజయ్ రాజకీయ పార్టీని ప్రారంభించడాన్ని స్వాగతిస్తూ మక్కల్ నీది మయ్యం అధినేత కమలహాసన్(Kamala Haasan) శుభాకాంక్షలు తెలిపారు. విజయ్‌కి ఫోన్ చేసి సినీరంగంలో సాధించినట్లే రాజకీయ రంగంలోనూ పలు విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నానని ఆయన తెలిపారు. ఇక డీఎంకే ఎంపీ కనిమొళి స్పందిస్తూ విజయ్ రాజకీయ ప్రవేశం వల్ల 2026లో జరిగే శాసనసభ ఎన్నికల్లో డీఎంకేకు ఎలాంటి నష్టం జరగబోదన్నారు. అదే సమయంలో ప్రజాస్వామ్య దేశంలో రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చునని, ప్రజాభిమానం ఉంటే ఉన్నత స్థితికి చేరుకుంటారని తెలిపారు. పార్టీని ప్రారంభించిన విజయ్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.
తమిళిసై కామెంట్...
నటుడు విజయ్ రాజకీయ పార్టీని ప్రారంభించడం పట్ల పుదుచ్చేరి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Governor Tamilisai Soundararajan) హర్షం ప్రకటించారు. రాష్ట్రంలో ఒకే కుటుంబానికి చెందినవారే రాజకీయ నాయకులుగా ఉండటం సరైన పద్ధతి కాదంటూ డీఎంకేపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఏ రంగానికి చెందినవారైన రాజకీయాల్లో రావచ్చునని, విజయ్‌తోపాటు పలువురు రాజకీయ నేతలు రాష్ట్రానికి చాలా అవసరమని ఆమె తెలిపారు.