జిల్లా కోర్టు నుంచి సర్వోన్నత న్యాయస్థానానికి
ABN , Publish Date - Nov 10 , 2024 | 04:04 AM
జస్టిస్ సంజీవ్ ఖన్నా... న్యాయ వ్యవస్థలో శిఖరాగ్రస్థానానికి చేరుకోనున్నారు. జిల్లా కోర్టులో న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన భారత ప్రధాన న్యాయమూర్తిగా కర్తవ్యాన్ని నిర్వహించనున్నారు.
51వ సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా
రేపు రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం
ఆరు నెలలపాటు బాధ్యతలు
న్యూఢిల్లీ, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): జస్టిస్ సంజీవ్ ఖన్నా... న్యాయ వ్యవస్థలో శిఖరాగ్రస్థానానికి చేరుకోనున్నారు. జిల్లా కోర్టులో న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన భారత ప్రధాన న్యాయమూర్తిగా కర్తవ్యాన్ని నిర్వహించనున్నారు. సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ పదవీ కాలం ఆదివారంతో ముగియనుండడంతో మరుసటి రోజునే పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్రపతి భవన్లో ఆ రోజు ఉదయం జరిగే కార్యక్రమంలో జస్టిస్ సంజీవ్ ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించనున్నారు. అనంతరం ఆయన అక్కడి నుంచి నేరుగా సుప్రీంకోర్టుకు చేరుకుంటారు. కోర్టు నంబర్-1లో సీజేఐ హోదాలో కేసుల విచారణను ప్రారంభిస్తారు. ఆయన దాదాపు ఆరు నెలల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. వచ్చే ఏడాది మే 13న తన 65వ పుట్టినరోజుకు ఒకరోజు ముందు పదవీ విరమణ చేయనున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో జస్టిస్ ఖన్నా తన అలవాట్లను మార్చుకోనున్నారు. తనకెంతో ఇష్టమైన మార్నింగ్ వాక్కు విరామం ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు ఆయన ప్రతి రోజూ లోధి గార్డెన్ వద్ద ఒంటరిగా మార్నింగ్ వాక్ చేసేవారు. ఇప్పుడు తనను అందరూ గుర్తుపట్టే అవకాశం ఉండడం, భద్రత కారణాలు కూడా ఉండడంతో ఉదయపు నడకకు విరామం ప్రకటించినట్టు సమాచారం.
కుటుంబ నేపథ్యం
జస్టిస్ సంజీవ్ ఖన్నా న్యాయమూర్తుల కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి జస్టిస్ దేవరాజ్ ఖన్నా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. చిన్నాన్న జస్టిస్ హన్సరాజ్ ఖన్నా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించారు. ఢిల్లీలోని బరాఖంబా రోడ్‌లోని మోడరన్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తిచేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా 1980లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకున్నారు. అదే యూనివర్సిటీలో న్యాయవిద్యను అభ్యసించారు. 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా పేరును నమోదు చేసుకున్నారు. తీస్ హజారీ కాంప్లెక్స్‌లోని జిల్లా న్యాయస్థానంలో తొలుత ప్రాక్టీస్ చేశారు. 2004లో ఢిల్లీ ప్రభుత్వం తరఫున నేషనల్ క్యాపిటల్ టెరిటరీకి స్టాండింగ్ కౌన్సెల్‌గా నియమితులయ్యారు. 2005లో ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2006లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 జనవరి 18న సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, తన చిన్నాన్న జస్టిస్ హెచ్.ఆర్.ఖన్నా కూర్చొన్న కోర్టు గది నుంచి తన మొదటి రోజును ప్రారంభించారు. ప్రస్తుతం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సేవలు అందిస్తున్నారు.