Share News

National : విద్యుత్తు కమిషన్‌పై సుప్రీంకు కేసీఆర్‌

ABN , Publish Date - Jul 15 , 2024 | 04:05 AM

తెలంగాణ ప్రభుత్వం నియమించిన విద్యుత్తు కమిషన్‌ను రద్దు చేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విద్యుత్తు కమిషన్‌ విచారణను....

National : విద్యుత్తు కమిషన్‌పై సుప్రీంకు కేసీఆర్‌

  • కమిషన్‌ను రద్దు చేయాలంటూ పిటిషన్‌

  • నేడు విచారణ చేపట్టనున్న సీజేఐ ధర్మాసనం

న్యూఢిల్లీ, జూలై 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం నియమించిన విద్యుత్తు కమిషన్‌ను రద్దు చేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విద్యుత్తు కమిషన్‌ విచారణను కొనసాగించవచ్చని హైకోర్టు సీజే ధర్మాసనం ఇచ్చిన తీర్పును..

దేశ సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్‌ చేశారు. కేసీఆర్‌ పిటిషన్‌పై సోమవారం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని జస్టిస్‌ జేబీ పార్థివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించనుంది. బీఆర్‌ఎస్‌ హయాంలో తీసుకున్న విద్యుత్తు రంగ నిర్ణయాలపై రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్‌ నరసింహారెడ్డి నేతృత్వంలో జ్యుడీషియల్‌ కమిషన్‌ను నియమించిన విషయం తెలిసిందే..!

అయితే.. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా కమిషన్‌ను ఏర్పాటు చేశారని, వెంటనే విచారణ నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వాలని కేసీఆర్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. విద్యుత్తు కమిషన్‌ను రద్దు చేయాలన్న కేసీఆర్‌ పిటిషన్‌ను హైకోర్టు సీజే ధర్మాసనం కొట్టేసింది. కేసీఆర్‌ ఆరోపించినట్లుగా జస్టిస్‌ నర్సింహారెడ్డి ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఎక్కడా స్పష్టం కావడం లేదని పేర్కొంది. అనుమానించడం తగదని, అందుకు తగ్గ ఆధారాలను చూపించాలని సూచించింది. ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదని తేల్చిచెప్పింది. దీంతో కేసీఆర్‌ సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్లారు.

Updated Date - Jul 15 , 2024 | 04:05 AM