Mamata Banerjee: అది చట్టవిరుద్ధం.. కోల్‌కతా హైకోర్టు తీర్పుపై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 22 , 2024 | 05:45 PM
పశ్చిమ బెంగాల్‌లో ‘2016 టీచర్ రిక్రూట్‌మెంట్’ ద్వారా నియమితులైన 26 వేల మంది ఉద్యోగాలను రద్దు చేస్తూ.. కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ఉపాధ్యాయ నియామక ప్రక్రియను పూర్తిగా రద్దు చేయడం...
పశ్చిమ బెంగాల్‌లో (West Bengal) ‘2016 టీచర్ రిక్రూట్‌మెంట్’ ద్వారా నియమితులైన 26 వేల మంది ఉద్యోగాలను రద్దు చేస్తూ.. కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తీవ్రంగా స్పందించారు. ఉపాధ్యాయ నియామక ప్రక్రియను పూర్తిగా రద్దు చేయడం చట్ట విరుద్ధమని మండిపడ్డ ఆమె.. హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తామని ఉద్ఘాటించారు. ఉద్యోగులు కోల్పోయిన వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఉత్తర బెంగాల్‌లోని రాయ్‌గంజ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు.. అమెరికా రిపోర్ట్‌లో షాకింగ్ విషయాలు
‘‘2016 టీచర్ రిక్రూట్‌మెంట్ ద్వారా చేసిన నియామకాలను, ఉపాధ్యాయ నియామక ప్రక్రియను పూర్తిగా రద్దు చేయడం చట్ట విరుద్ధం. ఉద్యోగాలు కోల్పోయిన వారికి అండగా నిలబడతాం. వారికి న్యాయం జరిగేవరకు పోరాడతాం. ఈ తీర్పుని మేము ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేస్తాం. ఉద్యోగాలు కోల్పోయిన వారు అధైర్యపడొద్దు. అయినా.. కేవలం నాలుగు వారాల్లోపు 8 సంవత్సరాల వేతనాన్ని తిరిగి చెల్లించడం ఎలా సాధ్యమవుతుంది?’’ అని మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఉద్యోగాలను రద్దు చేయడంతో పాటు.. వేతనాన్ని తిరిగి ఇచ్చేయాలన్న కోర్టు ఆదేశాలను తాము కచ్ఛితంగా సవాలు చేసి తీరుతామని ఆమె పునరుద్ఘాటించారు.
ఇదే సమయంలో మమతా బెనర్జీ కేంద్రంలోని బీజేపీపై విరుచుకుపడ్డారు. కొందరు బీజేపీ నేతలు న్యాయవ్యవస్థను, న్యాయమూర్తులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఇటీవల బీజేపీ నేత సువేందు అధికారి చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంటుందని ఆయన చెప్పారని, కోర్టు తీర్పు రాకముందే వారికెలా తెలిసిందంటూ మమతా ప్రశ్నించారు. ఇందుకు సువేందు వెంటనే బదులిస్తూ వివరణ ఇచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోని తిరుగుబాట్లతో పాటు అనిశ్చిత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తాను అలా చెప్పానని చెప్పుకొచ్చారు.
షాకింగ్ ఘటన.. కంట్లో కారం కొట్టి, పెళ్లికూతురిని ఈడ్చుకెళ్తూ..
ఇదిలావుండగా.. 2016లో బెంగాల్ ప్రభుత్వం 24,650 ఖాళీలను భర్తీ చేసేందుకు పోటీ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలకు 23 లక్షల మందికి పైగా హాజరవ్వగా.. 25,753 మందికి అపాయింట్‌మెంట్ లెటర్లు ఇచ్చారు. అయితే.. ఈ నియామక ప్రక్రియలో అవకతవలు జరిగాయని ఆరోపణలొచ్చాయి. దీనిపై విచారణ జరిపిన కోల్‌కతా హైకోర్టు.. 2016 నాటి స్టేట్ లెవల్ సెలక్షన్ టెస్ట్ (SLST) నియామక ప్రక్రియ చెల్లదని స్పష్టం చేసింది. ఆ నియామకాలను రద్దు చేయాలని ఆదేశించడంతో పాటు ఉద్యోగులు తమ వేతనాల్ని తిరిగివ్వాలని కోర్టు వెల్లడించింది.
Read Latest National News and Telugu News