Share News

Ratna Bhandar: మళ్లీ తెరిచిన పూరీ జగన్నాథ రత్న భండార్.. ఎందుకంటే?

ABN , Publish Date - Jul 18 , 2024 | 12:01 PM

ఒడిశాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం పూరీ జగన్నాథుడి రత్న భండార్‌ని ఆదివారం తెరిచిన విషయం విదితమే. అయితే గురువారం మరోసారి ఆలయ అధికారులు రత్న భండార్‌ని తెరిచారు. ఇందులోని(Ratna Bhandar) ఇంకా కొన్ని విలువైన వస్తువులను తరలించకపోవడంతో మళ్లీ తెరిచినట్లు అధికారులు చెబుతున్నారు.

Ratna Bhandar: మళ్లీ తెరిచిన పూరీ జగన్నాథ రత్న భండార్.. ఎందుకంటే?

భువనేశ్వర్: ఒడిశాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం పూరీ జగన్నాథుడి రత్న భండార్‌ని ఆదివారం తెరిచిన విషయం విదితమే. అయితే గురువారం మరోసారి ఆలయ అధికారులు రత్న భండార్‌ని తెరిచారు. ఇందులోని(Ratna Bhandar) ఇంకా కొన్ని విలువైన వస్తువులను తరలించకపోవడంతో మళ్లీ తెరిచినట్లు అధికారులు చెబుతున్నారు. వాటిని తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్‌కు బదిలీ చేయనున్నారు. ఇవాళ ఉదయం 9:51 గంటలకు పర్యవేక్షక కమిటీ సభ్యులు గుడిలోకి వెళ్లారు. వస్తువులను తరలించడం, పర్యవేక్షించడానికి ఒడిశా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సభ్యులు స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపారు.

వీరంతా ఉదయం 9 గంటలకు ఆలయంలోకి ప్రవేశించి పునరావాస ప్రక్రియను ప్రారంభించారు. ఆలయంలోకి ప్రవేశించే ముందు పర్యవేక్షక కమిటీ చైర్మన్, ఒడిశా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ మీడియాతో మాట్లాడుతూ.. రత్నభాండార్ లోపలి గదిలో భద్రపరిచిన అన్ని విలువైన వస్తువులను తిరిగి తీసుకురావడానికి జగన్నాథుడి ఆశీర్వాదం తీసుకున్నట్లు చెప్పారు. రహస్య గదిని తెరవడంతో అందులోని సంపదను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. ఆదివారం రహస్య గదిని తెరిచినా అప్పటికే సాయంత్రం కావడంతో సీల్ వేశారు. ఈ క్రమంలో ఆలయంలోకి భక్తులు ప్రవేశాన్ని నిలిపేశారు.


తరలింపు ప్రక్రియ వీడియో..

సంప్రదాయ దుస్తులు ధరించిన వ్యక్తులను మాత్రమే ట్రెజరీలోకి అనుమతిస్తున్నామని పూరీ కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వైన్ తెలిపారు. "విలువైన వస్తువుల తరలింపు ఇవాళ పూర్తి కాకపోతే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) ప్రకారం పని కొనసాగుతుంది. మొత్తం ప్రక్రియను వీడియో తీస్తున్నాం" అని స్వైన్ పేర్కొన్నారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి ఆలయంలోకి వచ్చే భక్తుల ప్రవేశంపై ఆంక్షలు విధించారు.

46 ఏళ్ల తర్వాత..

46 ఏళ్ల తర్వాత పూరీ జగన్నాథ స్వామి ఆలయ రత్న భాండాగారాన్ని ఆదివారం మధ్యాహ్నం 1.28 గంటలకు తెరిచారు. మూడో గదిలోకి 11 మందితో ఉన్న బృందం ప్రవేశించింది. నిధి కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన పెట్టెలు, తాళం ఓపెన్ కాకుంటే తెరచేందుకు ప్రత్యేకమైన యంత్రాలను తీసుకెళ్లారు.


తాళం మాయంపై వివాదం..

2018లో రత్న భాండాగారం తాళం చెవి కనిపించకుండా పోవడం సంచలనం సృష్టించింది. ఈ తాళానికి డూప్లికేట్ మాత్రమే ఉంది. దీనిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. రాజకీయంగానూ ఈ వ్యవహారం దుమారం రేపింది. జ్యుడీషియల్ కమిషన్‌ ఏర్పాటై దీనిపై విచారణ చేపట్టింది. అప్పటి నుంచి ఈ తాళం చెవి గురించి చర్చ జరుగుతూనే ఉంది. ఇటీవల ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ తాళం గురించి ప్రస్తావించడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది.


6 సంవత్సరాలుగా తాళం కనిపించకుండా పోయినా నవీన్ పట్నాయక్ సర్కార్ ఏమీ పట్టించుకోలేదని మోదీ విమర్శించారు. తమిళనాడుకి ఈ తాళాన్ని పంపించారంటూ ఆరోపించారు. ఈలోగా ఎన్నికల ఫలితాలు వచ్చి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఆలయంలో సంస్కరణలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. అందులో భాగంగానే రత్న భాండాగారాన్ని తెరిపించింది.

For Latest News and National News click here

Updated Date - Jul 18 , 2024 | 12:35 PM