Share News

Rajya Sabha: మాది సామాన్యూడి మాట, మోదీది మనసులో మాట: ఖర్గే

ABN , Publish Date - Jul 01 , 2024 | 02:47 PM

రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరుగుతున్న చర్చలో రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే సోమవారంనాడు పాల్గొంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. విపక్ష పార్టీలు సామాన్య ప్రజానీకం గురించి మాట్లాడుతుంటే, ప్రధాని మోదీ మాత్రం తన మనసులోని మాట గురించి మాట్లాడుతుంటారని అన్నారు.

Rajya Sabha: మాది సామాన్యూడి మాట, మోదీది మనసులో మాట: ఖర్గే

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరుగుతున్న చర్చలో రాజ్యసభ (Rajya Sabha) విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) సోమవారంనాడు పాల్గొంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. విపక్ష పార్టీలు సామాన్య ప్రజానీకం గురించి మాట్లాడుతుంటే, ప్రధాని మోదీ మాత్రం తన మనసులోని మాట (Mann Ki Baaat) గురించి మాట్లాడుతుంటారని అన్నారు. పార్లమెంటులో రాష్ట్రపతికి కీలభ భూమిక ఉందని, తాము రాష్ట్రపతిని గౌరవిస్తామని చెప్పారు. ఈఏడాది రాష్ట్రపతి తొలి ప్రసంగం జనవరిలోనూ, రెండో ప్రసంగం జూన్‌లోనూ చేశారని, ఎన్నికల కోసం తొలి ప్రసంగం చేస్తే, రెండవది దానికి కాపీ మాత్రమేనని అన్నారు. దళితులు, మైనారిటీ వర్గాలు, వెనుకబడిన తరగతుల గురించి ఎక్కడా రాష్ట్రపతి తమ ప్రసంగంలో ప్రస్తావించనే లేదని, రాష్ట్రపతి ప్రసంగానికి ఒక విజన్ కానీ, డైరెక్టన్ కానీ లేదని పేర్కొన్నారు. గత ప్రసంగం తరహాలోనే ఈసారి కూడా ప్రభుత్వాన్ని అభినందించే మాటలే ప్రసంగమంతా ఉన్నాయన్నారు.


మణిపూర్ ఉద్రిక్తతలపై..

మణిపూర్ రగులుతుండటడాన్ని ఖర్గే ప్రస్తావిస్తూ, నినాదాలు ఇవ్వడంలో ప్రధానమంత్రి నిపుణుడని, ఏడాదిగా మణిపూర్ రగులుతున్నా ఆ రాష్ట్రంలో ఒక్కసారి కూడా ఆయన పర్యటించలేదని తప్పుపట్టారు. పార్లమెంటు కాంప్లెక్స్‌లోని మహాత్మాగాంధీ, అంబేడ్కర్, ఇతర నాయకుల విగ్రహాలను తిరిగి యథాస్థానంలో ఉంచాలని డిమాండ్ చేశారు. అగ్నివీర్ పథకాన్ని రద్దు చేయాలని, ఎలాంటి ప్లానింగ్ లేకుండా తీసుకువచ్చిన అగ్నివీర్ వంటి తుగ్లక్ స్కీముల వల్ల యువత మనోస్థైర్యం దెబ్బతిందని, అగ్నివీర్ పథకాన్ని ఆపేయాలని కూడా డిమాండ్ చేశారు.

Lok Sabha:నీట్ పేపర్ లీకేజీపై చర్చకు లోక్‌సభలో విపక్షాల పట్టు..


'నీట్' నోటీసులను తోసిపుచ్చిన ధన్‌ఖడ్

కాగా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్ పరీక్షల పేపర్ లీక్ వ్యవహారంపై ఎంపీలు ఇచ్చిన నాలుగు నోటీసులను రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ తోసిపుచ్చారు. దీనిపై నిష్పాక్షిక విచారణకు ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించినందున నోటీసులను తిరస్కరిస్తున్నట్టు ఆయన పేర్కొ్న్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోెసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jul 01 , 2024 | 02:47 PM