Lok Sabha: రాహుల్‌ను 'చైల్డ్'తో పోల్చిన మోదీ.. సభలో నవ్వులే నవ్వులు
ABN , Publish Date - Jul 02 , 2024 | 06:17 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలో మంగళవారంనాడు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ రాహుల్ గాంధీ పై చతురోక్తులు గుప్పించారు. ఆయనను 'చిన్నపిల్లోడు' గా అభివర్ణించారు.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)లోక్‌సభలో మంగళవారంనాడు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై చతురోక్తులు గుప్పించారు. ఆయనను 'చిన్నపిల్లోడు' (Child)గా అభివర్ణించారు. విపక్షాలకు చురకలు వేస్తూ, ప్రజాతీర్పును విపక్షాలు హుందాగా స్వీకరించాలని, ఓటమిని విజయంగా అభివర్ణించుకోవద్దని చురకలు వేశారు. రాహుల్‌ను చిన్నపిల్లాడితో పోలుస్తూ, వైఫల్యాల విషయంలో ఆ పిల్లోడు సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారని అన్నారు.
ఒక ఘటన గుర్తుకొస్తోంది..
''నాకు ఒక ఘటన గుర్తుకొస్తోంది. ఒక బాలుడు ఉన్నాడు. అతనికి 99 మార్కులు వచ్చాయి. ఆ మార్కుల్ని ప్రతి ఒక్కరికీ చూపిస్తున్నాడు. 99 మార్కులు వచ్చాయని తెలిసి అతన్ని అందరూ అభినందిస్తున్నారు. అప్పుడు ఒక టీచర్ అక్కడకు వచ్చి, స్వీట్లు ఎందుకు పంచుతున్నావని అడిగింది. ఇంతకూ ఆ పిల్లోడికి 100కి 99 మార్కులు రాలేదు, 543కి 99 మార్కులు వచ్చాయి. ఇప్పుడు ఆ పిల్లాడికి వైఫల్యాల పరంగా నువ్వు ప్రపంచ రికార్డు సృష్టించావని ఎవరు చెబుతారు?'' అని పరోక్షంగా రాహుల్‌ను ఉద్దేశించి మోదీ పేర్కొనడంతో అధికార పక్షం ఎంపీలు నవ్వులు చిందించారు. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 సీట్లు గెలుచుకుంది.