Lok Sabha Elections: కరసేవకులను సజీవదహనం చేసిన వారికి అండగా నిలిచిన లాలూ.. మోదీ ఫైర్
ABN , Publish Date - May 04 , 2024 | 07:31 PM
బీహార్‌లోని దర్బంగాలో శనివారంనాడు జరిగిన ఎన్నికల సభలో ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘాటు విమర్శలు చేశారు. 2002 గోద్రా రైలు దహనం ఘటనను ప్రస్తావిస్తూ, కరసేవకులను సజీవ దహనం చేసిని వారిని రక్షించేందుకు లాలూ ప్రయత్నించారని ఆరోపించారు.
దర్బంగా: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) ప్రచారంలో విపక్షాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) వాగ్బాణాల జోరు పెరుగుతోంది. బీహార్‌లోని దర్బంగాలో శనివారంనాడు జరిగిన ఎన్నికల సభలో ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav)పై ఘాటు విమర్శలు చేశారు. 2002 గోద్రా రైలు దహనం ఘటనను ప్రస్తావిస్తూ, కరసేవకులను సజీవ దహనం చేసిని వారిని రక్షించేందుకు సోనియాగాంధీ హయాంలో లాలూ ప్రసాద్ యాదవ్ ప్రయత్నించారని ఆరోపించారు. కల్లోలిత సమయాల్లో కూడా బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడటం విపక్షాలకు ఆనవాయితీగా మారిందని ఎద్దేవా చేశారు.
బుజ్జగింపు రాజకీయాల కారణంగానే బీహార్ షెహజాదా (తేజస్వి యాదవ్) తండ్రి (లాలూ) గోద్రా రైలు దహనకాండకు పాల్పడిన వారిని కాపాడే ప్రయత్నం చేశారని, సోనియాగాంధీ హయాంలో ఇది జరిగిందని ప్రధాని చెప్పారు. పశుగ్రాసం కుంభకోణంలో దోషి అయిన లాలూ అప్పుడు రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారని తెలిపారు. ఆయన ఒక దర్యాప్తు కమిటీని కూడా వేశారని, గోద్రా అమానుష ఘటనకు పాల్పడినట్టు చెబుతున్న వారిపై క్రిమినల్ ఆరోపణల్లో నిజం లేదంటూ నివేదిక తెప్పించుకున్నారని, అయితే ఆ నివేదికను కోర్టు చెత్తబుట్టలో పడేసిందని మోదీ చెప్పారు.
Lok Sabha Elections 2024: మా అన్న యువరాజైతే ఆయన చక్రవర్తి.. మోదికి ప్రియాంక కౌంటర్
రాహుల్, తేజస్వి యాదవ్ పేర్లను ప్రధాని నేరుగా ప్రస్తావించకుండా వారిపై వ్యంగ్యోక్తులు గుప్పించారు. ''ఢిల్లీలో ఒక యువరాజు ఉన్నాడు. పాట్నాలో కూడా ఒక యువరాజు ఉన్నాడు. ఒక యువరాజు చిన్నప్పటి నుంచి ఈ దేశాన్ని తన రాజ్యంగా అనుకుంటూ ఉంటాడు. మరో యువరాజు బీహార్ తన రాజ్యం అనుకుంటాడు. ఇద్దరి రిపోర్టు కార్డులు కూడా ఒక్కటే. స్కాములు, ఆటవిక పాలన తప్ప వారి ప్రోగ్రస్ కార్డులో ఏవీ కనిపించవు'' అని మోదీ విమర్శించారు. ముస్లింలకు రిజర్వేషన్లు అంటూ రిజర్వేషన్ల అంశాన్ని 'ఇండియా' కూటమి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు. మతం పేరుతో రిజర్వేషన్లు ఉండరాదనే బాబా సాహెబ్ అంబేడ్కర్, తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అభిప్రాయాలకు భిన్నంగా కూటమి నేతలు వ్యవహరిస్తున్నారని తప్పుపట్టారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..