Supreme Court : పోలింగ్ ముగిసిన 48 గంటల్లో వివరాలన్నీ ఇవ్వాలి
ABN , Publish Date - May 18 , 2024 | 04:35 AM
ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన 48 గంటల్లోగా ఓటింగ్‌కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్లో పెట్టాలంటూ దాఖలైన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది.
సుప్రీంలో పిటిషన్.. అత్యవసర విచారణ చేపట్టిన ధర్మాసనం
న్యూఢిల్లీ, మే 17: ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన 48 గంటల్లోగా ఓటింగ్‌కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్లో పెట్టాలంటూ దాఖలైన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం శుక్రవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో విచారణ ప్రారంభించింది.
న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్ ఎ.ఎ్‌స.బోపన్న గౌరవార్థం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వీడ్కోలు సభ ముగిసిన తర్వాత సీజేఐ విచారణను చేపట్టడం గమనార్హం. ఈ కేసును శుక్రవారమే చేపట్టాలంటూ ఉదయమే న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోరారు. అందుకు స్పందించిన సీజేఐ కోర్టు సమయం ముగిసిన తరువాత కూడా విచారణ జరిపారు.
ఈ అంశంపై సమాధానం ఇచ్చేందుకు సమయం కావాలని ఈసీ తరఫు న్యాయవాది కోరడంతో ఇది సమంజసమేనని, వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. తగిన వెకేషన్ బెంచ్ ముందు ఈ నెల 24న లిస్ట్ చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. ఏడీఆర్ స్వచ్ఛంద సంస్థ ఈ పిటిషన్ దాఖలు చేసింది.