Share News

Delhi: దేశ రాజధానిలో దారుణం.. ఆ పనికి ఒప్పుకోలేదని.. బాబోయ్..

ABN , Publish Date - Oct 23 , 2024 | 10:01 AM

ఢిల్లీ నగరం తిలక్ నగర్‌లో రెండేళ్లుగా ఓ వివాహిత భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటోంది. అదే అపార్ట్‌మెంట్ గ్రౌండ్ ఫ్లోర్‌లో నిందితుడు అతని అక్క, బావతో కలిసి ఉంటున్నాడు.

Delhi: దేశ రాజధానిలో దారుణం.. ఆ పనికి ఒప్పుకోలేదని.. బాబోయ్..

న్యూఢిల్లీ: మహిళలపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కామాంధుల్లో మాత్రం భయం కలగడం లేదు. నిత్యం పిల్లలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతూ కామవాంఛలు తీర్చుకోవాలని చూస్తున్నారు. ప్రతిఘటిస్తున్న వారిని హతమారుస్తున్నారు. అలాంటి ఘటనే ఒకటి దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వెలుగు చూసింది. ఓ వివాహితపై కామాంధుడు అత్యాచారయత్నం చేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దారుణానికి ఒడికట్టాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన ఢిల్లీ నగరంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.


కన్నేసిన కామాంధుడు..

ఢిల్లీ నగరం తిలక్ నగర్‌లో రెండేళ్లుగా ఓ వివాహిత భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటోంది. అదే అపార్ట్‌మెంట్ గ్రౌండ్ ఫ్లోర్‌లో నిందితుడు అతని అక్క, బావతో కలిసి ఉంటున్నాడు. మహిళపై కన్నేసిన కామాంధుడు కొన్ని నెలలుగా ఆమె వెంట పడుతున్నాడు. తనతో శారీరకంగా కలవాలని, భర్త పిల్లలను వదిలేసి తనతోపాటు వచ్చేయాలంటూ బెదిరింపులకు దిగుతున్నాడు. అందుకు మహిళ ఒప్పుకోకపోవడంతో ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఆ క్రమంలో సోమవారం ఉదయం బాధితురాలి పిల్లలు పాఠశాలకు వెళ్లిపోగా, భర్త ఉద్యోగానికి వెళ్లారు. అదే సమయంలో ఒంటరిగా ఉన్న మహిళను గమనించిన నిందితుడు వారి ఫ్లాట్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు. తనతో శారీరకంగా కలివాలని డిమాండ్ చేశాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో అత్యాచారయత్నం చేశాడు.


కత్తితో పొడిచి..

మహిళ గట్టిగా ప్రతిఘటించడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో దాదాపు 25సార్లు పొడిచాడు. తీవ్రగాయాలతో బాధితురాలు కేకలు వేసుకుంటూ గ్రౌండ్ ఫ్లోర్ వైపు పరుగులు తీసింది. వెంటనే భర్తకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది. మరి కాసేపట్లో తాను చనిపోతున్నట్లు బోరున ఏడ్చింది. ఇంతలో కిందకు వచ్చిన కామాంధుడు మళ్లీ దాడికి ప్రయత్నించాడు. అయితే వివాహిత కేకలతో అప్పటికే అక్కడికి చేరుకున్న స్థానికులు, నిందితుడి బావ అతణ్ని గదిలో బంధించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతణ్ని అరెస్టు చేశారు. బాధిత మహిళలను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు.


రెండు నెలలుగా..

మరోవైపు బాధితురాలి భర్త ఘటనపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడు తమ అపార్ట్‌మెంట్ గ్రౌండ్ ఫోర్ల్‌లో ఉంటాడని, రెండు నెలలుగా తన భార్యను వేధిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇటీవల అతని భార్య వదిలేసిందని, దీంతో అక్క, బావతో కలిసి ఉంటూ మెకానిక్‌గా పని చేస్తున్నాడని తెలిపాడు. పొరుగువారు కదా అని మంచిగా మాట్లాడితే, తన వెంట వచ్చేయాలని తన భార్యను వేధించాడని తెలిపాడు. ఇదే విషయమై రెండు నెలల కిందట గొడవ జరగగా.. నిందితుడు సోదరి బతిమిలాడితే ఫిర్యాదు చేయలేదని చెప్పాడు.


నిందితుడి అరెస్టు..

ఆ ఘటన జరిగిన తర్వాత మళ్లీ కత్తితో బెదిరించి భర్త, పిల్లలను వదిలేసి తనతో వచ్చేయాలని బెదిరింపులకు దిగినట్లు వివరించాడు. అప్పుడు కూడా నిందితుడి సోదరి క్షమాపణలు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిపాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిపై అత్యాచారయత్నం, హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అతనిడి అరెస్టు చేసి నేరానికి ఉపయోగించిన కత్తినీ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది.

Updated Date - Oct 23 , 2024 | 10:01 AM