Share News

Navya : అందమైన జ్ఞాపకం

ABN , Publish Date - Aug 04 , 2024 | 01:10 AM

కొన్ని వస్తువులను మనం అపురూపంగా దాచుకొంటాం. ఎందుకంటే వాటితో మన అందమైన జ్ఞాపకాలు ముడిపడి ఉంటాయి. నచ్చిన కవిత్వపు పుస్తకం మధ్యలో దాచుకున్న పువ్వులు కావచ్చు..

Navya : అందమైన జ్ఞాపకం

అలనాటి కథ

కొన్ని వస్తువులను మనం అపురూపంగా దాచుకొంటాం. ఎందుకంటే వాటితో మన అందమైన జ్ఞాపకాలు ముడిపడి ఉంటాయి. నచ్చిన కవిత్వపు పుస్తకం మధ్యలో దాచుకున్న పువ్వులు కావచ్చు.. వచ్చిన తొలి ప్రేమ లేఖ కావచ్చు... నాకున్న అలాంటి ఒక జ్ఞాపకం డైమండ్‌ రూబీ బ్రేస్‌లెట్‌. 70 ఏళ్ల క్రితం నాటి అందమైన జ్ఞాపకం అది. ఈ జ్ఞాపకాన్ని మీ అందరితోనూ పంచుకోవటానికి ఒక కారణముంది.

రాజ కుటుంబాలలో పెరిగిన అమ్మాయిలకు భావ స్వేచ్ఛ ఉండదని, కేవలం తల్లితండ్రుల ఆజ్ఞను అనుసరించే జీవిస్తారని భావిస్తూ ఉంటారు. కానీ అందరి విషయంలోనూ అది నిజం కాదు. నాకు తెలిసిన రాజ కుటుంబాలలోని అమ్మాయిలను వారి తల్లితండ్రులు చాలా స్వేచ్ఛగా పెంచేవారు. అదే సమయంలో ఆ అమ్మాయిలు కూడా తల్లితండ్రుల మాట జవదాటేవారు కారు. అలాంటి ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటున్నా. ఈ కథలో ఇతరుల పేర్లు మాత్రం చెప్పను. ఎందుకంటే వారి కుటుంబ సభ్యులు నొచ్చుకోవచ్చు.


ఇక కథలోకి వెళ్తే... మనకు స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజులు. ఒక పెద్ద సంస్థానానికి ఒక యువరాజు ఉండేవారు. ఆరు అడుగుల అందగాడు. ఆయనను నేను చూసింది రెండుసార్లే. అది కూడా పార్టీల్లో... దూరంగా. అలాంటి వ్యక్తి హఠాత్తుగా ‘రేపు సాలార్‌జంగ్‌ మ్యూజియంకు వస్తావా’ అని అడిగేటప్పటికి ఏం చెప్పాలో అర్థం కాలేదు నాకు. ‘నాన్నగారిని అడిగి చెబుతా’ అన్నా. నాన్నను అడిగితే వెళ్లమన్నారు.

నేను ‘వస్తాను’ అని చెప్పే లోపే... ‘ఉదయం పది గంటలకు మీ మహల్‌కు వస్తా’ అని యువరాజు వెళ్లిపోయారు. మర్నాడు చెప్పిన సమయానికే యువరాజు వచ్చారు. నేను ఆయన కారు ఎక్కా. మ్యూజియంకు వెళ్లేసరికి కమిటీ సభ్యులందరూ మాకు ఆహ్వానం పలికారు. మధ్యాహ్నం ఆయన నన్ను జ్ఞాన్‌భాగ్‌లో వదిలి వెళ్లిపోయారు. సాయంత్రం రాజ ముద్రతో నాకో ఉత్తరం వచ్చింది... ‘రాజకుమారి సాహేబా.. నాకు మ్యూజియం చూపించినందుకు థాంక్యూ. మళ్లీ బొంబాయిలో కలుద్దాం’ అని!


నాకు తెలిసిన రాజ మర్యాదల ప్రకారం... ఏదైనా ఉత్తరం వస్తే దానికి తప్పనిసరిగా సమాధానం ఇవ్వాలి. ‘తప్పకుండా కలుద్దాం. నేను వేచి చూస్తున్నా’ అని సమాధానమిచ్చా. ఆ తర్వాతి వారం మేమందరం బొంబాయి వెళ్లాం. నేపాల్‌ మహారాజు త్రిభువన్‌ తన కుటుంబంతో కలిసి తొలిసారి భారత్‌కు వచ్చారు. మా ప్యాలె్‌సలోనే ఆయనకు విడిది ఏర్పాటు చేశాం.

అదే రోజు సౌదీ అరేబియా యువరాజు ప్రిన్స్‌ ఫైజల్‌ కూడా డిన్నర్‌కు వచ్చారు. ఆ సమయంలో నాకు యువరాజు నుంచి ఫోన్‌ వచ్చింది. ‘డిన్నర్‌కు వెళ్దామా’ అని! ‘నేను డేటింగ్‌కు వెళ్లటానికి నాన్న ఒప్పుకోరు’ అన్నా. ‘సరే.. నేనే వస్తా’ అన్నారు. నాన్న దగ్గరకు వెళ్లి ‘యువరాజు డిన్నర్‌కు వస్తానన్నారు’ అని చెప్పా. నాన్న వెంటనే తన సెక్రటరీతో యువరాజుకు ఫోన్‌ చేయించారు. కానీ యువరాజు తనకు వేరే అపాయింట్‌మెంట్‌ ఉందని డిన్నర్‌కు రాలేదు.

ఆ మర్నాడు నా జుట్టు సరి చేయించుకోవటానికి తాజ్‌ హోటల్‌కు వెళ్లా. సెలూన్‌ నుంచి బయటకు వస్తుంటే యువరాజు ఎదురుపడ్డారు. ‘ఒక్కసారి నా స్వీట్‌ (రూమ్‌)కు వస్తావా?’ అని అడిగారు. ఏం చెప్పాలో అర్థం కాలేదు. కాళ్లు, చేతులు వణుకుతున్నాయి. అయోమయ స్థితిలో నేను, నా గవర్నెస్‌.. యువరాజుతో రాజ్‌పుత్‌ స్వీట్‌కు వెళ్లాం. అక్కడ కొద్దిసేపు మాట్లాడిన తర్వాత యువరాజు మా గవర్నె్‌సను బయటకు వెళ్లమన్నారు. నాకు భయం వేసింది.


యువరాజు తన పర్స్‌ తీసి, దానిలో ఉన్న నా ఫోటో చూపించారు. అంతే... వెంటనే బ్యాగ్‌ తీసుకొని బయటకు పరిగెత్తుకుంటూ వచ్చేశాను. ఆ రోజు రాత్రి ఇంట్లో పార్టీ జరుగుతోంది. మా గవర్నెస్‌ ఒక పార్సిల్‌ ఇచ్చింది. ఆ పార్సిల్‌ ఇప్పి చూశాను. దాంట్లో అందమైన డైమండ్‌, రూబీలతో చేసిన బ్రేస్‌లెట్‌ ఉంది.

దాన్ని నాన్నకు చూపించాను. ‘ఏం చేయను’ అని అడిగాను. ‘నచ్చితే ఉంచుకో’ అన్నారు. తన కూతురును దేశంలో ఒక పెద్ద సంస్థానానికి చెందిన యువరాజు ప్రపోజ్‌ చేశాడనే ఆనందం నాన్న కళ్లలో కనబడింది. అది ధరించి పార్టీకి వెళ్లా. యువరాజు కూడా వచ్చారు. ‘ధరించినందుకు థాంక్యు’ అన్నారు. తర్వాత పెళ్లికి అందరూ అంగీకరించారు. ఆ సమయంలో మా నాయనమ్మ హఠాత్తుగా జబ్బు పడింది. మరణానికి చేరువయింది. ఆ సమయంలో తను నన్ను పిలిచి... ‘కుటుంబాన్ని చూసుకోవాలి. నువ్వు ఎక్కడికీ వెళ్లకు’ అని కోరింది. కాదనలేకపోయా. ఆ తర్వాతి జీవితం వేరే కథ!

- రాజకుమారి ఇందిరాదేవి ధన్‌రాజ్‌గిర్‌

Updated Date - Aug 04 , 2024 | 01:10 AM