Share News

Sadhguru : జ్ఞానోదయం అంటే...

ABN , Publish Date - Sep 27 , 2024 | 04:58 AM

ఆధ్యాత్మిక చింతనకు సంబంధించి అనేక పదాలను మనం వింటూ ఉంటాం. వాటిలో ‘జ్ఞానోదయం’ అనే మాట ఒకటి. ఇది చాలా దుర్వినియోగం అవుతున్న మాట. నిజంగా జ్ఞానోదయం పొందడానికి, కేవలం మాటలతో మభ్యపెట్టడానికి చాలా తేడా ఉంది.

Sadhguru : జ్ఞానోదయం అంటే...

సద్గురువాణి

ధ్యాత్మిక చింతనకు సంబంధించి అనేక పదాలను మనం వింటూ ఉంటాం. వాటిలో ‘జ్ఞానోదయం’ అనే మాట ఒకటి. ఇది చాలా దుర్వినియోగం అవుతున్న మాట. నిజంగా జ్ఞానోదయం పొందడానికి, కేవలం మాటలతో మభ్యపెట్టడానికి చాలా తేడా ఉంది.

యమవోకా టెన్షు ఒక జెన్‌ విద్యార్థి. అతను అనేకమంది జెన్‌ గురువుల దగ్గర విద్యాభ్యాసం చేస్తూ... జపాన్‌ అంతటా తిరుగుతూ ఉండేవాడు. ఒక రోజు అతను షోకోకు దేవాలయానికి వెళ్ళాడు. అక్కడ డొకువాన్‌ అనే సన్యాసిని కలుసుకున్నాడు. తన జ్ఞానాన్ని ఆయన ముందు ప్రదర్శించాలనుకున్నాడు.

‘‘మనసు, బుద్ధుడు, ఇంకా అన్ని జీవులు శూన్యమే. అన్నిటి వాస్తవ స్వభావం శూన్యమే. జ్ఞానోదయం లేదు, మాయ లేదు, సన్యాసులు లేరు, సామాన్యులు లేరు, శ్రమ లేదు, ప్రతిఫలం లేదు... అంతా శూన్యం’’ అన్నాడు డొకువాన్‌తో.

ఆ మాటలు విన్న డొకువాన్‌ కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. తరువాత టెన్షు తల మీద గట్టిగా కొట్టాడు. ‘‘ఎందుకిలా చేశారు?’’ అని అడిగాడు టెన్షు కోపంగా.

అప్పుడు డొకువాన్‌ ‘‘అంతా శూన్యమే అయితే... ఈ కోపం ఎక్కడినుంచి వచ్చింది?’’ అని ప్రశ్నించాడు.

టెన్షు ఎక్కడో చదివినదాన్ని పట్టుకొని వేలాడుతూ... తాను శూన్యమనీ, ప్రతిదీ శూన్యమనీ చెబుతూ వస్తున్నాడు. ఒక్కసారి తల మీద దెబ్బ తగలగానే అతనికి కోపం వచ్చింది. అంతా శూన్యమే అయి ఉంటే... మీలో ఎటువంటి నిర్బంధం లేకపోతే... ఆ కోపం ఎలా వస్తుంది? ఇది ఏదైనా లక్ష్యంకోసం ఎరుకతో ప్రదర్శించిన కోపం కాదు. ఎవరో తలమీద కొట్టగానే ఒక్కసారిగా ముంచుకొచ్చిన కోపం.


ఇలాంటి తీవ్రమైన ప్రతిస్పందనలను, అహంకారాన్ని విడిచిపెడితేనే జ్ఞానోదయం అవుతుంది. జ్ఞానోదయం అంటే అది ప్రత్యేకంగా సాధించే విషయం కాదు. అది తిరిగి ఇంటికి రావడం లాంటిది. అందులోని విశేషం ఏమిటంటే... మీరు పరమ సాధారణంగా మారిపోతారు. ఆ తరువాత మీ సొంత విషయాలంటూ ఏవీ ఉండవు. మీదంటూ ఏదీ ఉండదు. అంతా మీదే అయినట్టు లేదా ఏదీ మీది కానట్టు... ఈ స్థితికి చేరుకుంటారు. అటువంటి స్థితిలో ఎలాంటి నిర్బంధత్వం ఉండదు.

ఈ సంగతి గ్రహించకుండా.. జ్ఞానోదయం గురించి మాట్లాడడం బాధ్యతారాహితం. ఎందుకంటే మూర్ఖులందరూ ఈ పదాలను పట్టుకొని... ఇతరులను మోసం చేయడానికో, మరీ ముఖ్యంగా తమనుతాము భ్రమింపజేసుకోవడానికో ఉపయోగిస్తారు. ఇలా ప్రతిచోటా జరుగుతూనే ఉంటుంది. పాతికవేల రూపాయలు పుచ్చుకొని... మీకు జ్ఞానోదయం అయిందని ప్రకటించే చిత్తశుద్ధిలేని గురువులు కూడా నేటి సమాజంలో ఉన్నారు. అలాంటి జ్ఞానోదయమే మీకు కావాలంటే... మీ డబ్బు వృధా చేసుకోకండి. ‘‘నాకు జ్ఞానోదయం అయింది’’ అని మీకు మీరే ప్రకటించుకోండి. ఎందుకంటే... ఈ రెండిటికీ పెద్ద తేడా ఏమీ లేదు.

సద్గురు జగ్గీవాసుదేవ్‌

Updated Date - Sep 27 , 2024 | 04:58 AM