TDP-JSP First List: రాయచోటి టికెట్ దక్కించుకున్న ఈ ‘రాముడు’ ఎవరు.. చంద్రబాబుకు అంత నమ్మకమేంటి..!?
ABN , Publish Date - Feb 25 , 2024 | 09:34 AM
AP Election 2024: సార్వత్రిక ఎన్నికలకు టీడీపీ సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో వైసీపీతో తలపడేందుకు రేసుగుర్రాలను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు శనివారం ఉండవల్లిలో సంయుక్తంగా తొలిజాబితా అభ్యర్థులను ప్రకటించారు. ఈ సందర్భంగా తంబళ్లపల్లె, పీలేరు, రాయచోటి నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. మిగతా నియోజకవర్గాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థులను ప్రకటించిన మూడు నియోజకవర్గాల్లోనూ టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి..
సార్వత్రిక ఎన్నికలకు టీడీపీ (Telugu Desam) సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో వైసీపీతో తలపడేందుకు రేసుగుర్రాలను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు శనివారం ఉండవల్లిలో సంయుక్తంగా తొలిజాబితా అభ్యర్థులను ప్రకటించారు. ఈ సందర్భంగా తంబళ్లపల్లె, పీలేరు, రాయచోటి నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. మిగతా నియోజకవర్గాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థులను ప్రకటించిన మూడు నియోజకవర్గాల్లోనూ టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.
అన్నమయ్య జిల్లా/రాయచోటి: టీడీపీ, జనసేన పార్టీల కూటమి శనివారం ప్రకటించిన అభ్యర్థుల తొలిజాబితాలో జిల్లాలో ముగ్గురికి చోటు దక్కింది. తంబళ్లపల్లె, పీలేరు, రాయచోటి నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఎన్‌ఆర్‌ఐ, పారిశ్రామికవేత్త దాసరిపల్లె జయచంద్రారెడ్డి, పీలేరు నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, రాయచోటి నియోకవర్గంలో మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డిలకు (Mandipalli Ramprasad Reddy) టికెట్లు ఖరారు చేసింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో వారి అనుచరులు స్వీట్లు తినిపించుకొని, బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. టికెట్టు రాని చోట్ల ఆయా నాయకుల ముఖ్య అనుచరులు తమ పదవులకు రాజీనామా చేసి నిరసన తెలిపారు.
ఇదీ రాముడి బ్యాగ్రౌండ్!
ఇక రాయచోటి టీడీపీ అభ్యర్థి మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి.. 2003లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈయన తండ్రి మండిపల్లె నాగిరెడ్డి 1985, 1989లో కాంగ్రెస్ పార్టీ తరపున రాయచోటి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1991లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. అనంతరం ఆయన సోదరుడు నారాయణరెడ్డి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందారు. 1994లో జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ.. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు. తదనంతరం 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో తన సోదరి శ్రీలతరెడ్డికి రాంప్రసాద్‌రెడ్డి టికెట్టు ఇప్పించుకున్నారు. ఆ ఎన్నికల్లో ఆమె స్వల్ప తేడాతో ఓటమి చెందారు. ఈయన తల్లి సుశీలమ్మ చిన్నమండెం మండలం మండలాధ్యక్షురాలిగా పనిచేశారు. కాగా.. అభిమానులు, కార్యకర్తలు ముద్దుగా ఈయన్ను ‘రాముడు’ అని పిలుస్తుంటారు.
ఎందుకంత నమ్మకం..?
నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పరిచయాలు, సేవా కార్యక్రమాలతో మంచి పేరు.. వైసీపీ తరఫున పోటీ చేస్తున్న గడికోట శ్రీకాంత్ రెడ్డికి ‘సరైనోడు’ కావడంతో సీనియర్లను సైతం పక్కనెట్టి రాముడిని నమ్మి.. చంద్రబాబు టికెట్ ఇచ్చినట్లు తెలియవచ్చింది. శ్రీకాంత్‌ను ఓడించడం ఒక్క మండిపల్లి వల్లే అవుతుందని బాబు, లోకేష్ గట్టిగా నమ్మారట. పైగా అంగ బలం, ఆర్థిక బలం కూడా గట్టిగానే ఉంది. ఈయనకు టికెట్ రావడంలో అచ్చెన్నాయుడు, నల్లారి కిశోర్ కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీ గెలిచే మొదటి సీటు రాయచోటి అని హైకమాండ్ అంచనాలు వేస్తోంది.
అందరినీ కలుపుకుని వెళ్లి విజయం సాధిస్తా..
నాపై నమ్మకంతో టికెట్ కేటాయించినందుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చంనాయుడుకు కృతజ్ఞతలు. వాళ్లు నాపైన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను. టీడీపీ గెలుపు కోసం తెలుగుదేశం, జనసేన పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో కృషి చేయాలి. మన బిడ్డల భవిష్యత్తు కోసం తెలుగుదేశం, జనసేన ఉమ్మడి ప్రభుత్వం తెచ్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. టీడీపీ బలంగా ఉంది కాబట్టే.. టికెట్టు కోసం పోటీ ఎక్కువగా ఉంది. టికెట్టు ప్రకటన తర్వాత.. చిన్నచిన్న అసంతృప్తులు సహజమే. త్వరలోనే టీకప్పులో తుఫాన్ లాగా సమసిపోతుంది. అందరినీ కలుపుకుని వెళ్తా.. తప్పకుండా విజయం సాధిస్తా.
- మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి, రాయచోటి టీడీపీ అభ్యర్థి.
కిశోర్ బ్యాగ్రౌండ్ ఇదీ..
పీలేరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున కిశోర్ బరిలో ఉంటారని అందరికీ తెలిసినప్పటికీ తొలి విడతలోనే చంద్రబాబునాయుడు ఆయన పేరు ప్రకటించగానే కిశోర్ స్వగ్రామంలో సంబరాలు అంబరాన్నంటాయి. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి టీడీపీ శ్రేణులు, నల్లారి అభిమానులు పెద్దఎత్తున నగరిపల్లెకు చేరుకుని బాణాసంచా కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశాయి. ఈయన 2018-19 వరకు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్నారు. ఆయన మొదటిసారిగా 2014లో తన సోదరుడు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి స్థాపించిన ‘జై సమైఖ్యాంద్ర పార్టీ’ తరపున పీలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి అయిన చింతల రామచంద్రారెడ్డి చేతిలో 15 వేల ఓట్ల తేడాతో పరాజయం చెందారు. 2019 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ వైసీపీ ప్రభుత్వ అసమర్థ విధానాలపై పోరాడారు. పీలేరు నియోజకవర్గంలో అధికార వైసీపీ నాయకుల భూఆక్రమణలపై క్షేత్రస్తాయిలోనే కాకుండా లోకాయుక్త, రాష్ట్ర హైకోర్టులో కూడా న్యాయపోరాటం చేశారు.
పసుపు జెండా ఎగరేస్తా..!
నాపై నమ్మకంతో తొలి విడతలోనే నా పేరు ప్రకటించినందుకు చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు. ఆయన నమ్మ కాన్ని వమ్ము చేయకుండా ఈ ఎన్నికల్లో పీలేరులో టీడీపీ జెండా ఎగురవేస్తాను. పార్టీ శ్రేణులు చాలా కసిగా ఉన్నారు. వారందరి సహకారంతో ఈ ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తాను. - నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, పీలేరు టీడీపీ అభ్యర్థి
వ్యాపారవేత్తగా పేరు..
ఇక తంబళ్లపల్లె టీడీపీ అభ్యర్థి దాసరిపల్లె జయచంద్రారెడ్డి.. రైతు కుటుంబంలో జన్మించి బిటెక్ చదివి నాబార్డులో పనిచేశారు. తర్వాత 2010లో వ్యాపార రంగంలో అడుగుపెట్టి విజయం సాధించారు. ఈయన తండ్రి నారాయణరెడ్డి టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. పార్టీ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొన్నారు. అప్పట్లో టీడీపీ తరపున పోటీ చేసిన ఉమాశంకర్‌రెడ్డితో కలిసి పనిచేశారు. ఈయన కనుగొండ రాయస్వామి ఆలయ కమిటీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. జయచంద్రారెడ్డి 2020 నుంచి తంబళ్లపల్లె నియోకవర్గంలో పరోక్ష రాజకీయాల్లో పాల్గొన్నారు. అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు.
బాబుకు పాదాభివందనం..
తంబళ్లపల్లె నియోజకవర్గ గడ్డపై టీడీపీ, జనసేన పార్టీల జెండాలు ఎగురవేస్తాం. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు అవకాశం కల్పించిన అధినేత చంద్రబాబుకు పాదాభివందనం. టీడీపీ, జనసేన శ్రేణులందరినీ కలుపుకొని జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిచి చంద్రబాబుకు బహుమతిగా ఇస్తాం. - జయచంద్రారెడ్డి, తంబళ్లపల్లె టీడీపీ అభ్యర్థి.