SriLakshmi: ఐఏఎస్ శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం.. ఈసారి ఏకంగా..?
ABN , Publish Date - Jun 16 , 2024 | 02:53 PM
శ్రీలక్ష్మి (IAS Sri Lakshmi).. సీనియర్ ఐఏఎస్ అధికారి గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.! ప్రస్తుతం ఏపీ మునిసిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి! గతంలో పాలకులు చెప్పినట్లుగా విని, అడ్డగోలుగా సంతకాలు పెట్టడంతో ఎదురైన అనుభవాలతో ఏం జరిగిందో అందరికీ తెలుసు..
శ్రీలక్ష్మి (IAS SriLakshmi).. సీనియర్ ఐఏఎస్ అధికారి గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.! ప్రస్తుతం ఏపీ మునిసిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి! గతంలో పాలకులు చెప్పినట్లుగా విని, అడ్డగోలుగా సంతకాలు పెట్టడంతో ఎదురైన అనుభవాలతో ఏం జరిగిందో అందరికీ తెలుసు. అయితే.. వైసీపీ హయాంలో కూడా ఇలానే చేశారనే ఆరోపణలు కోకొల్లలు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘తాడేపల్లి క్యాంపు’ చెప్పినట్టల్లా చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఇలా చేసి పరువు పోగొట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయ్..!. ‘మీరు నవ్వుకున్నా సరే! నేను చేసేది చేస్తా! తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలనే అమలు చేస్తా!’ ఇదీ గత ఐదేళ్లు మహిళా ఐఏఎస్ వ్యవహార శైలి! అని సంచలన కథనాలు సైతం వచ్చాయ్. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయ్. శ్రీలక్ష్మి అంటే చాలు.. బాబోయ్ అంటూ మంత్రులు జంకుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయ్. అందుకే వీలైనంత త్వరగా ఆమెను బదిలీ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట.
మరో ‘సారీ’..!
ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అభినందనలు తెలిపి.. బోకెలతో స్వాగతం పలికిన సంగతి తెలిసిందే. అయితే.. శ్రీలక్ష్మి వంతు వచ్చేసరికి కనీసం బొకే తీసుకోవడానికి కూడా సీఎం ఇష్టపడలేదు.! అంతేకాదు.. తన పేషీ నుంచి చంద్రబాబు బయటికి పంపేశారు కూడా. ఇదంతా రెండ్రోజుల క్రితం జరగ్గా.. తాజాగా మరోసారి శ్రీలక్ష్మికి చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం నాడు పురపాలక శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా.. సంతకం పెట్టించేందుకు ఒక ఫైల్‌ను శ్రీలక్ష్మి తెచ్చారు. అయితే.. మంత్రి మాత్రం ‘ఇప్పుడేం సంతకాలు వద్దమ్మా’ అని సున్నితంగా తిరస్కరించారు. దీంతో చేసేదేమీ లేక అక్కడ్నుంచి ఆమె వెళ్లిపోయారు. కాగా.. తాజా ఘటనతో రెండోసార్లు శ్రీలక్ష్మికి చేదు అనుభవం ఎదురైనట్లయ్యింది. ముఖ్యమంత్రి మొదలుకుని మంత్రుల వరకూ అందరూ శ్రీలక్ష్మికి సారీ చెప్పేస్తున్నార్న మాట.
ఎందుకిలా..?
జీవోలపై శ్రీలక్ష్మీ సంతకాలు ఉండకూడదని ప్రభుత్వ పెద్దల నుంచి క్లియర్ కట్‌గా ఆదేశాలు వచ్చాయని పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది. అంతేకాదు.. శ్రీలక్ష్మిని బదిలీ చేసేంత వరకు ఆమెకు ఫైళ్లను పంపకూడదని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందట. బదిలీ ప్రక్రియ నడుస్తోందని.. ఏ క్షణమైనా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చే అవకాశం ఉందని తెలియవచ్చింది. జగన్ సీఎంగా అంటకాగిన ఐఏఎస్, ఐపీఎస్.. ఉన్నతాధికారులను ఒక్కొక్కరుగా తప్పించాలని చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పలువురు పోలీసు అధికారులకు అపాయిట్మెంట్ కూడా ఇవ్వలేదన్న విషయం తెలిసిందే. మొత్తానికి చూస్తే.. జగన్ కోటరీగా పేరున్న ప్రతి ఒక్కర్నీ పక్కనెట్టి పెద్ద ప్రక్షాళన చేయడానికే ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని దీన్ని బట్టి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.