YSRCP: టీడీపీలోకి వస్తామంటున్న వైసీపీ నేతలు.. దరి చేరనివ్వని తెలుగు తమ్ముళ్లు!
ABN , Publish Date - Jul 07 , 2024 | 03:24 PM
వైసీపీ నేతలు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. కూటమి నేతలతో సంప్రదింపులు జరిపారు. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన నేతలే ఇలా పక్కదారి చూస్తుండడంతో నియోజకవర్గ నేత సంప్రదింపులు జరిపారు. పార్టీని వీడొద్దంటూ ప్రాధేయపడ్డారు.. అయినా నాయకులు తగ్గేదేలే అంటున్నారు..
నర్సాపురంలో వైసీపీ నేతలు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. కూటమి నేతలతో సంప్రదింపులు జరిపారు. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన నేతలే ఇలా పక్కదారి చూస్తుండడంతో నియోజకవర్గ నేత సంప్రదింపులు జరిపారు. పార్టీని వీడొద్దంటూ ప్రాధేయపడ్డారు.. అయినా నాయకులు తగ్గేదేలే అంటున్నారు.
తాడేపల్లిగూడెంలో పట్టణానికి ప్రాతినిధ్యం వహించిన నేత వేరొకరిని చూసుకోవాలని పార్టీ నాయకత్వానికి చెప్పేశారు. ఆర్థికంగా ఇబ్బందులున్నాయి. ఇక పార్టీకి సేవలు చేయలేను. రాజకీయాల్లో అంతా పోగొట్టుకున్నా. ఇప్పుడు బయటకు రాలేనంటూ స్పష్టం చేశారు. జువ్వల పాలెంలో మరో వైసీపీ నేత తాను రాజకీయాలను విరమించుకుంటున్నానని నియోజక వర్గ నాయకత్వానికి తెగేసి చెప్పేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రణాళిక చేద్దామంటూ రావాలని పిలుపునిచ్చిన నియోజకవర్గ నేతకు ఇప్పుడు తమ పార్టీ శ్రేణుల నుంచి ఇటువంటి సమాధానాలే వస్తున్నాయి.
పశ్చిమ గోదావరి/భీమవరం: తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ శ్రేణుల్లో పూర్తి నైరాశ్యం అలముకుంది. తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేకపోతున్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో పలకరించేవారు కరువయ్యారు. భారీ ఓట్ల తేడాతో జిల్లాలో ఓటమి పాలు కావడంతో వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. రాష్ట్ర నాయకత్వంతో పాటు, నియోజక వర్గ నేతలు కేడర్‌ను పట్టించుకోలేదు. సొంత ప్రయోజనాలు చూసుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది. ఈ పరిస్థితుల్లో బయటకు వస్తే మరిన్ని ఇబ్బందులు తప్పవన్న ఆలోచనతో వైసీపీ శ్రేణులున్నాయి. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పుడు వైసీపీ శ్రేణులు కోలుకోలేకపోతున్నాయి. వైసీపీ నుంచి సర్పంచ్‌లు ఉన్పప్పటికీ వారి ప్రభుత్వం ఉన్నప్పుడే గౌరవం లేకుండా పోయింది. సచివాలయం వలంటీర్ వ్యవస్థ అంటూ జగన్ ముందడుగు వేశారు. పంచాయతీలను పట్టించుకోలేదు. నిధులు లేవు, విధుల్లేవు. సర్పంచ్‌లుగా కనీస మర్యాదలేదు. ప్రజలు తమ వద్దకు రాలేదంటూ వైసీసీ సర్పంచ్‌లు మదనపడ్డారు. ఇప్పుడు ప్రభుత్వం మారిపోవడంతో మరింత చులకనయ్యామంటూ సర్పంచ్‌లు కుమిలిపోతున్నారు. కూటమి శ్రేణులు గ్రామాలు, పట్టణాల్లోనూ అప్రమత్తమయ్యాయి. పట్టు బిగించాయి. పనుల కోసం తమ పార్టీ నేతల వద్దకు వెళుతున్నారు. పనులు చేయించుకుంటున్నారు. అధికారుల వద్ద కూటమి మాటే చెల్లుబాటు అవుతోంది.
వైఎస్ జగన్ రాజీనామా..!?
మాట మార్చిన అధికారులు
వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నియోజకవర్గ నాయకత్వం మాటే చెల్లుబాటు అయ్యేది. ఎన్నికల కోడ్ వచ్చినంత వరకు కూటమి శ్రేణుల పట్ట అధికార గణంలో వ్యతిరేక ప్రభావం ఉండేది. అలాగని వైసీపీ శ్రేణులకు పెద్దగా మన్నన ఉండేదికాదు. పూర్తిగా నియోజకవర్గ నాయకత్వం చేతుల్లోనే అధికారులు ఉండేవారు. వారి మాటకే విలువ ఉండేది. ఏ పని కావాలన్నా నియోజకవర్గ నేతల వద్దకు వెళ్లి వైసీపీ శ్రేణులు పనులు చేయించుకునేవారు. ప్రభుత్వం మారిపోవడంతో అధికారులు మాట మార్చారు. ఇప్పుడంతా కూటమి మాటే చెల్లుబాటు అవుతోంది. వైసీపీ శ్రేణులు గ్రామాల్లో కూటమి నాయకత్వాన్ని ఆశ్రయిస్తున్నారు. పనులు చేయించుకునే పరిస్థితిలో ఉన్నారు. అధికారులు, ప్రభుత్వం సిబ్బందిలోనూ ఇప్పుడు పంథా మారిపోవడంతో వైసీపీ శ్రేణులు మరింత నిరాశలో కూరుకుపోయాయి.
వెలవెలబోతున్న మాజీల శిబిరాలు
వైసీపీ ప్రభుత్వంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులంతా ఇప్పుడు మాజీలయ్యారు. వారి వద్దకు వైసీపీ శ్రేణులు వెళ్లడం లేదు. శిబిరాలన్నీ ఖాళీ అయిపోయాయి. ఎన్నికల ముందే కొందరు కూటమి పంచన చేరారు. ఉన్న వారంతా ఇప్పుడు పార్టీకి దూరంగా ఉన్నారు. నేతలకు ముఖం చూపడం లేదు. పిలుపు వచ్చినా దరి చేరడం లేదు. రాజకీయాలకు దూరంగా ఉంటామని చెప్పుకొస్తున్నారు.
కూటమి వేటుతో దిగులు
వైసీపీ హయాంలో నామినేటెడ్ పదవులు పొందిన వారు ప్రభుత్వం మారిపోవడంతో నైతికంగా రాజీనామా చేశారు. కొందరు రాజీనామాలు చేయకుండా పదవులతో వేలాడారు. వారి పదవులను రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సొసైటీల్లో త్రిసభ్య కమిటీలు, దేవదాయ కమిటీలు, మార్కెట్ కమిటీలు ఇలా రద్దు చేశారు. కార్పొరేషన్ పదవులు లేకుండా పోయాయి. ఇలా ఒక్కసారిగా పదవులు కోల్పోవడంతో వైసీపీలో మరింత కుంగుబాటు నెలకొంది. ఎన్నికలు లేకుండా ఐదేళ్లపాటు నామినేటెడ్ పదవుల్లో దర్జా ఒలకబోసిన వైసీపీ నాయకులు పదవులు కోల్పోయారు. ఈ మార్పు వైసీపీ శ్రేణులను మరింత కుంగదీశాయి. ఇలా జిల్లా అంతటా వైసీపీ శ్రేణుల్లో రాజకీయాలంటే వైరాగ్యధోరణి కనిపిస్తోంది.
మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి..