Air India: ట్రక్కును ఢీ కొన్న ఎయిర్ ఇండియా విమానం.. 180 మంది ప్రయాణికులు..
ABN , Publish Date - May 17 , 2024 | 03:18 PM
టేకాఫ్‌కి ముందు ఎయిర్ ఇండియాకు(Air India) చెందిన ఓ విమానం ట్రక్కును ఢీకొట్టింది. డ్రైవర్ల అప్రమత్తతతో అందులోని ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. పుణె విమానాశ్రయంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.
పుణె: టేకాఫ్‌కి ముందు ఎయిర్ ఇండియాకు(Air India) చెందిన ఓ విమానం ట్రక్కును ఢీకొట్టింది. పైలెట్ల అప్రమత్తతతో అందులోని ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. పుణె విమానాశ్రయంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ విమానం ఢిల్లీకి వెళ్లడానికి సిద్ధమైంది.
టేకాఫ్ కోసం రన్‌వే పైకి తీసుకొచ్చిన టగ్ ట్రక్‌ను విమానం ఢీకొట్టింది. ప్రమాద సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం కారణంగా విమానం ముందు భాగంతోపాటు ల్యాండింగ్ గేర్ సమీపంలోని టైరు దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించారు.
పైలెట్ల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన తర్వాత ప్రయాణికులందరినీ కిందికి దింపి విమానాన్ని మరమ్మతులకు పంపారు. ప్రయాణికులను వేరే విమానాల్లో గమ్యస్థానాలకు చేరవేశారు. ఈ ఘటనపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది.
"పుణె నుండి ఢిల్లీకి వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విమానాన్ని మరమ్మతులకు పంపించాం. ప్రయాణికులందరినీ సురక్షితంగా ఆఫ్‌లోడ్ చేశాం. సదరు ఫ్లైట్‌ని రద్దు చేశాం. కొందరు ప్రయాణికులను ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానానికి చేరవేశాం. మిగిలిన వారికి పూర్తి ఛార్జీలు చెల్లించాం” అని ఎయిర్ ఇండియా ప్రతినిధి వెల్లడించారు.