Share News

Legal Awareness: భారతీయ మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన టాప్ 5 చట్టాలు!

ABN , Publish Date - Sep 21 , 2024 | 09:54 PM

వృత్తిగత, వ్యక్తిగత జీవితాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే మహిళలకు పలు చట్టాలు అందుబాటులో ఉన్నాయి. వాటిపై అవగాహన పెంచుకుంటే ఆపదకాలంలో రక్షణ పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు.

Legal Awareness: భారతీయ మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన టాప్ 5 చట్టాలు!

ఇంటర్నెట్ డెస్క్: పని ప్రదేశంలో మహిళలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న అంశాలు ఇప్పటికే అనేకం వెలుగు చూశాయి. దీంతో, మహిళలు తమకు చట్టపరంగా ఉన్న హక్కులు, రక్షల గురించి అవగాహన పెంచుకోవడం అనివార్యంగా మారింది. ఈ విషయంలో భారతీయ మహిళలకు పలు చట్టాలు అండగా నిలుస్తున్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు (Legal Advice).

ఇక్వల్ రెమ్యూనరేషన్ యాక్ట్ 1976 చట్టం ప్రకారం, ఒకే పని చేసే స్త్రీ పురుషులకు ఒకే జీతం చెల్లించాలి. ఇందుకు విరుద్ధంగా నడుచుకునే సంస్థలకు చిక్కులు తప్పవు. ప్రమోషన్లు, నియామకాల్లో లింగవివక్ష చూపించడం నిషిద్ధం. చేసిన పనికి తగిన పారితోషికం పొందడంలో మహిళలకు ఈ చట్టం అక్కరకు వస్తుంది.


పని ప్రదేశాల్లో వేధింపుల నుంచి మహిళలకు లైంగిక వేధింపుల నిరోధక చట్టం రక్షణ కల్పిస్తుంది. ఈ చట్టం ప్రకారం, లైంగిక వేధింపుల ఫిర్యాదులను పరిశీలించేందుకు సంస్థలు ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పాలి. అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలి. సమస్య ఎదురైనప్పుడు ఈ కమిటీకి ఫిర్యాదు చేసే స్వేచ్ఛ మహిళలకు కల్పించాలి.

గర్భధారణ చేసిన మహిళ ఉద్యోగులకు 26 వారాల వరకూ సెలవులు మంజూరు చేయాలని మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1971 చెబుతోంది. వృత్తిగత వ్యక్తిగత బాధ్యతల మధ్య సమతౌల్యం పాటించేందుకు ఈ చట్టం మహిళలకు సహకరిస్తుంది.


ఇంట్లో వివిధ రూపాల్లో ఎదురయ్యే శారీరక, మానసిక వేధింపుల నుంచి మహిళలకు గృహహింస నిరోధక చట్టం -2005 రక్షణ కల్పిస్తోంది. కుటుంబ సభ్యుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళల ఈ చట్టం ద్వారా చట్టపరమైన ఊరట పొందొచ్చు. నిందితులకు కఠినమైన శిక్షలు విధించేందుకు ఈ చట్టం అవకాశం కల్పిస్తోంది.

లైంగిక దాడి లేదా గృహహింస జరిగిన సందర్భాల్లో మహిళలు ఎన్నో శారీరక మానసిక, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇలాంటి వారికి లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ఉచిత న్యాయం పొందే హక్కును కల్పిస్తోంది. ఆర్థికస్థితిగతులతో సంబంధం లేకుండా బాధితులు న్యాయసాయాన్ని పొందొచ్చు.

Read Latest Telugu News

Updated Date - Sep 21 , 2024 | 09:54 PM