Share News

Chamipons Trophy: భారత్‌లో అలాంటి ముప్పు లేదు కదా.. పీసీబీ డిమాండ్లపై బీసీసీఐ గట్టి కౌంటర్

ABN , Publish Date - Dec 04 , 2024 | 04:54 PM

ఛాంపియన్స్ ట్రోఫీపై మొదటినుంచి మోకాలడ్డేస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ తాజాగా మరో కౌంటర్ ఇచ్చింది. పీసీబీ చౌకబారు డిమాండ్లకు తలొగ్గేది లేదని స్పష్టం చేసింది.

Chamipons Trophy: భారత్‌లో అలాంటి ముప్పు లేదు కదా.. పీసీబీ డిమాండ్లపై బీసీసీఐ గట్టి కౌంటర్
Team India

ఢిల్లీ: హైబ్రిడ్‌ విధానానికి ఓకే అన్నట్టుగానే అని షరతులు వర్తిస్తాయంటూ పీసీబీ డబుల్ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీపై ఇంకా అదే అనిశ్చితి కొనసాగుతోంది. భవిష్యత్‌లో పాకిస్థాన్ ఆతిథ్యమిచ్చే ఐసీసీ టోర్నమెంట్లకు భారత్ హాజరుకాకపోతే..ఆ జట్టు ఆడే మ్యాచ్‌లనూ హైబ్రిడ్ మోడల్ లోనే నిర్వహించాలని డిమాండ్లను వినిపించింది. ఈమేరకు ఐసీసీ తమకు రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని పీసీబీ పట్టుపడుతోంది. అప్పుడే చాంపియన్స్‌ ట్రోఫీ హైబ్రిడ్‌ విధానానికి అంగీకరిస్తామని పీసీబీ స్పష్టంజేసింది. తాజాగా పిసీబీ డిమాండ్లను భారత బోర్డు తిరస్కరించినట్లు తెలుస్తోంది.


బీసీసీఐ ఏమన్నదంటే..

భద్రతా సమస్యల కారణంగా తమ జట్టును పాకిస్తాన్‌కు పంపే ప్రసక్తే లేదని బిసీసీఐ తేల్చి చెప్పింది. ఇక భారత్ నుంచి కూడా వేదికలను తరలించాలని పీసీబీ పెట్టిన షరతుపైనా బీసీసీఐ స్పందించింది. తమ దేశంలో ఎలాంటి భద్రతా పరమైన సమస్యలు లేవని ఈ కారణంగా తామకు హైబ్రిడ్ మోడల్ కు తలొగ్గాల్సిన అవసరం ఏమాత్రం లేదని స్పష్టం చేసింది. ఐసీసీ ఈవెంట్ కోసం పీసీబీ చేస్తున్న డిమాండ్లను తాము స్వీకరించలేమని గట్టి కౌంటర్ ఇచ్చింది. ‘‘భారత్ లో ఎలాంటి భద్రతా‌పరమైన ముప్పు లేదు.. అలాంటి డిమాండ్లకు అంగీకరించే ప్రసక్తే లేదు’’ అని భారత్ స్పష్టం చేసింది.


తగ్గకుంటే మొదటికే మోసం..

శ్రీలంకతో కలిసి 2025లో మహిళల వన్డే ప్రపంచ కప్, 2026లో టీ20 ప్రపంచ కప్‌తో సహా పలు ఐసీసీ ఈవెంట్‌లను భారత్ రాబోయే పదేళ్లలో నిర్వహించాల్సి ఉంది. 2029 ఛాంపియన్స్ ట్రోఫీ, 2031 వన్డే ప్రపంచ కప్ కూడా భారతదేశంలోనే జరగాల్సి ఉంది. ఈ విషయంపై పాక్ మొండి వైఖరి కొనసాగితే వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చే హక్కులను కూడా ఆ దేశ క్రికెట్ బోర్డు కోల్పోయే ప్రమాదం ఉంది. టోర్నమెంట్‌ను వేరే దేశానికి మార్చాలని ఐసిసి నిర్ణయించుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీ నుండి వైదొలగాలని బోర్డు గతంలో హెచ్చరించినట్టు తెలుస్తోంది.

KL RAhul: సరిగ్గా పదేళ్ల క్రితం అతడి స్థానంలో నేనున్నా.. కేఎల్ రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్


Updated Date - Dec 04 , 2024 | 05:04 PM