Share News

Ravindra Jadeja: చరిత్ర సృష్టించిన జడేజా.. ఈ ఘనత సాధించిన రెండవ భారతీయ క్రికెటర్

ABN , Publish Date - Nov 03 , 2024 | 06:56 AM

ముంబై టెస్టులో రెండవ రోజు భారత్‌ ఆధిపత్యం కొనసాగడంలో స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. భారత్ లక్ష్యం 150 పరుగుల కంటే ఎక్కువగా ఉండకూడదన్న లక్ష్యంగా బౌలింగ్ చేశారు. అనుకున్నట్టే ఇద్దరూ రాణించారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా 4 వికెట్లు, అశ్విన్ 3 వికెట్లు తీశారు. ఈ క్రమంలో జడేజా ఓ రికార్డు సాధించాడు.

Ravindra Jadeja: చరిత్ర సృష్టించిన జడేజా.. ఈ ఘనత సాధించిన రెండవ భారతీయ క్రికెటర్

ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పట్టుబిగించింది. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి పర్యాటక జట్టు కివీస్ రెండవ ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు సాధించింది. ఆ జట్టు ప్రస్తుతం 143 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండవ రోజు భారత్‌ ఆధిపత్యం కొనసాగడంలో స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. భారత్ లక్ష్యం 150 పరుగుల కంటే ఎక్కువగా ఉండకూడదన్న లక్ష్యంగా బౌలింగ్ చేశారు. అనుకున్నట్టే ఇద్దరూ రాణించారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా 4 వికెట్లు, అశ్విన్ 3 వికెట్లు తీశారు.


ముఖ్యంగా జడేజా బౌలింగ్ మొదలుపెట్టిన కొద్దిసేపటికే వికెట్లు వేట ఆరంభించారు. అంతకముందు కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో కూడా 5 వికెట్లు నేలకూల్చాడు. దీంతో ప్రస్తుత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) సైకిల్‌లో 50 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ తర్వాత ఒక డబ్ల్యూసీ సైకిల్‌లో 50 వికెట్లు తీసిన రెండవ భారతీయ బౌలర్‌గా జడేజా నిలిచాడు. అశ్విన్ ఇప్పటివరకు మూడు డబ్ల్యూటీసీ సైకిల్‌లలో 50 ప్లస్ వికెట్లు తీశాడు. జడేజా 2021-23 సైకిల్‌లో అత్యధికంగా 47 వికెట్లు తీశాడు. ఆ సంఖ్యను ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌లో మెరుగుపరచుకున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్లు ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్‌లను కూడా అధిగమించాడు. డబ్ల్యూటీసీ 2023-25 ​సైకిల్‌లో ఆస్ట్రేలియా ద్వయం కమిన్స్, స్టార్క్‌లు చెరో 48 వికెట్లు తీశారు.


డబ్ల్యూటీసీలో అధిక వికెట్ల తీసిన భారత బౌలర్లు...

1. రవిచంద్రన్ అశ్విన్- 71 వికెట్లు (26 ఇన్నింగ్స్‌లలో, 2019-21)

2. రవిచంద్రన్ అశ్విన్ - 62 వికెట్లు ( 25 ఇన్నింగ్స్‌లలో, 2023-25)

3. రవిచంద్రన్ అశ్విన్ - 61 వికెట్లు (26 ఇన్నింగ్స్‌లలో, 2021-23)

4. రవీంద్ర జడేజా - 50 వికెట్లు (22 ఇన్నింగ్స్‌లలో, 2023-25)

5. రవీంద్ర జడేజా - 47 వికెట్లు (25 ఇన్నింగ్స్‌లలో, 2021-23)

6. జస్ప్రీత్ బుమ్రా - 45 వికెట్లు (19 ఇన్నింగ్స్‌లలో, 2023-25).


కాగా ముంబై టెస్ట్ కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో మిగిలివున్న వికెట్ కూడా జడేజా ఖాతాలో చేరితే ఈ మ్యాచ్‌లో అతడు తీసిన వికెట్ల సంఖ్య 10కి చేరుతుంది. దీంతో డబ్ల్యూటీసీ 2023-25​​సైకిల్‌లో జడేజా వికెట్ల సంఖ్య 51కి పెరుగుతుంది. దీంతో ఆస్ట్రేలియా పేసర్ జాస్ హేజిల్‌వుడ్‌ను సమం చేస్తాడు.

Updated Date - Nov 03 , 2024 | 07:11 AM