Share News

IND vs ENG: క్రికెట్ దేవుడి ఆల్ టైమ్ రికార్డుపై కన్నేసిన కోహ్లీ, రూట్.. బద్దలవుతుందా..?

ABN , Publish Date - Jan 19 , 2024 | 02:05 PM

Sachin Tendulkar: భారత్, ఇంగ్లండ్ మధ్య కీలక టెస్ట్ సిరీస్‌కు సమయం ఆసన్నమైంది. రెండు జట్ల మధ్య ఈ నెల 25 నుంచి 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుంది. 2023-2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో ఇరు జట్లకు ఈ సిరీస్ కీలకం కానుంది. రెండు జట్ల మధ్య చివరగా జరిగిన టెస్ట్ సిరీస్ హోరాహోరీగా సాగింది.

IND vs ENG: క్రికెట్ దేవుడి ఆల్ టైమ్ రికార్డుపై కన్నేసిన కోహ్లీ, రూట్.. బద్దలవుతుందా..?

భారత్, ఇంగ్లండ్ మధ్య కీలక టెస్ట్ సిరీస్‌కు సమయం ఆసన్నమైంది. రెండు జట్ల మధ్య ఈ నెల 25 నుంచి 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుంది. 2023-2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో ఇరు జట్లకు ఈ సిరీస్ కీలకం కానుంది. రెండు జట్ల మధ్య చివరగా జరిగిన టెస్ట్ సిరీస్ హోరాహోరీగా సాగింది. ప్రస్తుతం రెండు జట్లు అన్ని విభాగాల్లో బలంగా ఉండడంతో ఈ సారి కూడా హోరాహోరీ పోరు తప్పకపోవచ్చు. అయితే ఈ సిరీస్ ద్వారా భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది. భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు సచిన్ పేరు మీదనే ఉంది. 53 ఇన్నింగ్స్‌లో సచిన్ 2,535 పరుగులు చేశాడు. త్వరలో ప్రారంభం కాబోయే సిరీస్ ద్వారా ఈ రికార్డును ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ జో రూట్, టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్రేక్ చేసే అవకాశం ఉంది. సచిన్ రికార్డును బ్రేక్ చేయడానికి జోరూట్ కేవలం 10 పరుగులు చేస్తే సరిపోతుంది.


భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌ల్లో 45 ఇన్నింగ్స్‌లు ఆడిన రూట్ 2,526 పరుగులు చేశాడు. భారత గడ్డపై కూడా రూట్‌కు మంచి రికార్డులున్నాయి. భారత్ వేదికగా ఆడిన టెస్టుల్లో రూట్ 20 ఇన్నింగ్స్‌ల్లో 952 పరుగులు చేశాడు. సగటు 50కి పైగా ఉంది. ఇందులో రెండు సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలున్నాయి. ఇప్పటికే భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డు రూట్ పేరు మీదనే ఉంది. రూట్ ఏకంగా 9 సెంచరీలు చేశాడు. ఏడేసి సెంచరీల చొప్పున చేసిన సచిన్, ద్రావిడ్, అలిస్టర్ కుక్ రెండో స్థానంలో ఉన్నారు. ఇక 50 ఇన్నింగ్స్‌ల్లో 1991 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ కూడా సచిన్ ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో కోహ్లీ 545 పరుగులు చేస్తే సచిన్‌ను అధిగమిస్తాడు. ఇటీవల సౌతాఫ్రికా గడ్డపై ముగిసిన టెస్ట్ సిరీస్‌లో కోహ్లీ రాణించాడు. ఆ సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో కోహ్లీ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే సచిన్ రికార్డును అధిగమించడం పెదగా కష్టమేమి కాదు. కాగా ఈ నెల 25 నుంచి హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా జరగనున్న తొలి టెస్ట్ మ్యాచ్ ద్వారా భారత్, ఇంగ్లండ్ మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభంకానుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 19 , 2024 | 02:11 PM