Share News

భారత పతక వేటకు విఘాతం

ABN , Publish Date - Oct 23 , 2024 | 01:15 AM

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ పతకాల వేటకు గట్టిదెబ్బ తగిలింది. 2026 గ్లాస్గో (స్కాట్లాండ్‌)లో జరిగే క్రీడల నుంచి హాకీ, బ్యాడ్మింటన్‌, రెజ్లింగ్‌, క్రికెట్‌లను తొలగించారు. మంగళవారం విడుదల చేసిన రోస్టర్‌లో క్రీడా విభాగాల సంఖ్యను 19 నుంచి...

భారత పతక వేటకు విఘాతం

2026 కామన్వెల్త్‌ గేమ్స్‌లో 10 క్రీడాంశాలే

హాకీ, క్రికెట్‌, బ్యాడ్మింటన్‌, రెజ్లింగ్‌, టీటీ అవుట్‌

వ్యయం తగ్గించేందుకే ఈ నిర్ణయం

లండన్‌: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ పతకాల వేటకు గట్టిదెబ్బ తగిలింది. 2026 గ్లాస్గో (స్కాట్లాండ్‌)లో జరిగే క్రీడల నుంచి హాకీ, బ్యాడ్మింటన్‌, రెజ్లింగ్‌, క్రికెట్‌లను తొలగించారు. మంగళవారం విడుదల చేసిన రోస్టర్‌లో క్రీడా విభాగాల సంఖ్యను 19 నుంచి 10కి కుదించారు. తొలగించిన క్రీడల్లో భారత్‌ పతకాలు సాధించేవే ఎక్కువగా ఉండడంతో మన అథ్లెట్లు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. నిర్వహణ భారాన్ని తగ్గించుకోవడం కోసం క్రీడాంశాల సంఖ్యను కుదించినట్టు కామన్వెల్త్‌ గేమ్స్‌ సమాఖ్య (సీడబ్ల్యూఎఫ్‌) మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. 2022 బర్మింగ్‌హామ్‌ క్రీడల్లో 19 క్రీడాంశాలకు చోటు కల్పించారు. కానీ, గ్లాస్గోలో ఆ సంఖ్యను దాదాపుగా సగానికి తగ్గించారు. టేబుల్‌ టెన్నిస్‌, స్క్వాష్‌, ట్రయాథ్లాన్‌, బీచ్‌ వాలీబాల్‌, రగ్బీలను కూడా రోస్టర్‌ నుంచి తొలగించారు. మొత్తంగా రాకెట్‌ స్పోర్ట్స్‌ను ఈ క్రీడల్లో కనిపించకుండా చేశారు. గత క్రీడల్లోనే షూటింగ్‌కు చోటు కల్పించక పోవడంతో.. ఈ క్రీడాంశాన్ని కొత్తగా చేర్చే విషయంలో ముందుగానే ఆశలు వదులుకొన్నారు.


‘అథ్లెటిక్స్‌ (ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌), స్విమ్మింగ్‌, బాస్కెట్‌బాల్‌, ట్రాక్‌ సైక్లింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, లాన్‌ బౌల్స్‌, ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌, నెట్‌బాల్‌, బాక్సింగ్‌, జూడోలను నిర్వహించనున్నామ’ని సీడబ్ల్యూఎఫ్‌ తెలిపింది. నాలుగు వేదికల్లో నిర్వహించే ఈ పోటీల్లో 74 దేశాలకు చెందిన 3వేల మంది అథ్లెట్లు పాల్గొంటారని చెప్పింది. ఆటగాళ్లకు వసతి సౌకర్యాలను హోటళ్లలోనే కల్పించనున్నట్టు పేర్కొంది. పారా క్రీడలను కూడా నిర్వహించనున్నట్టు పేర్కొంది. 23వ కామన్వెల్త్‌ క్రీడలు 2026 జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు జరగనున్నాయి. బర్మింగ్‌హామ్‌ క్రీడల్లో భారత్‌ 22 స్వర్ణాలు సహా 61 పతకాలు సాధించింది. వాస్తవంగా 2026 క్రీడలు ఆస్ట్రేలియాలోని విక్టోరియా సిటీలో జరగాల్సి ఉండగా.. వ్యయ భారం కారణంగా ఆ నగరం తప్పుకొంది. దీంతో క్రీడల నిర్వహణ కోసం గ్లాస్గో ముందుకొచ్చింది. ఎక్కువ సమయం లేకపోవడంతో కొత్తగా స్టేడియాలు నిర్మించకుండా.. ఉన్న వాటితోనే ఈవెంట్‌ను పూర్తి చేసేలా ప్రణాళికలు రచించారు.


షాక్‌కు గురిచేసింది..

కామన్వెల్త్‌ క్రీడలనుంచి హాకీ, రెజ్లింగ్‌, క్రికెట్‌, టీటీలను తొలగించడం షాక్‌కు గురి చేసిందని పలువురు అథ్లెట్లు చెప్పారు. ‘తీవ్రంగా నిరాశపడ్డా. కానీ మన చేతుల్లో ఏమీ లేదు’ అని హాకీ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ అన్నాడు. ఇది చాలా దురదృష్టకరమని టీటీ వెటరన్‌ శరత్‌కమల్‌ చెప్పాడు. దీంతో భారత పతకాలు సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. కాగా, స్క్వాష్‌ ప్లేయర్‌ దీపిక పల్లికల్‌ కూడా రాకెట్‌ క్రీడలను తొలగించడంపై ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఒక్క అడుగు ముందుకేస్తే.. రెండడుగులు వెనక్కి లాగుతున్నట్టుంది. స్క్వాష్‌ క్రీడకు ఈ నిర్ణయం ఎంతో నష్టదాయకమ’ని పల్లికల్‌ చెప్పింది.


పునరాలోచన చేయాలి

బ్యాడ్మింటన్‌ను తొలగించడం తీవ్ర ఆందోళనకు, నిరాశకు గురి చేసింది. బలమైన శక్తులుగా ఎదుగుతున్న భారత్‌ లాంటి దేశాలే లక్ష్యంగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారేమోనని అనిపిస్తోంది. సరైన కారణాలు లేకుండా క్రీడాంశాలను తప్పించడం క్రీడల వృద్ధికి శరాఘాతం. దీనిపై భారత్‌ గొంతు విప్పాలి.

కోచ్‌ పుల్లెల గోపీచంద్‌

కామన్వెల్త్‌కు క్రేజ్‌ లేదు

కామన్వెల్త్‌ క్రీడల క్రేజ్‌ తగ్గుతోంది. ఇన్ని క్రీడల్ని తొలగించడం అందుకు బలాన్ని చేకూరుస్తోంది. ఆసలు ఈ క్రీడలు నిర్వహించాల్సిన అవసరం లేదు. భారత్‌ కూడా తమ బృందాన్ని పంపకూడదని భావిస్తున్నా.

మాజీ కోచ్‌ విమల్‌ కుమార్‌

Updated Date - Oct 23 , 2024 | 01:15 AM