Share News

Hyderabad: రైతుల్ని రెచ్చగొట్టడమే హరీశ్‌ పని: ఆది శ్రీనివాస్‌

ABN , Publish Date - Sep 09 , 2024 | 03:47 AM

రైతులకు రుణమాఫీ అమలవుతుందన్న బెంగతో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీశ్‌రావుకు కన్నీళ్లు ఆగట్లేదని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఎద్దేవా చేశారు.

Hyderabad: రైతుల్ని రెచ్చగొట్టడమే హరీశ్‌ పని: ఆది శ్రీనివాస్‌

  • గల్ఫ్‌ కార్మికుల సంక్షేమంపై 17 లోగా నిర్ణయం: వేం

హైదరాబాద్‌/మేడ్చల్‌, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): రైతులకు రుణమాఫీ అమలవుతుందన్న బెంగతో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీశ్‌రావుకు కన్నీళ్లు ఆగట్లేదని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఎద్దేవా చేశారు. రైతులను రెచ్చగొట్టడమే ఆయన పనిగా పెట్టుకున్నారని ఆదివారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో పేర్కొన్న ప్రకారమే.. కుటుంబంలో ఎంతమంది ఉన్నా రూ.2 లక్షల మేరకే రుణమాఫీ చేశామన్నారు. రైతుల గురించి హరీశ్‌ ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్‌గౌడ్‌ అన్నారు.


రైతు సురేందర్‌రెడ్డి ఆత్మహత్యపై హరీశ్‌రావు మాట్లాడిన తీరు రైతులను రెచ్చగొట్టే విధంగా ఉందని, ఆయనపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ను భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి కోరారు. రుణమాఫీపైన ఆయన తప్పుడు ప్రచారం చేస్తూ రైతుల్ని ఆందోళనకు గురి చేస్తున్నారని పేర్కొంటూ ఆయన కలెక్టర్‌కు లేఖ రాశారు. ఈనెల 17లోగా గల్ఫ్‌ కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుందని సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి వెల్లడించారు. తనను కలిసిన టీపీసీసీ ఎన్నారై సెల్‌ ప్రతినిధులకు ఈ మేరకు తెలిపారు.


  • గాంధీభవన్‌లో ఘనంగా ‘చవితి’

గాంధీభవన్‌లో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం వేద పండితుడు శ్రీనివాస్‌ వర్మ ఆధ్వర్యంలో పార్టీ నేతలు వినాయక విగ్రహానికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్‌ సర్కారు పని చేస్తోందన్నారు. కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, టీపీసీసీ నేతలు నిరంజన్‌, కుమార్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 09 , 2024 | 03:47 AM