Share News

BJP: ఇక తెలంగాణపై కమలం గురి!

ABN , Publish Date - Nov 24 , 2024 | 04:50 AM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన నేపథ్యంలో బీజేపీ ఇక తెలంగాణపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడంతోపాటు రాజకీయ వ్యూహాలకూ పదును పెట్టే యోచనలో ఉంది.

BJP: ఇక తెలంగాణపై కమలం గురి!

  • తొలుత జీహెచ్‌ఎంసీ పీఠంపై నజర్‌.. పార్టీ సంస్థాగత బలోపేతంపై ప్రత్యేక దృష్టి

  • ఆపై ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’పై కమలం దృష్టి!

  • రేవంత్‌ సర్కారు లక్ష్యంగా కార్యాచరణ

  • హామీల అమలులో వైఫల్యంపై జనంలోకి..

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన నేపథ్యంలో బీజేపీ ఇక తెలంగాణపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడంతోపాటు రాజకీయ వ్యూహాలకూ పదును పెట్టే యోచనలో ఉంది. దక్షిణాదికి తెలంగాణను గేట్‌వేగా భావిస్తున్న బీజేపీ అగ్రనాయకత్వం.. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ అధికార పీఠా న్ని కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే అంతర్గత కార్యాచరణ అమలు చేస్తోంది. తాజాగా మహారాష్ట్ర ఫలితాల జోష్‌ను తెలంగాణలో కొనసాగించేందుకు సమాయత్తమవుతోందని పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. ఇందులో భాగంగా పార్టీని సంస్థాగత బలోపేతం చేయాలని, జీహెచ్‌ఎంసీతో పాటు ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని రాష్ట్ర పార్టీని జాతీయ నాయకత్వం ఆదేశించింది. జీహెచ్‌ఎంపీ ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం వచ్చే ఏడాది డిసెంబరులో పూర్తవుతున్న దృష్ట్యా, ఈసారి పీఠం కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో రాష్ట్ర పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సాధించి మేయర్‌ పీఠానికి అతి చేరువలోకి వచ్చి నిలిచిపోయిన బీజేపీ.. ఈసారి రాజధానిలో సత్తా చాటాలని, తద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు మరింత బలపడాలని భావిస్తోంది. ఇందులో భాగంగా స్థానిక పార్టీ ముఖ్యులు, కార్పొరేటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించింది. గ్రేటర్‌ పరిధిలోని అన్ని డివిజన్లలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగట్టాలని, ప్రజా సమస్యలపై పోరాటాలను విస్తృతం చేయాలని నిర్దేశించింది. వీటితోపాటు ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో విస్తృతంగా ఎండగట్టేలా దీర్ఘకాలిక కార్యాచరణ రూపొందిస్తున్నామని పార్టీ ముఖ్యనేత ఒకరు తెలిపారు.


  • కొత్త అధ్యక్షుడిపై ఆచితూచి నిర్ణయం..

రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడి నియామకం విషయం లో జాతీయ నాయకత్వం ఆచితూచి నిర్ణయం తీసుకుంటుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. క్యాడర్‌లో ఉత్సాహం తీసుకురావడంతోపాటు ముఖ్యనేతలను సమన్వయం చేసుకోవడం, కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. బీఆర్‌ఎ్‌సకు అవకాశం ఇవ్వకుం డా అధికార పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని ప్రజల్లో విశ్వాసం కల్పించే నాయకుడు అవసరమన్న భావనలో ఉన్నట్లు చెబుతున్నాయు. ఈ దిశగా అభిప్రాయ సేకరణ కూడా జరిగిందని పార్టీ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు. వచ్చే నెలాఖరు లేదా జనవరి మొదటి వారంలో కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. కొత్త అధ్యక్షుడి నియామకం తరువాత రాష్ట్రంలో బీజేపీ దూకుడు మరింత పెంచుతుందని, ఇతర పార్టీల నుంచి ముఖ్యమైన నేతలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుందని కమలం వర్గాలు పేర్కొంటున్నా యి. ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డి పట్ల అసంతృప్తితో ఉన్నవారిపై ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’ను ప్రయోగించే ప్ర యత్నం చేస్తుందని అంటున్నాయి. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని బలహీనపరచడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుందని చెబుతున్నాయి. ఈ మేరకు ఈటల రాజేందర్‌తోపాటు పలువురు తెలంగాణ నేతలు ఇప్పటికే ఢిల్లీలో పార్టీ పెద్దలతో భావి కార్యాచరణపై చర్చించినట్లు తెలిసింది. డిసెంబరు మొదటి వారంలోగా పార్టీలో మార్పులు, చేర్పులు జరుగుతాయని ఈ సందర్భంగా వారికి అగ్ర నాయకత్వం సూచనప్రాయంగా చెప్పినట్లు సమాచారం.


  • కర్ణాటకపైనా స్పెషల్‌ ఫోకస్‌..

కర్ణాటకలో ఉప ఎన్నికలు జరిగిన మూడు స్థానాలనూ కాంగ్రెస్‌ పార్టీయే గెలుచుకోవడంతో.. ఆ రాష్ట్రంలో బీజేపీ తన భవిష్యత్తుపై తీవ్రంగా ఆలోచించాల్సిన సమయం వచ్చిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా మాజీ సీఎం యడ్యూరప్ప కుమారుడు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయేంద్రను తక్షణం మార్చాల్సిన అవసరం ఉందంటున్నాయి. ఆయనకు వ్యతిరేకంగా ఇప్పటికే పార్టీలో తీవ్ర అసంతృప్తి ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ నేతలు బసన్నగౌడ పాటిల్‌ యత్నాల్‌, రమేశ్‌ జర్ఖోలితోపాటు పది మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే యడ్యూరప్ప వర్గంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి.


  • రేవంత్‌ అబద్ధపు ప్రచారాల్ని మరాఠా ప్రజలు నమ్మలేదు

    25.jpg

‘‘రేవంత్‌ అబద్ధపు ప్రచారాల్ని మరాఠా ప్రజలు నమ్మలేదు. ఏడాది క్రితం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై ఆయన దృష్టి పెట్టాలి. కాంగ్రెస్‌ చేతగానీ, అసమర్థత కారణంగానే బీజేపీ మనుగడ కొనసాగుతోంది. బీజేపీకి బలమైన ప్రతిపక్షంగానూ నిలువలేని దుస్థితిలో కాంగ్రెస్‌ ఉంది. దేశ భవిష్యత్తుకు ప్రాంతీయ పార్టీలే బలమైన పునాదులు. మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ ఎన్నికల ఫలితాలతో ఈ విషయం తేలిపోయింది. బలమైన ప్రతిపక్షంగా కూడా నిలవలేని కాంగ్రెస్‌ దేశంలో ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయాలని చూస్తోంది. ఇందులో బీజేపీ కూడా తక్కువ కాదు. ప్రాంతీయ పార్టీలు బలంగా లేని ప్రాంతాల్లోనే బీజేపీ గెలుస్తోంది.’’

- కేటీఆర్‌


  • మహారాష్ట్రలో కాంగ్రెస్‌ గ్యారెంటీల గారడీ విఫలం

    25.jpg

‘‘ఐదు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్‌ చేసిన గారడీని మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదు. తెలంగాణలో కాంగ్రెస్‌ మోసాలను మహారాష్ట్ర ప్రజలు గుర్తించి గుణపాఠం చెప్పారు. తెలంగాణలో మహిళలకు రూ. 2,500 ఇస్తామన్న మహాలక్ష్మి పథకం అమలు చేయకుండా మహారాష్ట్రలో రూ.3,000 ఇస్తామనడం, రైతు భరోసా ఎగ్గొట్టడం, ఆసరా అమలు చేయకపోవడం, ఏడాది గడుస్తున్నా రైతు రుణమాఫీ పూర్తి చేయకపోవడం వంటివి మహారాష్ట్రలో తీవ్ర ప్రభావం చూపాయి. బీజేపీ హేమంత్‌ సోరెన్‌పై పెట్టిన అక్రమ కేసు లు, అరెస్టులు, పార్టీ చీల్చే ప్రయత్నాలను ఝార్ఖండ్‌ ప్రజలు తిప్పి కొట్టారు. బీజేపీ కక్ష సాధింపు విధానాల్ని ప్రజలు హర్షించడంలేదని తేలిపోయింది. ఝార్ఖండ్‌లో గెలిచిన హేమంత్‌ సోరెన్‌కు శుభాకాంక్షలు’’

- హరీశ్‌ రావు

Updated Date - Nov 24 , 2024 | 04:50 AM