Share News

Bandi Sanjay: రుణమాఫీపై శ్వేతపత్రం ఇవ్వాలి..

ABN , Publish Date - Aug 19 , 2024 | 03:56 AM

రైతులకు ఎంత వరకు రుణమాఫీ చేశారు..? ఇంకెంత మందికి పథకం అందాల్సి ఉంది..? అనే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

Bandi Sanjay: రుణమాఫీపై శ్వేతపత్రం ఇవ్వాలి..

  • హామీల అమలుపై చర్చను పక్కదోవ పట్టించేందుకే పార్టీల విలీనం డ్రామాలు

  • బీఆర్‌ఎస్‌ కాలం చెల్లిన పార్టీ: సంజయ్‌

  • రాష్ట్ర ఇన్‌చార్జిగా ఎవర్నీ నియమించలేదు

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

సిరిసిల్ల/హైదరాబాద్‌/సిటీ, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): రైతులకు ఎంత వరకు రుణమాఫీ చేశారు..? ఇంకెంత మందికి పథకం అందాల్సి ఉంది..? అనే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. రుణమాఫీ అమలుకాక రైతులు కాంగ్రెస్‌ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నా.. సర్కారు పట్టించుకోవడం లేదన్నారు. రుణమాఫీ సహా ఆరు గ్యారెంటీలపై చర్చను పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కలిసి విలీన డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.


సిరిసిల్లలోని శివభక్త మార్కండేయ స్వామి ఆలయంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ మహా చండీ యాగంలో ఆదివారం సంజయ్‌ పాల్గొన్నారు. అదేవిధంగా హైదరాబాద్‌ కోఠిలోని యంగ్‌ మెన్స్‌ ఇంప్రూవ్‌మెంట్‌ సొసైటీ భవన ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతులందరికీ రూ.40 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించి.. బడ్జెట్‌లో రూ.26 వేల కోట్లు కేటాయించి.. రూ.17వేల కోట్లు మాత్రమే మాఫీ చేస్తారా..? అని సర్కారును ప్రశ్నించారు. రైతు భరోసా, బోనస్‌, రుణమాఫీ హామీలను అమలు చేయలేదని విమర్శించారు. అన్నదాతలకు ఇచ్చిన హామీలను నేరవేర్చాలని కోరారు.


బీఆర్‌ఎస్‌ కాలం చెల్లిన పార్టీ అని.. ఆ పార్టీ ఎమ్మెల్యేల అవసరం కాంగ్రె్‌సకే ఉందన్నారు. అవినీతి పార్టీ బీఆర్‌ఎ్‌సతో పొత్తు పెట్టుకోవాల్సిన కర్మ బీజేపీకి లేదని సంజయ్‌ అన్నారు. కాగా, పాత పద్ధతిలోనే గురుకుల ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని బండి సంజయ్‌.. సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. గతంలో డిసెండింగ్‌ ఆర్డర్‌ విధానంలో నియామక ప్రక్రియ చేపట్టి.. రిలింక్వి్‌షమెంట్‌ విధానంలో ఖాళీలు ఏర్పడకుండా మెరిట్‌ అభ్యర్థులకు అవకాశం ఇస్తూ ఉద్యోగాలను భర్తీ చేసిన విధానాన్ని ఇప్పుడు కూడా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.


  • బీసీలకు 42% రిజర్వేషన్‌ ఇవ్వండి: లక్ష్మణ్‌

కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రకటించినట్లుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరుడు పాపన్నగౌడ్‌ అని లక్ష్మణ్‌ అన్నారు.


  • పాటిల్‌ను నియమించలేదు: కిషన్‌రెడ్డి

బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌గా ఎవరినీ నియమించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌గా అభయ్‌ పాటిల్‌ను నియమించినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై కిషన్‌రెడ్డి స్పందించారు. అభయ్‌పాటిల్‌ను పార్లమెంటు ఎన్నికల ఇన్‌చార్జ్‌గా మాత్రమే కేంద్ర పార్టీ నియమించిందని ఒక ప్రకటనలో వివరించారు. కాగా, రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మతో హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ భేటీ అయ్యారు. ఇది మర్యాదపూర్వక భేటీయే అని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఆదివారం రాజ్‌భవన్‌లో ఈ సమావేశం జరిగింది.

Updated Date - Aug 19 , 2024 | 03:56 AM