Share News

మాఫీ తర్వాత రైతులకు మీరిచ్చింది 7,500 కోట్లే!

ABN , Publish Date - Aug 21 , 2024 | 03:41 AM

రాష్ట్రంలో రుణమాఫీ పూర్తయిన రైతులకు వెంటనే పంట రుణాలు అందజేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క బ్యాంకర్లకు సూచించారు.

మాఫీ తర్వాత రైతులకు మీరిచ్చింది 7,500 కోట్లే!

  • మేం రూ.18 వేల కోట్లు జమ చేశాం

  • కొత్త రుణాలివ్వడంలో జాప్యమేల?

  • బ్యాంకర్లపై డిప్యూటీ సీఎం అసంతృప్తి

  • బ్యాంకర్ల సమావేశంలో సూచనలు

హైదరాబాద్‌, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రుణమాఫీ పూర్తయిన రైతులకు వెంటనే పంట రుణాలు అందజేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క బ్యాంకర్లకు సూచించారు. రుణమాఫీ పథకం కింద ప్రభుత్వం రూ.18 వేల కోట్లను బ్యాంకులకు జమ చేస్తే.. ఇప్పటి వరకు రైతులకు మాఫీ తర్వాత కొత్తగా ఇచ్చిన పంట రుణాలు మాత్రం రూ.7,500 కోట్లేనని అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త రుణాలు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని, ఇది సరి కాదని అన్నారు.

రుణాల అందజేతలో వేగం పెంచాలని చెప్పారు. మంగళవారం ప్రజాభవన్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లెక్కలు చెప్పడం కాదని, రుణాల అందజేతలో బ్యాంకర్లు మానవీయ కోణంలో వ్యవహరించాలని సూచించారు. రుణాల అందజేతలో వారం ఆలస్యమైనా ఫలితం ఉండదన్నారు. వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్తును అందిస్తున్నామని, రూ.2 లక్షలలోపు పంట రుణాలను మాఫీ చేస్తున్నామని, ఇలాంటి చర్యలన్నీ వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను బలోపేతం చేస్తాయని వివరించారు.


వ్యవసాయంతో పాటు పారిశ్రామిక రంగాన్ని ప్రభుత్వం మరో ప్రాధాన్య అంశంగా పరిగణిస్తుందన్నారు. నవీన విధానాలతో ముందుకు వెళుతున్నామని, ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటించి రూ.36 వేల కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్నారని చెప్పారు.

సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధి కలుగుతుందని, అలాంటి పరిశ్రమల వారికి విరివిగా రుణాలిచ్చి ప్రోత్సహించాలని బ్యాంకర్లకు సూచించారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాలకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలను ఇవ్వాలని నిర్ణయించామన్నారు. అలాంటి సంఘాలకు కూడా సహకరించి పారిశ్రామికాభివృద్ధికి దోహదపడాలని చెప్పారు. రాబోయే త్రైమాసికంలో నిర్దేశించిన రుణ ప్రణాళికను సాధించడానికి బ్యాంకర్లు కృషి చేయాలని కోరారు. కాగా, ప్రస్తుత ఖరీఫ్‌ త్రైమాసికంలో ఇప్పటివరకు రూ.17,300 కోట్ల కొత్త రుణాలిచ్చామని బ్యాంకర్లు తెలిపారు.


తప్పులు సరిదిద్దండి: తుమ్మల

రైతుల రుణ ఖాతాల్లో ఉండే తప్పులను సరిదిద్దడానికి బ్యాంకర్లు చొరవ తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.

Untitled-3 copy.jpg

ఈ మేరకు కింది స్థాయిలో పనిచేసే బ్యాంకుల బ్రాంచ్‌ మేనేజర్లకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. బాధ్యతాయుతంగా వ్యవహరించి, రుణమాఫీని సంపూర్ణం చేయడానికి సహకరించాలన్నారు.

ఈసారి పుష్కలం గా వర్షాలు కురుస్తున్నాయని, అధిక విస్తీర్ణంలో పంట లు సాగవుతాయని ఆశిస్తున్నామని చెప్పారు. మూడు నెలలకోసారి బ్యాంకర్ల సదస్సులను నిర్వహించడం వల్ల ప్రయోజనం ఉండదని, రైతులకు రుణాలిస్తేనే సార్థకత ఉంటుందన్నారు. రైతులు, ఇతర లక్షిత వర్గాలకు ఆర్థిక ఫలాలు అందేట్లు చూడాలని చెప్పారు.

Updated Date - Aug 21 , 2024 | 03:41 AM