Share News

Budget Debate: సబిత కంటతడి..

ABN , Publish Date - Aug 01 , 2024 | 02:52 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో తనపై అవమానకరంగా మాట్లాడారంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కంటతడి పెట్టారు.

Budget Debate: సబిత కంటతడి..

  • సీఎం అవమానకరంగా మాట్లాడారు

  • మహిళలపై ఆయనకు గౌరవం లేదు

  • శాంతిభద్రతలపై ప్రశ్నించినందుకే

  • మమ్నల్ని టార్గెట్‌ చేశారు

  • మీడియా పాయింట్‌ వద్ద సబిత

  • ఏ పార్టీలో ఉన్నా కమిట్‌మెంట్‌తో పనిచేస్తాం: సునీత

హైదరాబాద్‌, జూలై 31(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో తనపై అవమానకరంగా మాట్లాడారంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కంటతడి పెట్టారు. బుధవారం మధ్యాహ్నం సభ వాయిదా పడిన అనంతరం బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి ఆమె మీడియా పాయింట్‌ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేటీఆర్‌ బడ్జెట్‌పై నిజాలు మాట్లాడుతుంటే దాని నుంచి దృష్టి మళ్లించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ తమపై అవమానకరంగా మాట్లాడారని ఆరోపించారు. గతంలో కూడా సోనియాగాంధీతోపాటు చాలా మంది మహిళలను ఇలాగే అవమానించారని, దీనిని బట్టే మహిళలంటే ఆయనకు ఎంత గౌరవం ఉందో తెలుస్తోందని అన్నారు.


తన 24 ఏళ్ల రాజకీయ జీవితంలో చాలా మంది సీఎంలను చూశానని, కానీ.. సీఎం కుర్చీనే అవమానించేలా రేవంత్‌ ఒక్కరే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏ మొహం పెట్టుకుని వస్తున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క అనడం బాధకలిగిస్తోందన్నారు. సీఎం బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాజకీయాల్లో చాలా మంది పార్టీలు మారతారన్నారు. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులను కాంగ్రె్‌సలో ఎలా చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నుంచి తమను ఎలా మెడపట్టి బయటకు నెట్టారో తెలుసునన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ప్రభుత్వాన్ని నిలదీసినందుకే తనను టార్గెట్‌ చేశారని చెప్పారు. సీఎం రేవంత్‌, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి వల్లే ఆనాడు తన కుమారుడికి టికె ట్‌ రాలేదని ఆరోపించారు. అసెంబ్లీ నుంచి సీఎం దొంగలా పారిపోయారని ఆరోపించారు. తమ కర్మకాలి అసెంబ్లీకి వచ్చామని వ్యాఖ్యానించారు.

Updated Date - Aug 01 , 2024 | 02:52 AM