Share News

KTR: ఆ కీలక మలుపు లేకుంటే.. జూన్ 2 గెలుపు లేనే లేదు

ABN , Publish Date - Dec 09 , 2024 | 10:21 AM

ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని కేసీఆర్ స్థాపించారు. ఆయన సారథ్యంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టారు. ఆ క్రమంలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన.. ఆమరణ నిరాహార దీక్ష సైతం చేపట్టారు.

KTR: ఆ కీలక మలుపు లేకుంటే.. జూన్ 2 గెలుపు లేనే లేదు
BRS Working President KTR

హైదరాబాద్, డిసెంబర్ 09: రాష్ట్ర సెక్రటేరియట్‍లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. అలాంటి వేళ డిసెంబర్ 9వ తేదీ ప్రాముఖ్యత వివరిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.. తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. మహోజ్వల ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు.. స్వరాష్ట్ర కల సాకారానికి పునాది వేసిన రోజు అని ఆయన పేర్కొన్నారు. అలాగే " కేసిఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. " అని చావునోట్లో తలపెట్టిన సంకల్పానికి.. దేశ రాజకీయ వ్యవస్థ దిగివచ్చిన రోజు అని గుర్తు చేశారు. తెలంగాణ చరిత్రలో.. “నవంబర్ 29” లేకపోతే.. “డిసెంబర్ 9” ప్రకటన లేదన్నారు. ఈ కీలక మలుపు లేకపోతే.. “జూన్ 2” గెలుపు లేనే లేదని ఆయన స్పష్టం చేశారు. దగాపడ్డ నేల విముక్తి కోసం.. ఉద్యమ సారథే ప్రాణత్యాగానికి సిద్ధమై.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఊపిరిపోసిన.. “దీక్షా విజయ్ దివస్” సందర్భంగా.. యావత్ తెలంగాణ ప్రజలకు.. లక్షలాది గులాబీ సైనికులందరికీ.. కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. జై తెలంగాణ, జై కేసీఆర్ ఆంటూ ముగించారు.


ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని కేసీఆర్ స్థాపించారు. ఆయన సారథ్యంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టారు. ఆ క్రమంలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన.. ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. దీంతో నాటి యూపీఏ ప్రభుత్వం దిగి వచ్చింది. డిసెంబర్ 9వ తేదీన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్లు నాటి యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ తన ప్రాణాలకు తెగించి కొట్లాడారు. అందులోభాగంగా తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో అంటూ ఆయన పలుమార్లు ఢిల్లీ వెళ్లి.. నాటి ప్రభుత్వంలోని పెద్దలతో ఆయన కీలక చర్చలు జరిపారు. దీంతో ఎన్నో దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం కోసం కలలు కన్న తెలంగాణ ప్రజలు కల సాకారమైంది.


ఇక 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయింది. అదే సమయంలో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ఓటరు కేసీఆర్ పార్టీకి పట్టం కట్టాడు. దాదాపు దశాబ్దం పాటు కేసీఆర్ పాలన సాగించారు. ఇంకోవైపు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం కొలువు తీరింది. అయితే రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు.


దీంతో గతంలో కేసీఆర్ రూపొందించిన విగ్రహానికి, రేవంత్ ప్రభుత్వం రూపొందించిన విగ్రహానికి చాలా తేడా ఉంది. దాంతో రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విగ్రహాన్ని బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. రేవంత్ ప్రభుత్వం తీసుకున్న ముర్ఖత్వపు చర్యగా కేసీఆర్.. ఆదివారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశంలో అభివర్ణించారు. ఆ క్రమంలో అందుకు నిరసనగా తెలంగాణ అమర వీరుల స్తూపం వద్ద నిరసన చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకునే క్రమంలో.. అందుకు సంబంధించిన చరిత్రలో నవంబర్ 29, డిసెంబర్ 9వ తేదీలకు ఉన్న ప్రాముఖ్యతను కేటీఆర్ వివరించారు. అలాగే ఈ కీలక తేదీలు లేకుంటే.. జూన్ 2వ తేదీ గెలుపు లేనే లేదని ఆయన స్పష్టం చేశారు.

For Telangana News And Telugu News

Updated Date - Dec 09 , 2024 | 10:27 AM