CM Revanth : కుటుంబానికో.. డిజిటల్ కార్డు
ABN , Publish Date - Sep 23 , 2024 | 02:49 AM
రాష్ట్రంలో త్వరలో ఫ్యామిలీ డిజిటల్ కార్డును తీసుకురాబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రతి కుటుంబానికీ ఈ కార్డును ఇస్తామని, దీని ద్వారానే రేషన్, ఆరోగ్యశ్రీ, కల్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాల లబ్ధిని ఆయా కుటుంబాలకు అందజేస్తామని పేర్కొన్నారు.
దాని ద్వారానే రేషన్, ఆరోగ్యశ్రీ , కల్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాలు
ప్రతి ఒక్కరికీ హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ కార్డు
సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ వెల్లడి
ఎమ్మెల్యేలు అవినీతికి దూరంగా ఉండాలి
గత ప్రభుత్వంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
డబ్బులు తీసుకున్నందునే ఓడిపోయారు
కష్టపడి పనిచేసిన వారికి తప్పక అవకాశాలు
ప్రభుత్వంపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి: రేవంత్
మహేశ్‌కుమార్‌గౌడ్‌ను సన్మానించిన సీఎల్పీ
పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తా: మహేశ్
సీఎల్పీ భేటీకి పలువురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు
హైదరాబాద్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో త్వరలో ఫ్యామిలీ డిజిటల్ కార్డును తీసుకురాబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రతి కుటుంబానికీ ఈ కార్డును ఇస్తామని, దీని ద్వారానే రేషన్, ఆరోగ్యశ్రీ, కల్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాల లబ్ధిని ఆయా కుటుంబాలకు అందజేస్తామని పేర్కొన్నారు. దీంతోపాటు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ కార్డును ఇస్తామని చెప్పారు. ఇక అధికార పార్టీ శాసనసభ్యులుగా బాధ్యతతో మెలగాలని, అవినీతికి దూరంగా ఉండాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల బదిలీలు, ఇతర విషయాల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకోవడంతో వారిని ప్రజలు ఓడించారని తెలిపారు.
ఈ విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు సచివాలయానికి గుంపులు గుంపులుగా రావద్దని, క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి పని చేయాలని సూచించారు. అప్పుడే వారు మరోసారి గెలిపిస్తారన్నారు. ఆదివారం టీపీసీసీ నూతన అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను సన్మానించేందుకు కాంగ్రెస్ శాసనసభాపక్షం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఓ హోటల్‌లో సమావేశమయింది. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపా దాస్‌మున్షీ, ఇన్‌చార్జి కార్యదర్శులు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. తొలుత కొత్తగా టీపీసీసీ చీఫ్ మహే్‌షకుమార్‌గౌడ్‌ను సీఎల్పీ సన్మానించింది. ఆ తర్వాత ఆయనను నియమించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియాగాందీ, రాహుల్‌గాంధీకి ధన్యవాదాలు తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది.
సమన్వయంతో ముందుకుసాగాలి..
టీపీసీసీ చీఫ్‌కు సన్మానం అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీని ఓడించాల్సిన చారిత్రక అవసరం ఉన్న సమయంలో టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌గౌడ్ బాధ్యతలు చేపట్టారన్నారు. పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకెళ్లాలని, ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ నాయకత్వం ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. పార్టీ అనుబంధ విభాగాల్లో పనిచేసిన 36 మందికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చామని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పని చేసినందునే వారికి పదవులు ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి కచ్చితంగా అవకాశాలు వస్తాయన్నారు. డీసీసీ అధ్యక్ష పదవులను కూడా ప్రజల్లో ఉన్న నాయకులకే ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు సూచించారు. అధికారం కోల్పోయిన ప్రతిపక్షం.. అసహనంతో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలకు పాల్పడుతోందని సీఎం అన్నారు. పార్టీ నేతలు వాటిని తిప్పికొట్టాలన్నారు. ఇన్‌చార్జి మంత్రులు వారానికి రెండుసార్లు జిల్లాల్లో పర్యటించాలని సూచించారు. బీసీ కులగణన చేయాలన్నది రాహుల్‌గాంధీ బలమైన ఆలోచన అని, ఆయన ఆలోచన మేరకు బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులను నియమించామని తెలిపారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే కచ్చితంగా జనాభాను లెక్కించాల్సిందేనన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలుపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశామని, ఈ కమిటీ సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని చెప్పారు.
ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు..
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ గెలిచి నాలుగోసారి అధికారంలోకి వచ్చేందుకే ప్రధాని మోదీ జమిలి ఎన్నికలను తీసుకువస్తున్నారని రేవంత్ అన్నారు. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ నేతలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గడిచిన 9 నెలలుగా తాను ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న కొత్త కార్యక్రమాలను ఎమ్మెల్యేలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చేయని విధంగా 27 రోజుల్లో రూ.18 వేల కోట్ల మేరకు రైతుల రుణాన్ని మాఫీ చేశామని గుర్తు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ.. ప్రభుత్వానికి ప్రతి నెలా రూ.18 వేల కోట్ల మేరకు రాబడి వస్తోందని తెలిపారు. అయితే అందులో జీతభత్యాలు, అప్పులకు వాయిదాలు, వడ్డీలకే రూ.12 వేల కోట్లు పోతున్నాయన్నారు. మిగిలిన రూ.6 వేల కోట్లతోనే సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నామని, దుబారా ఖర్చును పూర్తిగా తగ్గించామని చెప్పారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలు హాజరు!
బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు కూడా సీఎల్పీ సమావేశానికి హాజరయ్యారు. వీరిలో పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివా్‌సరెడ్డి, కడియం శ్రీహరి తదితరులు ఉన్నారు. అయితే సమావేశం అనంతరం అరికెపూడి గాంధీ సీఎల్పీ సమావేశానికి హాజరు కావడంపై మంత్రి శ్రీధర్‌బాబును మీడియా ప్రశ్నించగా.. ఆయన సీఎల్పీ భేటీలో పాల్గొన్నట్లు మీరు చూశారా? అని ఎదురు ప్రశ్నించారు. ఈ సమావేశం శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో జరిగినందున స్థానిక ఎమ్మెల్యేగా సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు గాంధీ వచ్చారని తెలిపారు. గతంలో కేసీఆర్ సీఎం హోదాలో సిద్దిపేటకు వెళితే హరీశ్‌రావు వెళ్లి కలవలేదా? అని వ్యాఖ్యానించారు. కాగా అమెరికా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, ఇతర కారణాలతో మంత్రి సీతక్క సీఎల్పీ భేటీకి హాజరు కాలేదు. కశ్మీర్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా హాజరు కాలేదు. ఖమ్మం ఎంపీ, ఒకరిద్దరు ఎమ్మెల్యేలూ అనివార్య కారణాలతో రాలేకపోయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
కార్యకర్తలను గెలిపించుకుందాం : మహేశ్‌కుమార్‌గౌడ్
అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన కార్యకర్తలను స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో 90 శాతం స్థానాలను కాంగ్రెస్ గెలవాలని, ఈ విషయంలో ఇన్‌చార్జి మంత్రులకు ఎక్కువ బాధ్యత ఉందని అభిప్రాయపడ్డారు. కార్యకర్తలు, నాయకులకు తాను నిత్యం అందుబాటులో ఉంటానని, తన ఫోన్ ఎప్పుడూ ఆన్‌లోనే ఉంటుందని చెప్పారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తానని, కార్యకర్తలను సమాయత్తం చేసి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే తన లక్ష్యమని అన్నారు. తాను, సీఎం రేవంత్‌రెడ్డి ఎంతో మమేకమై పనిచేశామని చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనలను పార్టీ, ప్రజాప్రతినిధులు జనంలోకి తీసుకెళ్లాలన్నారు. కేసీఆర్ పదేళ్లపాటు అబద్ధాలతో రాష్ర్టాన్ని పాలించారని, రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో ముంచేసి వెళ్లారని ఆరోపించారు. ఈ దేశానికి ఆశాకిరణం రాహుల్‌గాంధీ అని, ఆయనను ప్రధానిగా చేయడమే ధ్యేయంగా అంతా పనిచేయాలని సూచించారు. ప్రధాని మోదీకి భవిష్యత్తు లేదన్నారు. కులం, మతం పేరుతో యువతను తప్పుదారి పట్టిస్తున్నారని, వారిని చైతన్యపరుద్దామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ ఆశీస్సులు రాష్ట్ర కాంగ్రె్‌సకు ఎప్పుడూ ఉంటాయన్నారు. రాష్ట్రంలో రెండోసారీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.