Share News

CM Revanth Reddy: కొడంగల్‌.. దశ తిరిగేలా

ABN , Publish Date - Oct 15 , 2024 | 04:34 AM

రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతంగా ఉన్న కొడంగల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు.

CM Revanth Reddy: కొడంగల్‌.. దశ తిరిగేలా

  • సొంత నియోజకవర్గంపై రేవంత్‌ దృష్టి.. రూ.4,358 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం

కొడంగల్‌, అక్టోబరు 14: రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతంగా ఉన్న కొడంగల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. మాజీ సీఎంలు ప్రాతినిథ్యం వహించిన గజ్వేల్‌, కుప్పం, పులివెందులను తలదన్నేలా సొంత నియోజకవర్గాన్ని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించారు. అందు కోసం కడా(కొడంగల్‌ అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ) ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రగతికి శ్రీకారం చుట్టారు. కొడంగల్‌లో మెడికల్‌, ఇంజనీరింగ్‌, ఐటీఐ కళాశాలలు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, పరిశ్రమలు, నారాయణపేట, కొడంగల్‌ ఎత్తిపోతల ఏర్పాటుకు రూ.4,358.65 కోట్లు విడుదల చేశారు. వాటితో ఇప్పటికే పలు పనులు ప్రారంభం కాగా, కొన్ని టెండర్‌ దశలో ఉన్నాయి. నియోజకవర్గ పరిధిలోని రోడ్ల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. కొడంగల్‌, కోస్గి మునిసిపాలిటీల అభివృద్ధ్దికి అదనంగా రూ.400 కోట్లు మంజూరయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. పలు అభివృద్ధి పనులకు ఫిబ్రవరి 21, 2024న సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులతో కలిసి కోస్గిలో శంకుస్థాపన చేశారు. కృష్ణా-వికారాబాద్‌ రైల్వే లైన్‌ సర్వేతో ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేరేందుకు అడుగు పడింది.


  • విద్యా కేంద్రంగా అభివృద్ధి..

విద్యలో వెనకబడిన కొడంగల్‌ ప్రాంతాన్ని ఎడ్యుకేషన్‌ హబ్‌గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అందులో భాగంగా కొడంగల్‌ మండల పరిధిలోని అప్పాయిపల్లి శివారులో మెడికల్‌, పశు వైద్య కళాశాలలు, నైపుణ్య అభివృద్ధి కేంద్రం.. కోస్గిలో ఇంజనీరింగ్‌ కళాశాల, దుద్యాల మండల పరిధిలోని హకీంపేట్‌లో ఐటీఐ కాలేజీ, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.. దౌల్తాబాద్‌, బొంరా్‌సపేట్‌ మండల కేంద్రాల్లో జూనియర్‌ కళాశాలలు, పాత కొడంగల్‌ పరిధిలో మినీ స్టేడియం, సమీకృత గురుకులాలల ఏర్పాటుకు కసరత్తులు చేపట్టారు.

  • సాగుకు పెద్ద పీట..

వ్యవసాయంపై ఆధారపడే ఈ ప్రాంత వాసులకు కొడంగల్‌, నారాయణపేట ఎత్తిపోతల పథకంతో లక్షా 30 వేల ఎకరాలకు సాగునీటితో పాటు తాగు నీరందించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందు కోసం రూ.2,945.5 కోట్లు మంజూరు కావడంతో ఆ పనులు కొనసాగుతున్నాయి. పది రిజర్వాయర్లను నిర్మించి ఫేజ్‌-1లో మూడు నియోజకవర్గాల పరిధిలోని చెరువులను నింపి, ఆయకట్టు పెంచేందుకు కృషి చేస్తున్నారు.


  • కడా ఏర్పాటుతో పనులు వేగవంతం..

కొడంగల్‌ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్‌ కొడంగల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ తిరుపతిరెడ్డి పర్యవేక్షణలో పనులు వేగవంతం అవుతున్నాయి. సీఎస్‌ శాంతికుమారి, ఓఎస్డీ చంద్రశేఖర్‌రెడ్డి తదితర రాష్ట్ర స్థాయి అధికారులు, వికారాబాద్‌, నారాయణపేట కలెక్టర్లు పలు అభివృద్ధి పనులపై సమీక్షలు నిర్వహించారు. దీంతో పాటు ఇటీవల మెడికల్‌ కళాశాల భూ బాధితులకు పరిహారం అందించి, కాలేజీ పనులకు శ్రీకారం చుట్టారు.


  • రూ.4,358.65 కోట్లతో అభివృద్ధి షురూ..

కొడంగల్‌ అభివృద్ధి కోసం ఇప్పటి వరకు రూ.4,358.65 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో నారాయణపేట, కొడంగల్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కోసం రూ.2945.5 కోట్లు, పశువైద్య శాల ఏర్పాటుకు రూ.360 కోట్లు, ప్రధాన రోడ్లు, కల్వర్టుల ఏర్పాటుకు రూ.344.5 కోట్లు, ఆర్‌అండ్‌బీ అతిథి గృహాలకు రూ.6.8కోట్లు.. ప్రభుత్వాసుపత్రిని 50 పడకల నుంచి 220 పడకలుగా మార్చేందుకు, మెడికల్‌, నర్సింగ్‌, ఫిజియోథెరపీ కళాశాలలకు రూ.224.5కోట్లు, నియోజకవర్గంలో ఇతరత్రా 30 పనులకు రూ.213.2కోట్లు.. ఎస్సీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలలకు రూ.90కోట్లు, గిరిజన గురుకుల పాఠశాలకు రూ.17.56కోట్లు, కోస్గిలో పాల్‌టెక్నిక్‌ కళాశాలను ఇంజనీరింగ్‌ కళాశాలగా ఉన్నతీకరించేందుకు రూ.30కోట్లు, కోస్గిలో మహిళా డిగ్రీ కళాశాలకు రూ.11కోట్లు.. బొంరా్‌సపేట్‌, దౌల్తాబాద్‌లో జూనియర్‌ కళాశాలలకు రూ.7.13 కోట్లు, కొడంగల్‌ మునిసిపల్‌ అభివృద్ధికి రూ.45 కోట్లు, శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి రూ.18.50 కోట్లు, బురాన్‌పూర్‌లో ఫూలే బాలికల పాఠశాల, కొడంగల్‌లో అదనపు తరగతి గదుల కోసం రూ.48.45కోట్లు, కడా పరిధిలో ఇతరత్రా పనులకు రూ.16.25కోట్ల మంజూరుతో పనులు ప్రారంభమయ్యాయి.

Updated Date - Oct 15 , 2024 | 04:34 AM