Share News

Caste Enumeration: జనగణనలో కులగణన

ABN , Publish Date - Dec 27 , 2024 | 04:11 AM

కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జన గణనలో కులగణన కూడా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రతిపాదించారు. కులగణనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు.

Caste Enumeration: జనగణనలో కులగణన

  • దేశవ్యాప్తంగా కులగణన కోసం కాంగ్రెస్‌ పోరాడాలి

  • సీడబ్ల్యూసీ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి.. సీఎం రేవంత్‌రెడ్డి సూచన

  • ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించిన సీడబ్ల్యూసీ

  • జనాభా ప్రకారం పునర్విభజన జరిగితే దక్షిణాదికి అన్యాయమన్న సీఎం

హైదరాబాద్‌, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జన గణనలో కులగణన కూడా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రతిపాదించారు. కులగణనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. బెళగావిలో గురువారం జరిగిన సీడబ్ల్యూసీ సదస్సులో రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. కులగణన చేపట్టడం ద్వారా తెలంగాణ దేశానికే మార్గదర్శిగా మారిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా చేపట్టనున్న జన గణనలో కులగణన కూడా చేయాలంటూ కాంగ్రెస్‌ పోరాటం చేయాలని ఆయన సూచించారు. ఈ విషయంలో సీడబ్ల్యూసీ ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలన్నారు. ఆయన ప్రతిపాదన మేరకు సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. త్వరలో చేప్టటనున్న నియోజకవర్గాల పునర్విభజనలోనూ ఏఐసీసీ తగు జాగ్రత్తలు తీసుకోవాలని రేవంత్‌ అభిప్రాయపడ్డారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయంలో ఏఐసీసీ వ్యూహాత్మకంగా వ్యవహరించి, జాగ్రత్తగా ముందడుగు వేయాలని సూచించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన మహిళా బిల్లు కొలిక్కి వచ్చిన నేపథ్యంలో దానిపై కాంగ్రెస్‌ పార్టీనే ఎక్కువగా ప్రచారం చేసుకోవాల్సి ఉందని సీఎం పేర్కొన్నారు. మహిళా బిల్లును కూడా బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశాలున్నందున కాంగ్రెస్‌ అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు.


కుల గణనతో విప్లవాత్మక మార్పులు: మహేశ్‌కుమార్‌ గౌడ్‌

రాహుల్‌ గాంధీ ఆలోచనలతో చేపట్టాలని నిర్ణయించిన కులగణనతో దేశంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. కులాలు, మతాల పేరిట రాజకీయాలు చేస్తూ దేశాన్ని విభజించి పాలిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న బీజేపీ ఎత్తుగడలకు కులగణన చెంపపెట్టు లాంటిదని చెప్పారు. కులగణనకు అత్యంత ప్రాధాన్యమిచ్చి, దాన్ని చేపట్టడం ద్వారా తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. సీడబ్ల్యూసీ సదస్సులో మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ప్రసంగించారు. తెలంగాణలో కుల గణన సర్వే ఇప్పటికే 90 శాతం పూర్తయిందన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని, చరిత్రను తిరగరాయలని చూస్తోందని మండిపడ్డారు. ఇలాంటి తరుణంలో దేశానికి సేవలు, త్యాగాలు చేసిన కాంగ్రెస్‌ పార్టీ త్యాగ పురుషుల జీవితాలను నేటి తరానికి వివరించాల్సి ఉందని అన్నారు. సరిగ్గా వందేళ్ల క్రితం ఇదే బెళగావిలో మహాత్మాగాంధీని సీడబ్ల్యూసీ ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నుకుందని గుర్తుచేశారు. ఆ తర్వాత ఏ పదవినీ స్వీకరించకపోయినప్పటికీ గాంధీజీ పాటించిన విలువలు, ఆదర్శప్రాయమైన జీవనం కారణంగా ప్రపంచమంతా ఆయన సిద్ధాంతాలను అనుసరిస్తోందని కొనియాడారు.

Updated Date - Dec 27 , 2024 | 04:11 AM