Share News

Nagarjuna Sagar: సాగర్‌ క్రస్ట్‌ గేట్లు భద్రమేనా?

ABN , Publish Date - Aug 12 , 2024 | 03:50 AM

రెండు తెలుగు రాష్ట్రాల అన్నపూర్ణగా పేరొందిన నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ క్రస్ట్‌ గేట్లు భద్రమేనా? అని నీటిపారుదల శాఖ విశ్రాంత నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Nagarjuna Sagar: సాగర్‌ క్రస్ట్‌ గేట్లు భద్రమేనా?

  • తుంగభద్ర ఘటనతో అనుమానాలు

  • రెండేళ్ల కిందట వరదల సమయంలో

  • మొరాయించిన ఒకటో నెంబరు గేటు

  • వరదలప్పుడే హడావుడిగా మరమ్మతులు

  • మాములు రోజుల్లో కన్నెత్తి చూడని వైనం

నాగార్జునసాగర్‌, ఆగస్టు 11: రెండు తెలుగు రాష్ట్రాల అన్నపూర్ణగా పేరొందిన నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ క్రస్ట్‌ గేట్లు భద్రమేనా? అని నీటిపారుదల శాఖ విశ్రాంత నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టు 19వ నెంబర్‌ క్రస్ట్‌ గేటు శనివారం అర్ధరాత్రి వరద ఉధృతికి కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో సాగర్‌ క్రస్ట్‌గేట్ల నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవి ప్రతి ఏడాదీ వరద వచ్చే సమయానికి లీకేజీలతో ఉంటున్నాయి.


రెండేళ్ల క్రితం (2022, ఆగస్టు 11న) వరద వచ్చి గేట్లు ఎత్తే సమయంలో ఒకటో నెంబరు గేటు మొరాయించింది. ఐదు అడుగులు ఎత్తేసరికి ఆగిపోయింది. గేటును పూర్తిగా (45 అడుగులు) ఎత్తడానికి ఇంజనీర్లు నానా తంటాలు పడాల్సి వచ్చింది. అంతేకాకుండా అదే ఏడాది ఆగస్టు 15న 26వ నెంబర్‌ క్రస్ట్‌ గేటును ఎత్తే క్రమంలో మోటారు ఫ్యాన్‌ విరిగి అజ్మతుల్లా అనే ఉద్యోగికి గాయాలయ్యాయి. క్రస్ట్‌ గేట్లను ఎత్తే సమయంలో అవి సగం లేచి మధ్యలో మొరాయిస్తే వరద ధాటికి కొట్టుకుపోయే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.


తుంగభద్ర ప్రాజెక్టు గేటు కూడా అలాగే కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 2022 అక్టోబరులో సాగర్‌ కుడి కాల్వ మొత్తం తొమ్మిది గేట్లు కాగా, 9వ నెంబరు గేటు వరద ధాటికి కొట్టుకుపోయింది. అప్పుడు ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిస్థాయిలో ఉండటంతో ఎంత ప్రయత్నించినప్పటికీ నిపుణులు గేటును అమర్చలేకపోయారు. దీంతో ఆరు నెలలు నీరంతా వృథాగా కిందికి పోయింది. సాగర్‌ ప్రాజెక్టు అధికారులు వరద వచ్చినప్పుడు మాత్రమే క్రస్ట్‌గేట్లకు హడావుడిగా తూతూమంత్రంగా మరమ్మతులు చేస్తున్నారు. మిగతా రోజుల్లో వాటి వైపు కన్నెత్తి కూడా చూడటంలేదు.


క్రస్ట్‌ గేట్లు కొట్టుకుపోవడం వంటి ప్రమాదం జరిగితే దిగువన ఉన్న వందలాది గ్రామాలు, లక్షలాది ఎకరాల భూముల జలమయమవుతాయి. అధికారులు ఎగువ ప్రాజెక్టుల పరిస్థితులను చూసిన తర్వాత అయినా సాగర్‌ ప్రాజెక్టు నిర్వహణను గాలికి వదిలేయకుండా సమర్థంగా చేపట్టాలని పలువురు నీటిపారుదల శాఖ విశ్రాంత ఇంజనీర్లు, నిపుణులు సూచిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదం నేపథ్యంలో ఈ ఏడాది ప్రాజెక్టు మరమ్మతులు, క్రేన్‌ ట్రాక్‌ నిర్మాణ పనులు పూర్తిస్థాయిలో జరగలేదు.

Updated Date - Aug 12 , 2024 | 03:50 AM