Share News

Congress: అట్టహాసంగా విజయోత్సవాలు

ABN , Publish Date - Dec 08 , 2024 | 03:12 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన- విజయోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. విజయోత్సవాల ముగింపు వేడుకలు శనివారం నుంచి సోమవారం వరకు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Congress: అట్టహాసంగా విజయోత్సవాలు

  • 3 రోజుల పాటు ముగింపు వేడుకలు.. హెచ్‌ఎండీఏ భారీ ఏర్పాట్లు

  • నేడు సాగర్‌ తీరంలో ఎయిర్‌ షో.. రేపు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

  • హైదరాబాద్‌లో లక్ష మందితో బహిరంగ సభ

  • ఏడాది ప్రజాపాలనలో ఎంతో సంతృప్తి.. ఎక్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి

  • విద్యుద్దీపాల వెలుగుల్లోహైదరాబాద్‌.. తొలి రోజు ఆకట్టుకున్న కార్యక్రమాలు

  • నేడు సాగర్‌ తీరంలో ఎయిర్‌ షో.. రేపు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

హైదరాబాద్‌/సిటీ, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన- విజయోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. విజయోత్సవాల ముగింపు వేడుకలు శనివారం నుంచి సోమవారం వరకు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకల్లో ప్రజలు కూడా భాగస్వాములయ్యేలా కార్యక్రమాలను రూపొందించారు. మూడు రోజుల పాటు వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. తొలి రోజైన శనివారం సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత కచేరి, ఫుడ్‌, హస్తకళలు, సాంస్కృతిక స్టాళ్లు ఏర్పాటు చేశారు. రెండో రోజైన ఆదివారం భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ఎయిర్‌ షో, రాహుల్‌ సిప్లిగంజ్‌తో సంగీత కచేరి, ఫుడ్‌, ఇతర స్టాళ్లు ఉంటాయి. మూడో రోజైన సోమవారం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, సీఎం బహిరంగ సభ, డ్రోన్‌ షో, బాణసంచా, ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌ సంగీత కచేరి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. విజయోత్సవాలకు హెచ్‌ఎండీఏ భారీ ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌ రోడ్‌, హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌ వేదికగా పలు సంగీత, సాంస్కృతిక, వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. శనివారం హుస్సేన్‌సాగర్‌ తీర ప్రాంతాలన్నీ విద్యుద్దీపాలతో దేదీపమాన్యంగా వెలుగొందాయి. ఆయా ప్రాంతాల్లో పెద్దఎత్తున ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్లకు సందర్శకులు పోటెత్తారు. రాష్ట్ర సచివాలయం, బీఆర్‌కేభవన్‌లు త్రివర్ణ విద్యుద్దీపాలతో ఆకట్టుకుంటున్నాయి. హెచ్‌ఎండీఏ గ్రౌండ్‌లో ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివా్‌సతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక, ఆహార, హస్తకళల స్టాల్స్‌ సందర్శకులతో నిండిపోయాయి.


  • నేడు వైమానిక ప్రదర్శన

విజయోత్సవ సంబరాల వేళ ఆదివారం సాయంత్రం 4 గంటలకు భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌ వద్ద వైమానిక ప్రదర్శన ఏర్పాటు చేశారు. హుస్సేన్‌సాగర్‌పై విమాన విన్యాసాల ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఆదివారం సాయంత్రం ఎయిర్‌ షోను అద్భుతంగా నిర్వహించేందుకు కెప్టెన్‌ అజయ్‌ దాశరథి బృందం చర్యలు చేపడుతోంది. ఈ షోలో తొమ్మిది సూర్యకిరణ్‌ విమానాలు పాల్గొననున్నాయి. ఎయిర్‌షోను వీక్షించేందుకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకల ఏర్పాట్లూ చేయాలని సీఎస్‌ శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. ఎయిర్‌ షో ముగిసిన తర్వాత ప్రముఖ గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ నేతృత్వంలో సంగీత కచేరి నిర్వహించనున్నారు.


  • రేపు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

సచివాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. సోమవారం సాయంత్రం 6.05 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని సీఎస్‌ శాంతికుమారి తెలిపారు. ఐమ్యాక్స్‌ పక్కన గల హెచ్‌ఎండీఏ గ్రౌండ్‌లో లక్ష మంది స్వయం సహాయక సంఘాల మహిళలతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ మార్గ్‌లో డ్రోన్‌ షో నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు. హుస్సేన్‌సాగర్‌లోనే పెద్దఎత్తున బాణసంచా కాల్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా కార్యక్రమాల అనంతరం ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌ నేతృత్వంలో సంగీత కచేరీ ఉండనుంది. ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌, నెక్లెస్‌ రోడ్డులో ఫుడ్‌ స్టాళ్లతో పాటు హస్తకళల, సాంస్కృతిక, పలు ప్రభుత్వ విభాగాలకు చెందిన స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. విజయోత్సవ సంబరాలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.


ప్రజలు తెచ్చుకున్న ప్రభుత్వమిది

::: అసెంబ్లీ స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌

బేగంపేట/పంజాగుట్ట, డిసెంబరు7 (ఆంధ్రజ్యోతి): ప్రజలు తెచ్చుకున్న ప్రభుత్వమిది అని, సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధిలో ముందుకు పోతోందని అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని పేర్కొన్నారు. ప్రజాపాలన విజయోత్సవాలను శనివారం సాయంత్రం ఐమాక్స్‌ పక్కన గల హెచ్‌ఎండీఏ గ్రౌండ్‌లో స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. అనంతరం నెక్లెస్‌ రోడ్‌లో ఏర్పాటు చేసిన ఫుడ్‌ స్టాళ్లను, మహిళ శక్తి క్యాంటీన్లను స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, మంత్రి పొన్నం సందర్శించి తినుబండరాల రుచి చూశారు. ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మ్యూజికల్‌ కాన్సర్ట్‌ ఉత్సాహంగా సాగింది.

Updated Date - Dec 08 , 2024 | 03:12 AM