Jeevan Reddy: కొత్త ఆర్వోఆర్ చట్టంతో రైతు సమస్యలకు పరిష్కారం
ABN , Publish Date - Aug 12 , 2024 | 04:51 AM
గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో రైతులు, ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు.
రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేస్తాం: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
కరీంనగర్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో రైతులు, ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రతిపాదించిన నూతన ఆర్వోఆర్ ముసాయిదా బిల్లుపై వివిధ వర్గాలతో చర్చించాలన్నారు. రైతులకు మరింత మేలు జరిగే విధంగా చట్టం రూపకల్పనలో సహకరించాలని కోరారు. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్(ట్రెసా) ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ముసాయిదా బిల్లుపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రామ స్థాయి రెవెన్యూ వ్యవస్థను పటిష్టపరిచి ఒక మంచి చట్టం ద్వారా తెలంగాణ ప్రజలకు మేలైన సేవలు అందిస్తామని తెలిపారు. ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం కొత్త చట్టం చేసే ముందు వివిధ వర్గాల నుంచి సూచనలను తీసుకోవడం శుభ పరిణామమన్నారు. నూతన చట్టం అమలుకు సంబంధించి అసోసియేషన్ ద్వారా తగిన సూచనలు చేస్తామని, వీటి ద్వారా రైతులకు మరిన్ని సేవలు అందించడానికి రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగులందరూ ముందుంటారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.