Hyderabad: ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్లపై ముగిసిన వాదనలు
ABN , Publish Date - Aug 08 , 2024 | 04:46 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు, మాజీ డీసీపీ(ఓఎస్డీ) రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి.
హైదరాబాద్, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు, మాజీ డీసీపీ(ఓఎస్డీ) రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. చంచల్‌గూడ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న వీరిద్దరూ బెయిల్ కోసం మరోసారి నాంపల్లి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై రెండ్రోజుల పాటు విచారణ జరిగింది.
దర్యాప్తు అధికారుల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉండి, విదేశాల్లో ఉన్న వారిని రప్పించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఇంటర్‌పోల్ సహకారం తీసుకుంటున్నామని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తుకు ఆటంకం ఏర్పడుతుందన్నారు. ఇరు వర్గాల వాదనలను నమోదు చేసుకున్న న్యాయమూర్తి.. తీర్పును వాయిదా వేశారు. కాగా.. దర్యాప్తు అధికారులు చార్జిషీట్‌లో పొందుపర్చిన అన్ని పత్రాలను తమకు ఇవ్వలేదని నిందితుల తరపు న్యాయవాదుల వ్యాజ్యంపై దర్యాప్తు అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. కీలక అంశాలున్నందునే వాటిని గోప్యంగా ఉంచామన్నారు. తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 14కు వాయిదా వేసింది.
పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలను వినిపిస్తూ.. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేశారనే ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని, దర్యాప్తు అధికారులు రుజువు చేయలేకపోయారని వివరించారు. దర్యాప్తు ముగిసి, చార్జిషీట్ దాఖలు చేశారని, ఈ నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. చార్జిషీట్ దాఖలు తర్వాత దర్యాప్తు చేసేదేమీ ఉండదన్నారు.