Damodara Rajanarsimha : ఇంటింటి జ్వర సర్వే
ABN , Publish Date - Jul 24 , 2024 | 03:38 AM
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. గతేడాదితో పోల్చితే డెంగీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. జ్వరాలు, చికున్‌గున్యా, మలేరియా, టైఫాయిడ్ కేసులూ పెరుగుతున్నాయి.
సీజనల్ వ్యాధుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
ఇంటింటి జ్వర సర్వే
సీజనల్ వ్యాధుల నేపథ్యంలో సర్కారు నిర్ణయం
హైదరాబాద్, జూలై 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. గతేడాదితో పోల్చితే డెంగీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. జ్వరాలు, చికున్‌గున్యా, మలేరియా, టైఫాయిడ్ కేసులూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీజనల్ వ్యాధుల నివారణకు ఇంటింటి జ్వర సర్వే చేయాలని వైద్యశాఖ నిర్ణయించింది.
ఈమేరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ను మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం ఆదేశించారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో జ్వర సర్వేను క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్నారు. గతేడాది డెంగీ, చికున్‌గున్యా, మలేరియా కేసులు ఎక్కువగా నమోదైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. కాగా రాష్ట్రంలో నాలుగు జిల్లాల్లో డెంగీ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. హైదరాబాద్, ఖమ్మం, మేడ్చల్, నిజామాబాద్ జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి.
ఫీవర్ సర్వే ఇలా....
జ్వర సర్వేలో ఎఎన్‌ఎమ్‌లతో పాటు ఆశావర్కర్‌లు, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (మేల్), మల్టీపర్పస్ హెల్త్ సూపర్‌వైజర్లు పాల్గొంటారు. ఈ టీమ్ అంతా కలిసి రోజుకు 50 ఇళ్లకు వెళ్లి జ్వర సర్వే చేయాలి. బుధ, శనివారం మినహా మిగిలిన అన్ని రోజులూ సర్వే నిర్వహించాలని వైద్యశాఖ ఆదేశించింది.
జాతీయ టీకాల కార్యక్రమం ఉండటంతో ఆ రెండు రోజులు మినహాయింపు ఉంటుంది. సర్వేలో భాగంగా... జ్వర కేసులను గుర్తిస్తే వాటిని సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపుతారు. అక్కడి మెడికల్ ఆఫీసర్ జ్వరబాధితులను పరీక్షిస్తారు.అవసరమనుకున్న కేసుల్ని సమీపంలోని తెలంగాణ వైద్య, విధాన పరిషత్ ఆస్పత్రులు, బోధనాస్పత్రులకు పంపుతారు.