Hyderabad: రాష్ట్రవ్యాప్తంగా రుణమాఫీ సంబరాలు..
ABN , Publish Date - Jun 23 , 2024 | 03:53 AM
ఏకకాలంలో రూ.2 లక్షల మేరకు రైతుల రుణాలను మాఫీ చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో శని, ఆదివారాల్లో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలంటూ పార్టీ శ్రేణులకు టీపీసీసీ పిలుపునిచ్చింది.
సీఎం, మంత్రులకు ధన్యవాదాలు తెలపాలని శ్రేణులకు టీపీసీసీ పిలుపు
సీఎం చిత్రపటానికి పాలాభిషేకాలు
హైదరాబాద్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): ఏకకాలంలో రూ.2 లక్షల మేరకు రైతుల రుణాలను మాఫీ చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో శని, ఆదివారాల్లో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలంటూ పార్టీ శ్రేణులకు టీపీసీసీ పిలుపునిచ్చింది. క్యాబినెట్ తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని, రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వ ఘనతను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించింది. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలుపుతూ పత్రికా సమావేశాలు నిర్వహించాలని దిశానిర్దేశం చేసింది. ఈ మేరకు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఓ ప్రకటన విడుదల చేశారు. 2004లో ఇచ్చిన మాట ప్రకారం సోనియాగాంధీ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని, అలాగే 2022లో రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఏక కాలంలో రూ. 2 లక్షల మేరకు రుణమాఫీ చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించిందని పేర్కొన్నారు.
ఆగస్టు 15 కల్లా రైతు రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఆ మేరకు రూ.31 వేల కోట్ల మేరకు రుణమాఫీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. కాగా.. టీపీసీసీ పిలుపు మేరకు శనివారం రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు స్వీట్లు పంచుతూ, టపాసులు కాలుస్తూ సంబరాలు నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాలు జరిపి.. సీఎం, మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. గాంధీభవన్‌లోనూ కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. కిసాన్ కాంగ్రెస్ కార్యకర్తలు టపాసులు కాల్చి, స్వీట్లు పంచారు. ఇందులో కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు అన్వే్‌షరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనంతరం మీడియా సమావేశంలో అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక రాబోతోందన్నారు. గతంలో ప్రకటించిన మేరకు స్పీకర్ ఫార్మట్‌లో మాజీ మంత్రి హరీశ్ రావు తన రాజీనామా పత్రాన్ని సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. కాగా, ఎన్టీపీసీ బూడిద తరలింపునకు సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్‌పైబీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి చేసిన ఆరోపణలు అర్థరహితమని కాంగ్రెస్ సీనియర్ నేతలు పల్లె లక్ష్మణ్‌గౌడ్, ఆరెపల్లి మోహన్ కొట్టిపారేశారు. ఒక్కో లారీలో 75టన్నుల మేర బూడిదను తరలిస్తున్నట్లుగా ఆయన చెప్పారని, కానీ అంత సామర్థ్యం కలిగిన లారీలో దేశంలోనే లేవన్నారు. పొన్నంను అవమానిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా రుణమాఫీ: శ్రీహరి
కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి అని, మాటిస్తే దానిపై నిలబడుతుందని మరోసారి రుజువైందని కాంగ్రెస్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. సీఎల్పీ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ.. రూ.31 వేల కోట్ల మేరకు రుణమాఫీ చేస్తున్న ఘనత రేవంత్ ప్రభుత్వానిదేనన్నారు. రైతుల పక్షాన సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు. సత్యనారాయణ మాట్లాడుతూ ఏకకాలంలో రుణమాఫీ చేయడం కేసీఆర్‌కు చేతకాలేదని, ఆగస్టు 15 కల్లా తమ ప్రభుత్వం చేసి తీరుతుందన్నారు.