Share News

Farmers: సకాలంలో చెల్లిస్తే వడ్డీ రాయితీ!

ABN , Publish Date - Dec 17 , 2024 | 04:51 AM

పంటరుణాలు తీసుకున్న కొందరు రైతులు, రుణమాఫీ అవుతుందని ఎదురుచూస్తూనో.. ఆర్థిక సమస్యలతోనో అసలు బ్యాంకులవైపే చూడకపోవడంతో వారిపైనే వడ్డీ భారం రోజు రోజుకు పెరుగుతోంది.

Farmers: సకాలంలో చెల్లిస్తే వడ్డీ రాయితీ!

పంట రుణం ఏడాదిలోపు రెన్యువల్‌ చేస్తే 7% వడ్డీ.. అందునా అసలు, వడ్డీ చెల్లిస్తే 3ు వడ్డీ మినహాయింపు

  • ఏడాది దాటితే రైతుపైనే భారం.. 12శాతం వడ్డీ

  • రెన్యువల్‌ చేసుకున్నప్పటికీ రుణమాఫీ పథకం వర్తింపు

  • రైతులకు అవగాహన కల్పిస్తున్న బ్యాంకర్లు

హైదరాబాద్‌, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): పంటరుణాలు తీసుకున్న కొందరు రైతులు, రుణమాఫీ అవుతుందని ఎదురుచూస్తూనో.. ఆర్థిక సమస్యలతోనో అసలు బ్యాంకులవైపే చూడకపోవడంతో వారిపైనే వడ్డీ భారం రోజు రోజుకు పెరుగుతోంది. స్వల్పకాలిక పంటరుణాలు ఏడాదిలోపు తిరిగి చెల్లించకపోతే రైతులపై అదనపు వడ్డీ భారం పడుతుంది. ప్రభుత్వం విడతలవారీగా రుణమాఫీ చేస్తుండటం, కొందరు రైతులకు రుణమాఫీ వర్తించకపోవటం, మరికొందరు రైతులకు అర్హత ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యలతో మాఫీ కాకపోవటం లాంటి రకరకాల కారణాలతో రుణాలను రెన్యువల్‌కు చిక్కులు ఏర్పడుతున్నాయి. రుణాలను రెన్యువల్‌ చేసుకుంటే రుణమాఫీ కాదేమోన్న ఆందోళన రైతుల్లో ఉంది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా 70 లక్షల మంది పట్టాదారులుండగా వీరిలో 45 లక్షల మంది రైతులు బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్నారు. ఈ 45 లక్షల పంటరుణ ఖాతాల్లో ఈ ఏడాది కేవలం 25 లక్షల ఖాతాలు మాత్రమే రెన్యువల్‌ అయ్యాయి. ఈ క్రమంలో బ్యాంకర్లు రెన్యువల్‌పై దృష్టిసారించి, రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రెన్యువల్‌ చేసుకున్నంత మాత్రాన... రుణమాఫీ పథకం వర్తించకుండా పోదని చెబుతున్నారు.


ప్రభుత్వం ప్రకటించిన నిర్ణీత గడువులో (2018 డిసెంబరు 12 తేదీ నుంచి 2023 డిసెంబరు 9 వరకు) ఉన్న బకాయిలకు రుణమాఫీ వర్తిస్తుందని స్పష్టంగా చెబుతున్నారు. నిర్ణీత వ్యవధిలో రెన్యువల్‌ చేసుకోకపోతే 4 శాతం వడ్డీ రాయితీ కోల్పోతారని రైతులకు బ్యాంకు ఫీల్డు ఆఫీసర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. రైతులు పంటరుణం తీసుకున్న తేదీ నుంచి సరిగ్గా ఏడాదికి రెన్యువల్‌ చేసుకుంటే.. కేవలం 7 శాతం వడ్డీ పడుతుంది. పైగా సకాలంలో అసలు, వడ్డీ తిరిగి చెల్లించినందుకుగాను కేంద్ర ప్రభుత్వం 3 శాతం వడ్డీ రాయితీ ఇస్తుంది. అంటే... ఏడాది లోపు అప్పు తిరిగి చెల్లించిన రైతు... కేవలం 4 శాతం వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. 3 శాతం వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఏడాది దాటితే... 12 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. అంటే సాధారణ వడ్డీ 7 శాతం, అదనపు వడ్డీ 5 శాతం కలిపి చెల్లించాల్సి వస్తుంది. దీంతో రైతులకు ఆర్థిక భారం పడుతుంది. ఇదిలాఉండగా స్వల్ఫకాలిక పంట రుణాలు తీసుకున్న రైతులకు రెన్యువల్‌ చేసుకోవటానికి... ఏడాది నుంచి రెండేళ్ల వరకు అదనపు కాలపరిమితి ఉంటుంది. కాస్త వడ్డీ ఎక్కువైనా... రెండేళ్లలోపు రెన్యువల్‌ చేసుకుంటే సమస్య ఉండదు. రెండేళ్లు దాటితే మాత్రం... మొండి బకాయిల(ఎన్‌పీఏ) ఖాతాల్లో కలిపేస్తారు. అప్పుడు రైతులు ఎలాంటి లావాదేవీలు నిర్వహించటానికి ఉండదు. వడ్డీ కూడా మోత మోగుతుంది. 2018 నుంచి ఇప్పటివరకు చాలా ఖాతాలు మొండి బకాయిల జాబితాలో పడి ఉన్నాయి.


రుణమాఫీ పథకంతో ముడి

రైతులు పంటరుణాల రెన్యువల్‌కు రుణమాఫీ పథకంతో ముడిపెడుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నాలుగు విడతల్లో రుణమాఫీ చేపట్టింది. ఇప్పటివరకు 25.36 లక్షల మంది రైతులకు రూ. 20,617 కోట్ల రుణమాఫీ చేసింది. రూ. 2 లక్షల వరకు బకాయిలున్న, అర్హులైన రైతులందరికీ రుణమాఫీ పూర్తిచేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రకటించారు. సాంకేతిక సమస్యలతో ఎవరైనా కొందరు రైతులు మిగిలిపోతే... వారి ఖాతాలను వ్యవసాయశాఖ పరిశీలిస్తుందని చెప్పారు. అయితే రెండు లక్షలకు పైగా అప్పులున్న రైతులకు ఎప్పుడు మాఫీ చేస్తారనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. జీవో విడుదలచేసిన సమయంలో మాత్రం రూ. 2 లక్షలకు పైనున్న మొత్తాన్ని రైతులు చెల్లిస్తే... ప్రభుత్వం రూ. 2 లక్షలు మాఫీ చేస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతమున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రూ. 2 లక్షలకు మించి బకాయిలున్న రైతులకు ఇప్పట్లో మాఫీచేసే పరిస్థితులు కనిపించటంలేదు. రైతులు మాత్రం రుణమాఫీ లెక్కలు పూర్తిగా తేలిన తర్వాతే రెన్యువల్‌ సంగతి చూద్దామనే ఆలోచనతో ఉన్నారు. అయితే బ్యాంకర్లు మాత్రం రెన్యువల్‌ చేయించటానికే ప్రయత్నాలు చేయిస్తున్నారు. రుణమాఫీ పథకంలో లబ్ధిదారులు అయినా, కాకపోయినా రెన్యువల్‌ తప్పనిసరిగా చేసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు.

Updated Date - Dec 17 , 2024 | 04:51 AM