Hyderabad: కొత్త చట్టాల కింద చార్మినార్ ఠాణాలో తొలి కేసు..
ABN , Publish Date - Jul 02 , 2024 | 04:28 AM
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త నేర న్యాయ చట్టం కింద రాష్ట్రంలో తొలి కేసు హైదరాబాద్ చార్మినార్ పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. నంబరు ప్లేట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారుపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 281, మోటారు వెహికల్ చట్టం కింద కేసు పెట్టారు.
నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనదారుపై నమోదు
దర్యాప్తుపై దిశా నిర్దేశానికి సీఐడీలో ప్రత్యేక కేంద్రం
పోస్టర్, ఎస్‌వోపీ విడుదల చేసిన డీజీపీ రవిగుప్తా
హైదరాబాద్, కొత్తపేట, జూలై 1(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త నేర న్యాయ చట్టం కింద రాష్ట్రంలో తొలి కేసు హైదరాబాద్ చార్మినార్ పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. నంబరు ప్లేట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారుపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 281, మోటారు వెహికల్ చట్టం కింద కేసు పెట్టారు. వాహనదారుపై 281 బీఎన్‌ఎస్, 80(ఏ), 177 ఎండీ యాక్ట్ కింద ఇది నమోదైంది. చార్మినార్ స్టేషన్‌లో బీఎన్‌ఎస్ చట్టం కింద డిజిటల్ సంతకంతో తొలి కేసు నమోదు పట్ల డీజీపీ రవిగుప్తా సిబ్బందిని అభినందించారు. వరుస శిక్షణ తరగతులతో పోలీస్ సిబ్బందికి నూతన చట్టాలపై అవగాహన పెరిగిందని తెలిపారు. బీఎన్‌ఎస్ కింద ఎల్‌బీనగర్ ఠాణాలో మొదటి కేసు నమోదైంది.
బాలాపూర్ నందిహిల్స్‌లో ఉండే చింతంరెడ్డి నారాయణరెడ్డి హోటళ్లకు బియ్యం, సరుకులు సరఫరా చేస్తుంటారు. అలేఖ్య టవర్స్ వద్ద బహార్ కేఫ్ నిర్వహిస్తున్న గుంటూరుకు చెందిన కిరణ్ ఐదేళ్లుగా డబ్బు చెల్లించడం లేదు. సోమవారం ఈ విషయమై అడగ్గా.. నారాయణరెడ్డిపై దాడి చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు బీఎన్‌ఎస్ కింద నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేశారు. కాగా, నిర్మల్ జిల్లా పోలీసులు భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్‌ఎ్‌సఎస్) కింద మొదటి కేసు నమోదు చేశారు. లక్ష్మణచాంద మండలం నర్సాపూర్‌లో సాగునీటి ట్యాంక్‌లో చేపలు పట్టేందుకు వెళ్లిన దేశబోయిన పోశెట్టి(52) ప్రమాదవశాత్తు మృతి చెందాడు. అతడి భార్య ఫిర్యాదు మేరకు బీఎన్‌ఎ్‌సఎస్ లోని సెక్షన్ 194(1) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరింత అవగాహనకై..
కొత్త చట్టాలపై దర్యాప్తు అధికారులకు దిశానిర్దేశం చేసేందుకు సీఐడీ విభాగంలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసినట్లు డీజీపీ రవిగుప్తా తెలిపారు. ఇది రోజూ ఉదయం 8 గంటల నుంచి అందుబాటులో ఉంటుందన్నారు. కొత్త చట్టాలపై అవగాహన కోసం రూపొందించిన పోస్టర్లు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ)ను డీజీపీ విడుదల చేశారు. చట్టాలపై రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ అధికారులు శిక్షణ పొందారని చెప్పారు. ప్రజలకు తెలిసేలా తెలుగు, ఆంగ్లంలో ముద్రించిన పోస్టర్లను అన్ని పోలీస్ స్టేషన్ల వద్ద ప్రదర్శిస్తారన్నారు. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సహకారంతో సీఐడీతో కలిసి ఎస్‌వోపీని రూపొందించినట్లు వివరించారు.