Former Sarpanches: బిల్లుల కోసం.. | Former Sarpanches Protest Across Telangana Demanding Release of Pending Bills
Share News

Former Sarpanches: బిల్లుల కోసం..

ABN , Publish Date - Nov 05 , 2024 | 04:11 AM

పెండింగ్‌ బిల్లులు విడుదలచేయాలని మాజీ సర్పంచ్‌లు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలిపారు. జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లిని దర్శించుకున్న అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికివెళ్లి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించుకొని

Former Sarpanches: బిల్లుల కోసం..

  • రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగిన మాజీ సర్పంచులు

  • సీఎం ఇంటికివెళ్లి వినతిపత్రం ఇవ్వాలని ముందస్తు నిర్ణయం

  • ఎక్కడికక్కడ అరెస్టులు.. ఖండించిన మాజీ ప్రజాప్రతినిధులు

  • ఇది దుర్మార్గం.. వారేమన్నా దొంగలా, టెర్రరిస్టులా: హరీశ్‌రావు

హైదరాబాద్‌, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): పెండింగ్‌ బిల్లులు విడుదలచేయాలని మాజీ సర్పంచ్‌లు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలిపారు. జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లిని దర్శించుకున్న అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికివెళ్లి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించుకొని.. హైదరాబాద్‌ చేరుకున్న పలువురు మాజీ సర్పంచ్‌లను పోలీసులు అరెస్టుచేసి వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. సర్పంచ్‌ల సంఘం ముఖ్యనాయకులను వారి స్వగ్రామాల్లో ఉదయం నుంచే గృహనిర్బంధంలో ఉంచారు. సంఘం ప్రతినిధులు, హైదరాబాద్‌కు బయలుదేరి వస్తున్న వారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. రంగారెడ్డి జిల్లా, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఇతర జిల్లాల్లో పలువురు మాజీ సర్పంచ్‌లను హైదరాబాద్‌కు రాకుండా అడ్డుకొని పోలీస్‌ స్టేషన్లకు తరలించారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

దీంతో అరెస్టయిన చోటనే వారంతా తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ.. నిరసనకు దిగారు. అప్పులుతెచ్చి గ్రామాల్లో శ్మశాన వాటికలు, క్రీడా ప్రాంగణాలు, డంపింగ్‌ యార్డులు వంటివి అనేకం అభివృద్ధి పనులు చేశామని వారు పేర్కొన్నారు. ఆయా పనులకు సంబంధించి 2019 నుంచి 2024వరకు బిల్లులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో బిల్లులు చెల్లించాలని సీఎం, గవర్నర్‌ సహా అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వస్తున్న మాజీ సర్పంచ్‌లను ఎక్కడికక్కడ అరెస్టుచేయడం సరికాదని వారు వెల్లడించారు.


  • మాజీ సర్పంచుల అరెస్టును ఖండించిన బీఆర్‌ఎస్‌

రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచ్‌లను అరెస్టు చేయడాన్ని బీఆర్‌ఎ్‌సపార్టీ తీవ్రంగా ఖండించింది. పెండింగ్‌ బిల్లులో కోసం మాజీ సర్పంచులు ఏడాదిగా తిరుగుతున్నారని, వారి కుటుంబాలను రోడ్డున పడేయడం దారుణమని ఆ పార్టీ మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు.. గ్రామాభివృద్ధికోసం ఖర్చుచేసిన డబ్బు ఇవ్వాలని కోరితే అరెస్టులు చేస్తారా? అని వారు ప్రశ్నించారు. మాజీ సర్పంచులంతా అప్పులుతెచ్చి, ఆస్తులమ్మి, భార్యాపిల్లల బంగారం తాకట్టుపెట్టి పనులు చేపట్టారని పేర్కొన్నారు. ప్రజాపాలన అంటే గ్రామానికి సేవచేసిన వారిని అరెస్టు చేయడమేనా? అని ప్రభుత్వాన్ని వారు నిలదీశారు. మాజీఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌, బీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివా్‌సయాదవ్‌ సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డికి ప్రభుత్వం పెండింగ్‌ బిల్లులు చెల్లించింది. సర్పంచ్‌ల పెండింగ్‌ బిల్లులు ఎందుకు చెల్లించదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాధనాన్ని కమీషన్లకోసం ఉపయోగిస్తోందని వారు ఆరోపించారు.


  • ప్రభుత్వం రూ.1500కోట్లు విడుదల చేయాలి

గ్రామాల్లో చేపట్టిన అభివృద్థిపనుల పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు, గృహనిర్బంధాలు చేయడం హేయమైన చర్యఅని సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సింహ్మరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో సర్పంచులు చేసిన అభివృద్థి పనులకు సంబంధించిన రూ.1500కోట్లను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - Nov 05 , 2024 | 04:11 AM