Share News

High Court: కొందరినే టార్గెట్‌ చేయొద్దు..

ABN , Publish Date - Aug 29 , 2024 | 03:40 AM

జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష వరకు అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, వారందరికీ నోటీసులు ఇస్తారా అని హైకోర్టు ప్రశ్నించింది.

High Court: కొందరినే టార్గెట్‌ చేయొద్దు..

  • అందరినీ ఒకే విధంగా చూడాలి

  • అధికారుల అక్రమ నిర్మాణాల నుంచి

  • కూల్చివేతలు మొదలుపెట్టండి

  • లక్ష అక్రమ నిర్మాణాలు ఉన్నాయి..

  • అన్నింటికీ నోటీసులిస్తారా?: హైకోర్టు

హైదరాబాద్‌, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష వరకు అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, వారందరికీ నోటీసులు ఇస్తారా అని హైకోర్టు ప్రశ్నించింది. ముందు ప్రభుత్వ అధికారులకు చెందిన అక్రమ నిర్మాణాల నుంచి కూల్చివేతలు ప్రారంభించాలని జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌ రెడ్డి ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేవలం కొంతమందిని టార్గెట్‌ చేయకుండా అందరినీ ఒకే విధంగా చూడాలని పేర్కొంది. దుర్గం చెరువు పరిధిలో అక్రమ నిర్మాణాలు అన్నింటికీ నోటీసులు ఇచ్చారా అని ప్రశ్నించింది. అధికారుల నోటీసులను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.


దుర్గంచెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లో నిర్మాణాలు చేపట్టారంటూ అధికారులు ఇచ్చిన నోటీసులను సవాల్‌ చేస్తూ రంగారెడ్డి జిల్లా గుట్టలబేగంపేట్‌ గ్రామ పరిధిలోని కావూరి హిల్స్‌లో ఇళ్లు నిర్మించుకున్న మాడిశెట్టి మురళీధర్‌రావు సహా ఏడుగురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ చట్టబద్ధంగా అనుమతులు తీసుకుని, 500 గజాల్లో స్టిల్ట్‌, నాలుగు ఫ్లోర్ల నివాస గృహాలు నిర్మించుకున్నారన్నారు. అవి ఎఫ్‌టీఎల్‌లో ఉన్నాయని నోటీసులు ఇవ్వడం చెల్లదని పేర్కొన్నారు.


ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదిస్తూ దుర్గం చెరువు ఆక్రమణలు, కాలుష్యం అంశాన్ని చీఫ్‌ జస్టిస్‌ నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ సుమోటోగా విచారిస్తోందని, చెరువు పరిశీలనకు నిపుణుల కమిటీని సైతం వేసిందని పేర్కొన్నారు. ఇప్పటికే అన్ని శాఖల అధికారులకు నోటీసులు ఇచ్చిందన్నారు. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ హద్దులు గుర్తించి ఫైనల్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలని సీజే ఆదేశించారని తెలిపారు. ఈ వ్యవహారం చీఫ్‌ జస్టిస్‌ కోర్టులో ఉన్నందున పెండింగ్‌లో ఉన్న ప్రజాప్రయోజన వ్యాజ్యానికి ప్రస్తుత పిటిషన్లను సైతం జత చేయాలని జస్టిస్‌ విజయ్‌సేన్‌ రెడ్డి ధర్మాసనం ఆదేశించింది.


  • దుర్గంచెరువు నీళ్లు పైకొచ్చే చాన్స్‌ లేదుగా

దుర్గం చెరువు సమీపంలోని అమర్‌ కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీలో ఉన్న నిర్మాణానికి రెవెన్యూ అధికారులు ఇచ్చిన నోటీసుపై హైకోర్టు స్టే విధించింది. అన్ని అనుమతులతో చేపట్టిన నిర్మాణాలకు నోటీసు ఇవ్వడంపై ప్లాట్‌ నెంబర్‌ 79 యజమాని ఎల్‌ ఉర్మిళాదేవి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై జస్టిస్‌ కే లక్ష్మణ్‌ విచారణ చేపట్టారు.


పిటిషనర్‌ తరఫున న్యాయవాది రాయ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ 1991లో హుడా అనుమతులతో కట్టుకున్న ఇళ్లను ఇప్పుడు దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌లో ఉన్నాయని చెప్పడం చెల్లదని అన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. దుర్గం చెరువు చుట్టూ నిర్మాణాలు, వాకింగ్‌ ట్రాక్‌లు, కేబుల్‌ బ్రిడ్జి, మాల్స్‌ కట్టారని, చెరువు నీళ్లు పైకి రావడానికి అవకాశమే లేదని, ఇప్పుడు ఎఫ్‌టీఎల్‌ అంటే ఎలా అని ప్రశ్నింది.

Updated Date - Aug 29 , 2024 | 03:40 AM