BJP vs Congress: మంత్రి కుర్చీలో బీజేపీ ఎమ్మెల్యే.. ప్రోటోకాల్‌పై శాసనసభలో నిరసన
ABN , Publish Date - Dec 09 , 2024 | 03:04 PM
సభ ప్రారంభంకాగానే కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి అసెంబ్లీలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సీటులో కూర్చున్నారు. విషయాన్ని గుర్తించిన మరోమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇది ప్రోటోకాల్ ఉల్లంఘన కిందకు వస్తుందని, మీకు ఏదైనా సమస్య ఉంటే సభ దృష్టికి తీసుకురావాలని..
తెలంగాణ శాసనసభ సమావేశాల తొలిరోజు వాడివేడిగా సాగాయి. ప్రోటోకాల్ అంశంపై బీజేపీ, కాంగ్రెస్ శాసనసభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది. సభ ప్రారంభంకాగానే కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి అసెంబ్లీలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సీటులో కూర్చున్నారు. విషయాన్ని గుర్తించిన మరోమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇది ప్రోటోకాల్ ఉల్లంఘన కిందకు వస్తుందని, మీకు ఏదైనా సమస్య ఉంటే సభ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎమ్మెల్యేలకు గౌరవం లేకుండా పోయిందని అందుకే తాను నిరసన తెలిపేందుకు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి స్థానంలో కూర్చున్నట్లు తెలిపారు. ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహంపై చర్చ ఉన్న నేపథ్యంలో రేపు ఈ విషయంపై చర్చిద్దామని మంత్రులు వెంకటరమణారెడ్డికి సూచించగా.. బీజేపీ సభ్యులు ఈరోజు చర్చ జరగాలని పట్టుబట్టారు. జనగణమన తర్వాత ఈ విషయంపై చర్చిద్దామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పగా.. బీజేపీ శాసనసభ్యుడు వెంకటరమణారెడ్డి తన స్థానంలో కూర్చున్నారు. ఆ తర్వాత ఈ విషయంపై సభ్యులు తమ సీట్ల వద్ద నుంచి నిరసన తెలపడంతో పాటు మంత్రులు, ఇతర సభ్యులు ప్రసంగిస్తుండగా కొంత అంతరాయం కలిగించే ప్రయత్నం చేయగా స్పీకర్ వారించే ప్రయత్నం చేశారు. మొదటిసారి శాసనసభకు వచ్చిన సభ్యులు నేర్చుకోవాలని, పద్ధతిగా వ్యవహారించాలని సూచించారు. దీనిపై సంతృప్తి చెందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఈ విషయంపై చర్చకోసం పట్టుబట్టారు.
రేపు చర్చించాల్సిందే..
ప్రోటోకాల్ విషయంపై కాటిపల్లి వెంకటరమణారెడ్డి శాసనసభలో మాట్లాడుతూ.. తన గౌరవం గురించి శాసనసభలో ప్రస్తావించడం లేదని, ఎమ్మెల్యేల గౌరవం అంశాన్ని తాను ప్రస్తావిస్తున్నట్లు తెలిపారు. ఇవాళ తాను ఎమ్మెల్యేగా ఉన్నానని, రేపు మరోవ్యక్తి అదేస్థానంలో ఉండొచ్చని అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ఎమ్మెల్యే స్థానానికి గౌవరం ఇవ్వాలనే అంశంపై తాను మాట్లాడుతున్నట్లు తెలిపారు. తాను ఎన్నికల్లో గతంలో ఓడిపోయి ఉండొచ్చని, 25 ఏళ్లకు పైగా తనకు రాజకీయ అనుభవం ఉందన్నారు. తనకు అనుభవం ఉందని, రేపు తప్పనిసరిగా శాసనసభలో ఈ అంశంపై రేపు చర్చకు అవకాశం కల్పించాలన్నారు. లేకపోతే తాము ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.
సభ వాయిదా..
తెలంగాణ తల్లి విగ్రహంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనపై చర్చ తర్వాత శాసనసభను ఈనెల 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. మరోవైపు శాసనమండలి కూడా ఈనెల 16వ తేదీ సోమవారానికి వాయిదా పడింది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here