Share News

Drugs Case: హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ సరఫరా ముఠా అరెస్టు..

ABN , Publish Date - Aug 02 , 2024 | 05:49 PM

తీగ లాగితే డొంక కదిలినట్లు హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు అయ్యింది. ఓ రేవ్ పార్టీ కేసును విచారిస్తున్న సమయంలో బెంగుళూరు నుంచి నగరానికి మత్తుపదార్థాలు సరఫరా చేస్తున్న ముఠా గురించి తెలిసినట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి వెల్లడించారు. అనంతరం దాడులు నిర్వహించి ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు.

Drugs Case: హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ సరఫరా ముఠా అరెస్టు..
Director of Excise Enforcement Kamalasan Reddy

హైదరాబాద్: తీగ లాగితే డొంక కదిలినట్లు హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు అయ్యింది. ఓ రేవ్ పార్టీ కేసును విచారిస్తున్న సమయంలో బెంగుళూరు నుంచి నగరానికి మత్తుపదార్థాలు సరఫరా చేస్తున్న ముఠా గురించి తెలిసినట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి వెల్లడించారు. అనంతరం దాడులు నిర్వహించి ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా కమలాసన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.


మాదాపూర్ రేవ్ పార్టీ..

ఇటీవల మాదాపూర్‌లోని క్లౌడ్ నైన్ అపార్ట్మెంట్‌లో ఓ రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. రేవ్ పార్టీలో 20మందిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి పేర్కొన్నారు. వీరిలో నాగరాజు యాదవ్‌తోపాటు మరో నిందితుణ్ని పోలీసులు అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు. వారిని విచారించే క్రమంలో బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా అవుతున్న విషయం గుర్తించినట్లు కమలాసన్ రెడ్డి వెల్లడించారు. దీంతో మరింత లోతుగా విచారణ చేపట్టినట్లు చెప్పారు.


హస్టళ్లు కేంద్రంగా దందా..

దీంతో ఎస్.ఆర్.నగర్‌లో హాస్టల్స్ కేంద్రంగా గంజాయి, డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు గుర్తించినట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ చెప్పారు. వెంకట్ బాయ్స్ హాస్టల్లో సోదాలు నిర్వహించినప్పుడు మత్తుపదార్థాలు సరఫరా చేస్తున్న ముఠాను పట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. నిందితుల నుంచి సుమారు 250గ్రాముల గంజాయి, 115గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. వీటి విలువ రూ.12లక్షలు ఉంటుందని చెప్పారు. మత్తుపదార్థాల సరఫరా ముఠాలోని ముగ్గురు కీలక వ్యక్తులు మోహిత్ రావు, పసుపులేటి, రవూఫ్‌లను అరెస్టు చేసినట్లు కమలాసన్ రెడ్డి వెల్లడించారు.


నిందితుడికి నైజీరియా వ్యక్తితో సంబంధం..

వీరంతా బెంగళూరు నుంచి హైదరాబాద్ నగరానికి డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడయ్యిందని కమలాసన్ రెడ్డి పేర్కొన్నారు. నిందితుడు రవూఫ్‌కు నైజీరియా దేశస్థుడు నెగ్గెన్ అనే వ్యక్తితో సంబంధం ఉందని వెల్లడించారు. నిందితులంతా హాస్టళ్లలోనే ఒకరి ద్వారా మరొకరు పరిచయం అయినట్లు తెలిపారు. గతంలో వీరంతా చిన్న మొత్తంలో గంజాయి, డ్రగ్స్ తీసుకునేవారని, అనంతరం ఈజీ మనీ కోసం సప్లై చేయడం మొదలుపెట్టారని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి వెల్లడించారు.


ఎవరైనా సరే తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ క్రయ, విక్రయాలు చేసినా మత్తుపదార్థాలు సరఫరా చేసినా కఠిన చర్యలు ఉంటాయని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి హెచ్చరించారు. ఎవరూ వాటి జోలికి వెళ్లవద్దని ముఖ్యంగా యువత డ్రగ్స్‌కు బానిసై విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఆయన హితవు పలికారు.

Updated Date - Aug 02 , 2024 | 05:51 PM