Share News

Lagacharla Case: లగచర్ల దాడి కేసులో కీలక మలుపు

ABN , Publish Date - Nov 28 , 2024 | 04:52 PM

లగచర్లలో భూసేకరణకు సంబంధించిన విచారణకు వెళ్లిన వికారాబాద్ కలెక్టర్‌ ప్రతీక్ జైన్‌, ఇతర అధికారులపై దాడికి పాల్పడిన ఘటనలో ఏ-1గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి కీలక కుట్రదారుడని రాష్ట్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పల్లె నాగేశ్వర్‌రావు చెప్పారు. ఏ-2గా ఉన్న సురేశ్‌, ఇతర నిందితులకు ఆర్థికంగా, నైతికంగా సహకరించారని తెలిపారు.

Lagacharla Case: లగచర్ల దాడి కేసులో కీలక మలుపు

హైదరాబాద్: లగుచర్ల దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది, ఆయన రిమాండ్‌ను మరోసారి పొడిగించింది. నిన్నటితో 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ ముగిసిన విషయం తెలిసిందే. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. వచ్చేనెల11వరకు రిమాండ్ పొడిగించింది. బెయిల్ పిటీషన్‌పై వికారాబాద్ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. కస్టడీపై ఇప్పటికే వాదనలు ముగిశాయి. క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది.

నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్...

కాగా.. గతంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్‌ ప్రతీక్ జైన్‌పై దాడి ఘటన తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఓవైపు బీఆర్‌ఎస్ పార్టీ నేతల హస్తం ఈ దాడి వెనుక ఉందనే ఆరోపణలు వినిపిస్తుండగా.. తమపై కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దాడిలో పాల్గొన్న నిందితుల్లో ఒకరు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత పట్నం నరేందర్‌రెడ్డితో ఎక్కువసార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్క్‌లో మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం చర్లపల్లి జైల్లో నరేందర్ రెడ్డి ఉన్నారు. అయితే పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. రీమాండ్‌ను కొట్టివేయాలని నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.


89 సార్లు ఫోన్‌కాల్స్‌ ..

1patnam-.jpg

అయితే.. లగచర్లలో భూసేకరణకు సంబంధించిన విచారణకు వెళ్లిన వికారాబాద్ కలెక్టర్‌ ప్రతీక్ జైన్‌, ఇతర అధికారులపై దాడికి పాల్పడిన ఘటనలో ఏ-1గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి కీలక కుట్రదారుడని రాష్ట్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పల్లె నాగేశ్వర్‌రావు చెప్పారు. ఏ-2గా ఉన్న సురేశ్‌, ఇతర నిందితులకు ఆర్థికంగా, నైతికంగా సహకరించారని తెలిపారు. సురేశ్‌తో దాదాపు 89 సార్లు ఫోన్‌కాల్స్‌ మాట్లాడారంటే కుట్రలో నరేందర్‌రెడ్డి పాత్ర ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. పిటిషనర్‌ ప్రోత్సాహంతోనే నిందితులు కలెక్టర్‌ సహా ఇతర అధికారులను హత్య చేయాలనే కుట్రతో దాడికి తెగబడ్డారని తెలిపారు. ఈ కేసులో కొడంగల్‌ కోర్టు జారీచేసిన రిమాండ్‌ ఉత్తర్వులను కొట్టేయాలంటూ పట్నం నరేందర్‌రెడ్డి హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పోలీసులు, ప్రభుత్వం తరఫున నాగేశ్వర్‌రావు వాదిస్తూ.. పిటిషనర్‌ అరెస్ట్‌ సందర్భంగా అన్ని నిబంధనలు పాటించామని అన్నారు. దాడికి కుట్రలో పిటిషనర్‌ పాత్ర స్పష్టంగా ఉందని.. ఇవన్నీ దర్యాప్తులో తేలుతాయని, అప్పటివరకు కోర్టు జోక్యం చేసుకోవద్దని విన్నవించారు. మరోవైపు పిటిషనర్‌ దిగువ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారని, పోలీసులు కస్టడీ కోరుతున్నారని.. దిగువ కోర్టులో ఈ పిటిషన్లు విచారణలో ఉన్నాయని తెలిపారు.


పోలీసులు నిబంధనలు పాటించలేదు..

పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదిస్తూ.. నరేందర్‌రెడ్డి అరెస్ట్‌ సందర్భంగా పోలీసులు నిబంధనలను పాటించలేదన్నారు. ఆయన ఘటనా స్థలంలో లేరనే విషయాన్ని గుర్తించాలన్నారు. పార్టీ కార్యకర్తలతో నాయకులు మాట్లాడడం సహజమని చెప్పారు. ‘మొదటి రిమాండ్‌ కేస్‌ డైరీలో పిటిషనర్‌ పేరు లేదు. భూములు కోల్పోతున్న రైతులు ఆవేశానికి గురైతే.. దానికి ప్రభుత్వాన్ని అస్తిరపర్చాలనే కుట్ర, హత్య చేయాలనే ఉద్దేశంతో దాడి వంటి తీవ్ర ఆరోపణలు చేశారు. కేబీఆర్‌ పార్కులో వాకింగ్‌ చేస్తుండగా మఫ్టీలో వచ్చిన 12 మంది పోలీసులు పిటిషనర్‌ను ఎత్తుకెళ్లారు. ఒక్క బీఎన్‌ఎ్‌సఎ్‌స 109 సెక్షన్‌ తప్ప మిగతావన్నీ ఏడేళ్లలోపు శిక్షపడే సెక్షన్లే. రిమాండ్‌ విధించరనే ఉద్దేశంతోనే 109సెక్షన్‌ పెట్టారు. కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాతే తనను ఏ-1గా చేర్చారని నిందితుడికి తెలిసింది. పిటిషనర్‌ ఎలాంటి నేరాంగీకార వాంగ్మూలం ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా పోలీసులు సొంతంగా రాసేసుకున్నారు. తాను ఏ స్టేట్‌మెంట్‌ ఇవ్వలేదని చర్లపల్లి జైల్లో ఉన్న పిటిషనర్‌ దిగువ కోర్టులో అఫిడవిట్‌ సమర్పించారు’ అని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ‘పిటిషనర్‌ ఒక మాజీ ఎమ్మెల్యే. ఆయనకు 1+1 సెక్యూరిటీ ఉంటుంది. పార్కులో వాకింగ్‌ చేస్తుండగా అరెస్ట్‌ చేయాల్సిన అవసరం ఏంటి? ఆయన ఏమైనా ఉగ్రవాదా? పారిపోతారా? ఇంటికి వెళ్లిన తర్వాత అరెస్ట్‌ చేసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాల్సింది’ అని వ్యాఖ్యానించింది. దీనికి పీపీ సమాధానం ఇస్తూ.. ఇంటి వద్దే అరెస్ట్‌ చేశామని, సన్నిహితులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. పిటిషనర్‌ ప్రత్యక్షంగా అక్కడ లేరని, కుట్ర ఆరోపణలే ఉన్నందున రిమాండ్‌ అవసరమేంటని ధర్మాసనం ప్రశ్నించింది. పిటిషనర్‌పాత్రకు సంబంధించిన వివరాలతోపాటు ప్రత్యక్ష సాక్షుల స్టేట్‌మెంట్లు ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది.


నరేందర్‌రెడ్డి భార్య కోర్టు ధిక్కరణ పిటిషన్‌..

తన భర్త అరెస్టు సందర్భంగా నిబంధనలను అనుసరించలేదని, బాధ్యులైన పోలీసు అధికారులను శిక్షించాలని పేర్కొంటూ నరేందర్‌రెడ్డి భార్య శృతి హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. ‘డీకే బసు’ సహా పలు సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘించిన పోలీసు అధికారులు వి.సత్యనారాయణ (ఐపీఎస్‌), కె.నారాయణరెడ్డి (ఐపీఎస్‌), సీఐ శ్రీధర్‌రెడ్డి, ఎస్సై అబ్దుల్‌ రవూఫ్‌ తదితరులను శిక్షించాలని పిటిషనర్‌ కోరారు.


patnam-narender-reddy.jpg

కొడంగల్‌ నుంచే రేవంత్‌రెడ్డి పతనం: నరేందర్‌రెడ్డి

రైతులకు మద్దతు ఇచ్చినందుకే తనపై అక్రమ కేసులు పెట్టారని కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆరోపించారు. రైతులకు అండగా ఉంటే జైలుకు పంపిస్తారా? అని ప్రశ్నించారు. పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై జరిగిన విచారణకు నరేందర్‌రెడ్డిని పోలీసులు కొడంగల్‌ కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం ఆయన కోర్టు ఎదుట మాట్లాడారు. రేవంత్‌రెడ్డి పతనం కొడంగల్‌ నుంచే ప్రారంభమవుతుందన్నారు. తనకు న్యాయస్థానాలపై గౌరవం ఉందని, ఈ కేసులో నిర్దోషిగా బయటకు వస్తానని చెప్పారు. లగచర్ల ఘటనలో ఏ-1గా ఉన్న నరేందర్‌రెడ్డిని కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. వాదనలు విన్న మున్సిఫ్‌ కోర్టు మేజిస్ట్రేట్‌.. తన నిర్ణయాన్ని వాయిదా వేసిన విషయం తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి

KTR: దేనికి విజయోత్సవాలు.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్...

Telangana: ఫుడ్ పాయిజన్‌కు కారణం ఇదే.. మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు

Hyderabad: రేపు 4,250 బైక్‌లతో దీక్షాదివస్‌ వరకు ర్యాలీ

Read Latest Telangana News and Telugu News

Updated Date - Nov 28 , 2024 | 05:00 PM